
‘టచ్ స్టోన్’ యాడ్ ఏజెన్సీతో పబ్లిసిటీ రంగంలో విజయవంతమైన దొరైస్వామి.. ‘రోమియో’ సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో నిర్మాతగా అడుగుపెడుతున్నారు. సాయి రామ్ శంకర్, అడోనిక జంటగా నటించిన ఈ సినిమాకు పూరి జగన్నాధ్ కథ, మాటలు అందించారు. పూరి శిష్యుడు గోపి గణేష్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. అక్టోబర్ 10న విడుదలవుతున్న ఈ సినిమా విశేషాలను తెలియజేయడానికి నిర్మాత దొరైస్వామి మీడియాతో సమావేశం అయ్యారు. ఆయన చెప్పిన విశేషాలు మీకోసం..
ప్రశ్న) యాడ్ ఏజెన్సీ రంగంలో ఉన్న మీరు నిర్మాతగా ఎందుకు మారారు..?
స) నేను జె.యన్.టి.యు యూనివర్సిటీలో బాచిలర్ అఫ్ ఫైన్ ఆర్ట్స్(బి.యఫ్.ఏ) చేశాను. సినిమాటోగ్రఫీ నా సబ్జెక్ట్. ‘రోమియో’ డైరెక్టర్ గోపి గణేష్, సినిమాటోగ్రాఫర్ పిజి విందా నా జూనియర్స్. బి.యఫ్.ఏ పూర్తి చేసిన తర్వాత టచ్ స్టోన్ యాడ్ ఏజెన్సీ ప్రారంభించి వ్యాపారంలో స్థిరపడ్డాను. స్టేట్, సెంట్రల్ గవర్నమెంట్ యాడ్స్ మా సంస్థ ద్వారా చేస్తున్నాం. మొదటి నుండి నాకు సినిమా రంగం అంటే ఆసక్తి. 20 ఏళ్ళ నుండి గోపి గణేష్, నేను ఎప్పుడూ టచ్ లో ఉండేవాళ్ళం. నాకు తమ్ముడులాంటి వాడు. ఒక రోజు ‘రోమియో’ స్టొరీ లైన్ చెప్పాడు. ఈ సినిమా నాకు ప్లస్ అవుతుంది. మీరు ప్రొడ్యూస్ చేయాలి అన్నాడు. సరే అని సినిమా ప్రారంభించాం.
ప్రశ్న) ‘రోమియో’ కథలో స్పెషాలిటీ ఏంటి..?
స) ఈ సినిమా స్టొరీ లైన్ నాకు బాగా నచ్చింది. ఇప్పటి వరకు తెలుగు తెరపై చాలా ప్రేమకథలు వచ్చాయి. వాటితో పోలిస్తే ఈ సినిమా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. పూరి రాసిన ఈ ప్రేమ కథ సరికొత్తగా ఉంటుంది.
ప్రశ్న) పూరి జగన్నాధ్ కథకు గోపి గణేష్ ఎంత వరకు న్యాయం చేశాడు..?
స) నా మొదటి సినిమా కంటే గోపి గణేష్ ‘రోమియో’ను 10 రెట్లు బాగా తీశాడని పూరి గారు కాంప్లిమెంట్ ఇచ్చారు. అది నిజం. ఫ్యూచర్ లో పూరి గారికి టఫ్ కాంపిటీషన్ ఇస్తాడు. గోపి గణేష్ ఒక పని రాక్షసుడు. ప్రతి ఫ్రేమ్, సీన్ అనుకున్న విధంగా వచ్చే వరకు కష్టపడతాడు. సినిమాను అద్బుతంగా తెరకెక్కించాడు. సాధారణంగా పూరి జగన్నాధ్ సినిమాలో కథ, మాటలు హైలైట్ గా నిలుస్తాయి. ఈ సినిమాలో వాటితో పాటు గోపి గణేష్ డైరెక్షన్ కూడా హైలైట్ గా నిలుస్తుంది. ప్రతి సన్నివేశం ఒక అందమైన పెయింటింగ్ లా ఉంటుంది. దర్శకత్వంతో పాటు నిర్మాణ భాద్యతలను కూడా తనే చూసుకున్నాడు.
ప్రశ్న) సాయి రామ్ శంకర్, అడోనికలు ఎలా నటించారు..?
స) సాయి రామ్ శంకర్ నటించిన గత సినిమాలతో పోలిస్తే మా సినిమాలో చాలా క్యూట్ గా, స్టైలిష్ గా కనిపిస్తాడు. అతని లుక్ మీద గోపి గణేష్ స్పెషల్ కేర్ తీసుకున్నాడు. ఎంత అందంగా ఉన్నాడో.. అంతే అద్బుతంగా నటించాడు. హీరోయిన్ అడోనిక సహజ నటి. ఆ అమ్మాయి కూడా బాగా నటించింది.
ప్రశ్న) రవితేజ చేత గెస్ట్ రోల్ చేయించాలనే ఐడియా ఎవరిదీ..?
స) ముందుగా.. సాయి అడగగానే ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా మా సినిమాలో నటించడానికి అంగీకరించిన రవితేజ గారికి చాలా చాలా థాంక్స్. రవితేజ చేత గెస్ట్ రోల్ చేయించాలనే ఐడియా గోపి గణేష్ & పూరి జగన్నాధ్ లదే. కథను మలుపు తిప్పే పాత్రలో సాయి రామ్ శంకర్ సోదరుడిగా రవితేజ కనిపిస్తారు. ఆయన నటించిన సన్నివేశాలు ప్రేక్షకులను అలరిస్తాయి.
ప్రశ్న) సునీల్ కశ్యప్ సంగీతం గురించి చెప్పండి..?
స) ‘రోమియో’ పాటలు విన్న ప్రతి ఒక్కరూ రెహమాన్ పాటల్లా ఉన్నాయని ప్రశంసిస్తున్నారు. సాంగ్స్, సినిమా రీ రికార్డింగ్ అంతా చెన్నైలో చేశాం. రెహమాన్ వద్ద పని చేసే మ్యుజిషియన్లు చేత సునీల్ కశ్యప్ ఈ సినిమాకు పని చేయించాడు. పూరి జగన్నాధ్ కూడా సినిమాలో ఐదు పాటలు అద్భుతంగా కుదిరాయని అన్నారు.
ప్రశ్న) సినిమా విడుదలలో జాప్యానికి ఆర్ధిక సమస్యలే కారణమా..?
స) ఆర్ధిక సమస్యల వలన లేటుగా విడుదల చేస్తున్నాం అనే వార్త అవాస్తవం. కథ డిమాండ్ మేరకు ఎక్కువ భాగం స్విట్జర్లాండ్, వేనీస్, రోమ్ లలో వింటర్ సీజన్లో షూటింగ్ చేశాం. ఇండియా వచ్చిన తర్వాత కొన్ని సన్నివేశాలు చూశాకా ఇంకా బాగా షూట్ చేయాలని డిసైడ్ అయ్యాం. ఆ సన్నివేశాలు రీ షూట్ చేయడానికి నెక్స్ట్ వింటర్ సీజన్ వరకు వెయిట్ చేయాల్సి వచ్చింది. అందుకే సినిమా విడుదల ఆలస్యం అయ్యింది.
ప్రశ్న) ‘రోమియో’తో మధుర శ్రీధర్ ఎలా అసోసియేట్ అయ్యారు..?
స) 15 రోజుల క్రితం మధుర శ్రీధర్ గారు ఎయిర్ పోర్ట్ లో కలిశారు. ‘రోమియో’ ట్రైలర్స్ చూశాను, బాగున్నాయి అని చెప్పారు. తర్వాత మరోసారి మా ఆఫీసులో కలిశాం. ‘రోమియో’ కథ చెప్పాను, కొన్ని సన్నివేశాలు చూసిన శ్రీధర్ గారు నేను డిస్ట్రిబ్యూట్ చేస్తానని అన్నారు. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో, ప్రేక్షకులలో అతనికి మంచి ఇమేజ్ ఉంది. అలాంటి వ్యక్తి డిస్ట్రిబ్యూట్ చేయడం సినిమాకు ప్లస్ అవుతుందని నేను, పూరి గారు భావించాం. ‘రోమియో’ ద్వారా శ్రీధర్ లాంటి మంచి మిత్రుడు లభించడం ఆనందంగా ఉంది.
ప్రశ్న) మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి..?
స) ‘రోమియో’ తర్వాత ‘మాతృదేవోభవ’ లాంటి సినిమా నిర్మించాలని అనుకుంటున్నాను. కన్నతండ్రే పిల్లలను చంపిన సంఘటనలు నాలో ఆవేదన కలిగించాయి. గత రెండు మూడు రోజులుగా ఎక్కడ చూసినా ఈ విషయం మీద డిస్కస్ చేస్తున్నారు. ఈ సంఘటనల స్ఫూర్తితో ఒక సందేశాత్మక సినిమా నిర్మిస్తాను. దర్శకుడు, నటీనటుల వివరాలు త్వరలో వెల్లడిస్తాం. అంటూ ఇంటర్వ్యూని ముగించారు.