ఈ ఏడాది `రాక్షసుడు`తో హిట్ అందుకున్న యువ కథానాయకుడు బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా కందిరీగ, రభస, హైపర్ చిత్రాల దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ డైరెక్షన్ లో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. కాగా ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకి సంబంధించి ఓ ఆసక్తికరమైన అప్ డేట్ తెలిసింది. డైరెక్టర్ సంతోష్ శ్రీనివాస్ వర్కింగ్ స్టైల్ కు, ఈ సినిమాకి కెమెరామెన్ గా పనిచేస్తోన్న డూడ్లీ వర్కింగ్ స్టైల్ కి పొసగలేదట. కొన్ని షాట్స్ మేకింగ్ లో ఇద్దరికీ మధ్య మనస్పర్ధలు వచ్చాయట. దాంతో డూడ్లీ ఈ సినిమా నుండి తప్పుకున్నట్లు తెలుస్తోంది. అయితే డూడ్లీ బాలీవుడ్లో ‘చెన్నై ఎక్స్‌ప్రెస్, సింగం’ వంటి సినిమాలకు సినిమాటోగ్రాఫర్ గా పనిచేశారు.
ఇక బెల్లంకొండ శ్రీనివాస్ – సంతోష్ శ్రీనివాస్ సినిమాకు ఛోటా కె.నాయుడు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారట. బెల్లంకొండ శ్రీనివాస్ కోసం డైరెక్టర్ సంతోష్ శ్రీనివాస్ యాక్షన్ స్క్రిప్ట్‌ను సిద్ధం చేశాడట. ఈ చిత్రంలో బెల్లంకొండ శ్రీనివాస్ సరికొత్త లుక్‌లో కనపడబోతున్నారు. కాగా సుమంత్ మూవీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై జి.సుబ్రహ్మణ్యం ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.
అవినాష్ కొల్ల ఆర్ట్ డైరెక్టర్. రాక్‌స్టార్ దేవిశ్రీప్రసాద్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. `అల్లుడుశీను`, `జయజానకి నాయక` చిత్రాల తర్వాత బెల్లంకొండ శ్రీనివాస్, దేవిశ్రీ ప్రసాద్ కాంబినేషన్లో రూపొందుతోన్న హ్యాట్రిక్ చిత్రమిది.
