భారతీయ యానిమేషన్ చిత్రాలకు ప్రత్యేక స్థానం లభిస్తున్న నేపథ్యంలో, ఇనికా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ‘కికీ & కోకో’ అనే హృదయాన్ని హత్తుకునే చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. పి. నారాయణన్ దర్శకత్వంలో పూర్తిగా భారతీయ సాంకేతిక నిపుణులతో విభిన్న తరహాలో రూపొందించిన ఈ యానిమేషన్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా పలు భాషల్లో విడుదల కానుంది.
దర్శకుడు పి. నారాయణన్ మాట్లాడుతూ, ఈ చిత్రం పిల్లల వినోదం, విద్యకు కొత్త నిర్వచనం చూపే ప్రయత్నమన్నారు. ఒక చిన్నారి కోకో, ఆమె పెంపుడు జంతువు కికీ మధ్య ఉన్న అపూర్వమైన బంధం, వారి ప్రేమ, జీవిత పాఠాలతో నిండిన మాంత్రిక ప్రయాణాన్ని ఈ సినిమా వివరిస్తుందని ఆయన తెలిపారు. అనిమేషన్ చిత్రాలు హాలీవుడ్‌కే పరిమితం కాదనీ, ఈ జోనర్లో భారతీయ సినీ పరిశ్రమ కూడా సిద్ధంగా ఉందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. నేటి బాలలను ప్రభావితం చేసే విద్యాత్మక కథలు చాలా అవసరమని నారాయణన్ పేర్కొన్నారు.
క్రియేటివ్ ప్రొడ్యూసర్ జి.ఎం. కార్తికేయన్ మాట్లాడుతూ, ‘కికీ & కోకో’ కేవలం సినిమా మాత్రమే కాదని, స్నేహం, ప్రేమ, విలువైన పాఠాల వేదిక అని చెప్పారు. కుటుంబ సభ్యులంతా కలిసి చూసి ఆనందించే చిరస్మరణీయమైన అనుభూతిని ఈ చిత్రం అందిస్తుందని తెలిపారు. త్వరలో థియేటర్లలో విడుదల కానున్న ఈ సినిమా కోసం ప్రత్యేకమైన మర్చండైజ్, విద్యా రూపకల్పనలను కూడా రూపొందించినట్లు ఆయన వెల్లడించారు.
