సమీక్ష : బైకర్ – రేసింగ్ ట్రాక్‌పై శర్వానంద్, రాజశేఖర్‌ల ఎమోషనల్ రైడ్

Biker Movie

విడుదల తేదీ : ఏప్రిల్ 03, 2026

123తెలుగు.కామ్ రేటింగ్ : 3.25/5

నటీనటులు : శర్వానంద్, డా. రాజశేఖర్, మాళవిక నాయర్ తదితరులు.
దర్శకుడు : అభిలాష్ రెడ్డి
నిర్మాతలు: వంశీ కృష్ణా రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి
సంగీతం : జిబ్రాన్
సినిమాటోగ్రఫీ : జె. యువరాజ్
ఎడిటింగ్ : అనిల్ పసల

సంబంధిత లింక్స్ :  ట్రైలర్ 

విభిన్న కథలతో ప్రేక్షకులను అలరించే శర్వానంద్.. ఈసారి ‘బైకర్’ అనే స్పోర్ట్స్ డ్రామాతో మన ముందుకు వచ్చారు. అభిలాష్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సీనియర్ హీరో డా. రాజశేఖర్ కీలక పాత్ర పోషించారు. మరి సరికొత్త మోటోక్రాస్ రేసింగ్ కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు సమీక్షలో చూద్దాం.

కథ:

వికాస్ నారాయణ్ అలియాస్ విక్కీ (శర్వానంద్) ఓ టాప్ క్లాస్ మోటోక్రాస్ రేసర్. చిన్నప్పటి నుంచే అతని తండ్రి సునీల్ నారాయణ్ (రాజశేఖర్) విక్కీకి కఠినమైన శిక్షణ ఇచ్చి రేసర్‌గా తీర్చిదిద్దుతాడు. అంతా సవ్యంగా సాగుతుందనుకున్న సమయంలో.. విక్కీ సడెన్‌గా రేసింగ్ వదిలేస్తాడు. ఈ నిర్ణయం అతని తండ్రిని తీవ్రంగా బాధిస్తుంది.

అసలు విక్కీ రేసింగ్ ఎందుకు వదిలేశాడు? అనన్య (మాళవిక నాయర్)తో అతనికి ఉన్న సంబంధం ఏంటి? విక్కీ జీవితంలో ఆమె పాత్ర ఏమిటి? రేసింగ్ మానేశాక విక్కీ జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది? అన్నదే ఈ సినిమా కథ.

ప్లస్ పాయింట్స్:

టాలీవుడ్‌లో ఇప్పటివరకు ఎన్నో స్పోర్ట్స్ డ్రామాలు వచ్చినా.. మోటోక్రాస్ రేసింగ్ అనే పాయింట్‌ను ఎవరూ టచ్ చేయలేదు. ఈ కొత్త నేపథ్యమే ‘బైకర్’ సినిమాకు ప్రధాన బలం. కథలో కొన్ని అంశాలు రొటీన్‌గా అనిపించినా.. తెలుగు తెరకు కొత్తదైన ఈ స్పోర్ట్ ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. రేసింగ్ సన్నివేశాలను చిత్రీకరించిన విధానం, యాక్షన్ కొరియోగ్రఫీ అద్భుతంగా ఉన్నాయి. కొన్ని సీన్స్ అయితే సీటు అంచున కూర్చోబెడతాయి. మన దగ్గర పెద్దగా పరిచయం లేని ఆటను, ఎమోషన్స్‌తో ముడిపెట్టి సామాన్య ప్రేక్షకుడికి కనెక్ట్ చేయడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు.

శర్వానంద్ లుక్ చాలా ఫిట్‌గా ఉంది. ఒక ప్రొఫెషనల్ రేసర్‌గా తన నటనతో పూర్తి న్యాయం చేశాడు. ఎమోషనల్ సీన్స్‌లో కూడా తన మార్క్ చూపించాడు. ముఖ్యంగా డా. రాజశేఖర్‌తో వచ్చే సన్నివేశాలు చాలా బాగా పండాయి. ఈ చిత్రంతో యాంగ్రీ మ్యాన్ రాజశేఖర్ తన కెరీర్‌లో మరో మెట్టు ఎక్కారని చెప్పొచ్చు. హుందాగా ఉంటూనే, పాత్రకు తగ్గట్టుగా ఆయన ఒదిగిపోయిన తీరు మెప్పిస్తుంది. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఆయనకు ఇది ఒక గొప్ప ఆరంభం. సెకండాఫ్ ఎమోషనల్‌గా బాగా కనెక్ట్ అవుతుంది. మాళవిక నాయర్ తన పరిధి మేరకు చక్కగా నటించింది.

మైనస్ పాయింట్స్:

కథలోని కీలక మలుపుల దగ్గర దర్శకుడు సేఫ్ గేమ్ ఆడాడు. కొత్తదనం కోసం ప్రయత్నించకుండా రొటీన్ ఫార్మాట్‌ను ఎంచుకోవడం కాస్త నిరాశపరుస్తుంది. ముఖ్యంగా రేసింగ్ సమయంలో హీరో పడే మానసిక సంఘర్షణను ఇంకాస్త బలంగా చూపించి ఉంటే సినిమా స్థాయి మరోలా ఉండేది. హీరోకు ఎదురయ్యే సవాళ్లు, స్పాన్సర్‌షిప్ ఎపిసోడ్స్ చాలా సింపుల్‌గా, ఎలాంటి కష్టం లేకుండా పరిష్కారం కావడం వల్ల కథలో వాస్తవికత లోపించినట్లు అనిపిస్తుంది.

రేసింగ్ సన్నివేశాలు అద్భుతంగా ఉన్నప్పటికీ, ఆ రేస్‌కు దారితీసే పరిస్థితులను ఇంకాస్త ఎఫెక్టివ్‌గా రాసుకోవాల్సింది. హీరో హీరోయిన్ల మధ్య వచ్చే కాన్ఫ్లిక్ట్ పాయింట్ బాగున్నా.. దాన్ని పూర్తిగా వాడుకోలేకపోయారు. ఫస్టాఫ్ స్క్రీన్‌ప్లే కాస్త నెమ్మదిగా సాగుతుంది, కొన్ని చోట్ల బోర్ కొట్టిస్తుంది.

సాంకేతిక విభాగం:

థ్రిల్లింగ్ సీన్స్‌లో జిబ్రాన్ అందించిన నేపథ్య సంగీతం ప్రాణం పోసింది. సౌండ్ డిజైన్ వర్క్ చాలా బాగుంది. సినిమాటోగ్రాఫర్ జె. యువరాజ్ రేసింగ్ సీన్స్‌ను అత్యద్భుతంగా కెమెరాలో బంధించారు. విజువల్స్ గ్రాండ్‌గా ఉన్నాయి. సెకండాఫ్‌లో ఎడిటింగ్ పర్వాలేదనిపించినా.. ఫస్టాఫ్‌లో అనిల్ పసల కొన్ని అనవసరమైన సీన్స్‌కు కత్తెర వేయాల్సింది. నిర్మాణ విలువల పరంగా వంశీ కృష్ణా రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి ఎక్కడా రాజీ పడలేదు. ఇక దర్శకుడు అభిలాష్ రెడ్డి గురించి చెప్పాలంటే.. ఒక కొత్త పాయింట్‌ను తీసుకొని ఎంగేజింగ్‌గా మలచడంలో సఫలం అయ్యాడు. కథలో అక్కడక్కడా కనిపించే కొన్ని రొటీన్ మూస సన్నివేశాలను (clichés) పక్కన పెట్టి ఉంటే సినిమా ఇంకా అద్భుతంగా వచ్చేది.

తీర్పు:

మొత్తం మీద ‘బైకర్’ ఒక ఎంగేజింగ్ స్పోర్ట్స్ డ్రామా. ఇప్పటివరకు టచ్ చేయని మోటోక్రాస్ రేసింగ్ బ్యాక్‌డ్రాప్‌తో పాటు, శర్వానంద్, డా. రాజశేఖర్‌ల అద్భుతమైన నటన సినిమాకు హైలైట్‌గా నిలుస్తాయి. రేసింగ్ సన్నివేశాలు కూడా థ్రిల్ చేస్తాయి. కాకపోతే, నెమ్మదిగా సాగే ఫస్టాఫ్, కథలో కొన్ని రొటీన్ అంశాలు కాస్త మైనస్. స్పోర్ట్స్ డ్రామాలు, ఎమోషనల్ కథలను ఇష్టపడే వారికి ఈ సినిమా ఒక మంచి ఛాయిస్.

123telugu.com Rating: 3.25/5

Reviewed by 123telugu Team 

Exit mobile version