వన్డేల నుంచి పంత్ ఔట్: ఏకంగా నలుగురు కొత్త వాళ్లకు ఛాన్స్.. టీమిండియా వన్డే జట్టులోకి ముగ్గురు SRH స్టార్లు!

ముఖ్య అంశాలు

  • 2026 ఆఫ్ఘనిస్థాన్ పర్యటనకు సంబంధించిన టెస్ట్, వన్డే జట్లకు శుభ్‌మన్ గిల్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. వన్డేల నుంచి రిషబ్ పంత్‌ను తప్పించారు.
  • సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) స్టార్ ఆటగాళ్లు ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, హర్ష్ దూబే వన్డే జట్టులో చోటు దక్కించుకున్నారు.
  • దేశవాళీ, ఐపీఎల్‌లో అదరగొట్టిన ప్రిన్స్ యాదవ్, గుర్నూర్ బ్రార్, హర్ష్ దూబే, మానవ్ సుతార్ తొలిసారిగా భారత జట్టుకు ఎంపికయ్యారు.

2026 ఆఫ్ఘనిస్థాన్ సిరీస్‌కు బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. యువ సంచలనం శుభ్‌మన్ గిల్ చేతికి టెస్ట్, వన్డే జట్ల పగ్గాలు అప్పగించారు. ఈ ఎంపికలో కొన్ని సంచలన నిర్ణయాలతో పాటు, కుర్రాళ్లకు పెద్దపీట వేశారు. ముఖ్యంగా ఐపీఎల్, దేశవాళీ టోర్నీల్లో దుమ్మురేపిన నలుగురు యువ ఆటగాళ్లకు తొలిసారిగా జాతీయ జట్టు నుంచి పిలుపొచ్చింది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లాంటి సీనియర్లు వన్డే జట్టులో ఉన్నప్పటికీ, భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని గిల్‌ను కెప్టెన్‌గా కొనసాగించడం ఆసక్తికరంగా మారింది.

సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) ఫ్యాన్స్‌కైతే ఇది నిజంగా పండగ లాంటి వార్తే. ఐపీఎల్‌లో ఆరెంజ్ ఆర్మీ తరఫున అదరగొడుతున్న ముగ్గురు ప్లేయర్లు వన్డే జట్టులో మెరిశారు. డాషింగ్ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్, యువ ఆల్‌రౌండర్ నితీష్ కుమార్ రెడ్డితో పాటు స్పిన్నర్ హర్ష్ దూబేకు వన్డే స్క్వాడ్‌లో చోటు దక్కింది. ఇక జట్టులోకి కొత్తగా వచ్చిన వారిలో ప్రిన్స్ యాదవ్, గుర్నూర్ బ్రార్, హర్ష్ దూబే, మానవ్ సుతార్ ఉన్నారు. వీళ్లంతా ఇటీవల కాలంలో తమ అద్భుత ప్రదర్శనలతో సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించి, నేరుగా జాతీయ జట్టులో బెర్త్ కన్ఫర్మ్ చేసుకున్నారు.

పంత్‌పై వేటు.. రాహుల్‌కు ప్రమోషన్

ఈ సిరీస్ ఎంపికలో రిషబ్ పంత్‌కు గట్టి షాక్ తగిలింది. వన్డే ఫార్మాట్ నుంచి అతడిని పూర్తిగా పక్కన పెట్టారు. వన్డేల్లో కీపర్లుగా కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్ ఎంపికయ్యారు. ఇక టెస్టుల్లో పంత్ ఉన్నప్పటికీ, వైస్ కెప్టెన్సీ బాధ్యతలను కేఎల్ రాహుల్‌కు అప్పగించారు. వన్డేలకు వైస్ కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ ఎంపికయ్యాడు.

మరోవైపు సీనియర్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాకు ఈ సిరీస్ నుంచి విశ్రాంతి కల్పించారు. యార్కర్ల కింగ్ జస్ప్రీత్ బుమ్రా కూడా ఆఫ్ఘన్ సిరీస్‌కు దూరం కానున్నాడు. త్వరలో జరగబోయే కీలకమైన ఇంగ్లండ్ పర్యటనతో బుమ్రా మళ్లీ మైదానంలోకి దిగుతాడని బోర్డు వర్గాలు తెలిపాయి. వన్డే జట్టులో రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా ఎంపికైనప్పటికీ, వారు మ్యాచ్‌లు ఆడటం అనేది పూర్తిగా వారి ఫిట్‌నెస్‌పైనే ఆధారపడి ఉంటుంది. మొత్తానికి యువ రక్తం, సీనియర్ల కలయికతో ఆఫ్ఘన్‌పై పోరుకు భారత్ సిద్ధమైంది.

Exit mobile version