
దర్శకుడు బోయపాటి శ్రీనుతో ఎటువంటి విబేధాలు లేవు. ఆయనతో కలసి పనిచేయడం చాలా హ్యాపీ. మా ఇద్దరి మధ్య మంచి రిలేషన్ షిప్ ఉంది. ‘లెజెండ్’ సక్సెస్ మీట్లో జరిగిన సంఘటన చాలా చిన్నది. మా కాంబినేషన్లో మంచి హిట్స్ ఉన్నాయి. ‘అల్లుడు శీను’ తర్వాత బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాకు సంగీతం అందించడం చాలా ఆనందంగా ఉంది అని అన్నారు సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్.
‘లెజెండ్’ సక్సెస్ మీట్లో జరిగిన సంఘటన పట్ల మీడియాలో అనేక వార్తలు వచ్చాయి. వీరిద్దరి ప్రమేయం లేకుండానే దేవి, బోయపాటి మధ్య మనస్పర్ధలు, గొడవలు అంటూ కధనాలు ప్రసారం చేశారు. ‘లెజెండ్’ సక్సెస్ మీట్ తర్వాత రోజున వాటికి చెక్ పెట్టినా ఆగలేదు. యు.ఎస్.ఏ టూర్ విశేషాలు వెల్లడించడానికి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మరోసారి దేవి శ్రీ వివరణ ఇచ్చారు. భవిష్యత్లో కూడా బోయపాటి గారితో కలసి పని చేస్తానని చెప్పారు.
బోయపాటి దర్శకత్వం వహించిన 5 సినిమాలలో 3 సినిమాలకు దేవి సంగీతం అందించారు. అవి ఘన విజయం సాదించాయి. బోయపాటి – బెల్లంకొండ శ్రీనివాస్ సినిమా మ్యూజిక్ సిట్టింగ్స్ వచ్చే నెలలో ప్రారంభం అవుతాయి.