ఇళయరాజాకు ఆ స్టూడియోతో రుణం తీరిపోయినట్టే

ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఇళయరాజా, ప్రసాద్ స్టూడియో యాజమాన్యం మధ్యన కొన్నాళ్లుగా వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. 1976లో ప్రసాద్ స్టూడియోస్ అధినేత ఎల్వీ ప్రసాద్ తన స్టూడియోలో ఇళయరాజాకు ప్రత్యేకంగా ఒక రికార్డింగ్ స్టూడియో కేటాయించారు. అప్పటి నుండి ఇళయరాజా అందులోనే రికార్డింగ్ పనులు చేసుకుంటున్నారు. సుమారు నాలుగు దశాబ్దాలుగా ఇళయరాజ అందులోనే వర్క్ చేస్తున్నారు. ఆ స్టూడియోతో ఆయనకు ప్రత్యేక అనుబంధం ఏర్పడిపోయింది.

కానీ ఇటీవల ఎల్వీ ప్రసాద్ వారసులు ఇళయరాజాకు స్టూడియోను ఖాళీ చేయవలసిందిగా తెలిపారు. ఇళయరాజా ఈ విషయమై హైకోర్టుకు వెళ్లారు. అయినా స్టూడియో యాజమాన్యం మాత్రం ఇళయరాజాను స్టూడియోలోకి అనుమతించేది లేదని, దాని మీద సర్వ హక్కులు తమవేనని అంది. చివరకు ఇళయరాజా తనకు ఛాంబర్ మీద హక్కు అవసరంలేదని కేవలం అందులో ఉన్న తన ప్రాపర్టీలను వెనక్కు తీసుకెళ్లడానికి, ధ్యానం చేసుకోవడానికి అనుమతి కావాలని కోరారు. కోర్టు కూడ సామరస్యంగా సమస్యను పరిష్కరించుకోవాలని సూచించడంతో కొన్ని షరతులతో ఇళయరాజాను స్టూడియోలోకి అనుమతించారు యాజమాన్యం.

నిన్న సోమవారం ఉదయం 9 నుండి సాయంత్రం 4 గంటల వరకు ఇళయరాజా స్టూడియోలోకి వచ్చి తన పరికరాలను తీసుకుని వెళ్లవచ్చని తెలిపారు. అయితే ఇళయరాజా తాను రాకుండా తన సిబ్బందిని, న్యాయవాదిని పంపి తన పరికరాలను వెనక్కు తెచ్చుకున్నారు. యాజమాన్యం రికాడింగ్ స్టూడియో తలుపు పగులగొట్టి పరికరాలను వేరొక గదిలోకి తరలించారని తెలిసి నొచ్చుకుని ఇళయరాజా స్టూడియోకి వెళ్లలేదట. ఇక మీదట కూడ ఆయ్న ఆ స్టూడియోలో పనిచేసే అవకాశం లేదని అంటున్నారు ఆయన సన్నిహితులు.

Exit mobile version