
కొరటాల శివ.. ‘మిర్చి’ సినిమాతో దర్శకుడిగా మారి సూపర్ హిట్ కొట్టిన ఈ రచయిత, రెండో సినిమా శ్రీమంతుడుతోనూ తన మార్క్ చూపెట్టి బాక్సాఫీస్ వద్ద సంచలనాలు నమోదు చేయిస్తున్నారు. సూపర్ స్టార్ మహేష్ హీరోగా దర్శకుడు కొరటాల శివ రూపొందించిన శ్రీమంతుడు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోన్న విషయం తెలిసిందే. బేసిక్ స్ట్రాంగ్ ఎమోషన్‌ను ఓ పెద్ద కథలో కమర్షియల్‌గా చెప్పే విషయంలో కొరటాల శివ రెండు సార్లు సక్సెస్ సాధించారు. ఊరిని దత్తత తీసుకొని బాగుపరచడమనే ఓ మెసేజ్ అంశం ముడిపడి ఉన్న కథను, కొరటాల శివ కమర్షియల్‌గా వర్కవుట్ అయ్యేలా చెప్పిన విధానం అందరినీ ఆకట్టుకుంది.
ఇక సినిమాకు బాక్సాఫీస్ వద్ద సూపర్ రెస్పాన్స్ రావడంతో పాటు ప్రేక్షకులు, పలువురు ప్రముఖుల నుంచి కూడా ప్రశంసలు దక్కుతున్నాయి. ఇక తాము ఎంతో కష్టపడి చేసిన ఈ సినిమా ఇంత పెద్ద హిట్ సొంతం చేసుకోవడం పట్ల దర్శకుడు కొరటాల శివ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సినిమా కథపై మొదట్నుంచీ మంచి నమ్మకం ఉండేదని, కచ్చితంగా హిట్ కొడతామనే అనుకున్నానని తెలిపారు. అయితే ఈ స్థాయి విజయం మాత్రం మంచి ఎనర్జీనిచ్చిందని ఆయన తెలిపారు. ఇలాంటి కథను చెప్పడం రిస్క్ అని ఎప్పుడూ అనుకోలేదని, మంచి సినిమాలను ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తూనే ఉంటారని కొరటాల శివ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.

