దుర్గా దేవ్ నాయుడు హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహించిన చిత్రం ‘ఐ యామ్ హ్యాండ్సమ్’ (Since 2009). కే ఫిలిమ్స్ బ్యానర్‌పై మహేష్ గుడారు సమర్పణలో కేదార్నాథ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. అన్విష కథానాయికగా నటించిన ఈ సినిమా ట్రైలర్ లాంచ్, ప్రీ-రిలీజ్ కార్యక్రమాన్ని హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో నిర్వహించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం జూన్ 12న థియేటర్లలో విడుదల కానుంది.
తండ్రీకొడుకుల అనుబంధం, కుటుంబ భావోద్వేగాల నేపథ్యంలో ఈ సినిమాను రూపొందించారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన ప్రముఖ నిర్మాత కేఎల్ దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ.. బలమైన కంటెంట్ ఉన్న సినిమాలు ప్రేక్షకులకు చేరువవుతాయని పేర్కొన్నారు. నటుడిగా, దర్శకుడిగా ఒకేసారి బాధ్యతలు నిర్వర్తించిన దుర్గా దేవ్ నాయుడును ఆయన అభినందించారు. ఏలూరు లాంటి చిన్న పట్టణం నుంచి వచ్చిన తాను, ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డానని హీరో, దర్శకుడు దేవ్ నాయుడు తెలిపారు.
పల్లెటూరి వాతావరణం, ఎమోషనల్ సన్నివేశాలతో కట్ చేసిన ట్రైలర్ సినిమాలోని ప్రధాన కథాంశాన్ని పరిచయం చేసింది. ఈ కార్యక్రమంలో హీరోయిన్ అన్విష, సంగీత దర్శకుడు ఎన్.ఎస్. ప్రసూ చిత్ర విశేషాలను పంచుకున్నారు. సినిమాలో చూపించిన భావోద్వేగాలు ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతాయని, సినిమా విజయం సాధిస్తుందని చిత్ర బృందం ఆశాభావం వ్యక్తం చేసింది.
