హైదరాబాద్‌లో ఐమాక్స్ స్క్రీన్.. ఎక్కడ, ఎప్పుడు రానుందంటే..?

IMAX

హైదరాబాద్ సినీ లవర్స్‌కు ఇదొక అద్భుతమైన గుడ్ న్యూస్. నగరంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన IMAX స్క్రీన్‌ను తిరిగి తీసుకురావడానికి ఏషియన్ సినిమాస్ అధినేతలు సునీల్ నారంగ్, భరత్ నారంగ్.. ఐమాక్స్ కార్పొరేషన్‌తో ఒప్పందం కుదుర్చుకున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు, ఏషియన్ సినిమాస్ సంయుక్తంగా నిర్వహిస్తున్న AMB సినిమాస్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో గల ‘AMB క్లాసిక్ సుదర్శన్’లో ఈ సరికొత్త ఐమాక్స్ స్క్రీన్ రాబోతోంది.

వెరైటీ ఇండియా నివేదిక ప్రకారం, భారతదేశంలో మూడు కొత్త ‘ఐమాక్స్ విత్ లేజర్’ స్క్రీన్లను ఏర్పాటు చేసేందుకు ఈ ఒప్పందం కుదిరింది. అందులో మొదటి స్క్రీన్‌ను 2026 చివరి నాటికి హైదరాబాద్‌లోనే అందుబాటులోకి తీసుకురావడానికి ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. గతంలో ప్రసాద్స్ ఐమాక్స్ భారతదేశంలోనే ఒక ఐకానిక్ ల్యాండ్‌మార్క్‌గా ఉండేది, కానీ కొన్ని సాంకేతిక కారణాల వల్ల 2015 లో అక్కడ ఐమాక్స్ ప్రదర్శనలు నిలిచిపోవడంతో సినీ ప్రేమికులు గత పదేళ్లుగా ఈ అద్భుతమైన అనుభూతిని తీవ్రంగా మిస్ అవుతున్నారు.

హైదరాబాద్ ప్రజలకు సినిమాపై ఉన్న ప్రాణం, మక్కువ మరెక్కడా ఉండదని.. అలాంటి ప్రేక్షకులకు అత్యుత్తమ విజువల్ అనుభూతిని అందించడమే లక్ష్యంగా ఈ ప్రాజెక్ట్‌ను ముందుకు తీసుకెళ్తున్నామని ఏషియన్ సునీల్ హర్షం వ్యక్తం చేశారు. ఐమాక్స్ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ జియోవన్నీ డోల్చి మాట్లాడుతూ.. హైదరాబాద్ తమకు ఎంతో కీలకమైన నగరమని, ఇక్కడి ప్రేక్షకులు ఐమాక్స్ సినిమా కోసం వేరే నగరాలకు గంటల తరబడి ప్రయాణించి వెళ్లడం చూశాక, వీలైనంత త్వరగా ఇక్కడ స్క్రీన్‌ను పునరుద్ధరించాలని తాము నిర్ణయించుకున్నట్లు తెలిపారు.

Exit mobile version