ఇంటర్వ్యూ : ఎన్టీఆర్ – తెలుగు సినిమాకు పూర్వ వైభవం వచ్చింది!

ntr

యంగ్ టైగర్ ఎన్టీఆర్.. తన అభిమానులను, ప్రేక్షకులను మెప్పించేందుకు ‘నాన్నకు ప్రేమతో’ అనే సినిమాతో ఈ సంక్రాంతి సీజన్‌కు వచ్చేస్తోన్న విషయం తెలిసిందే. మ్యాజిక్ స్క్రీన్‌ప్లేతో మెప్పించే సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా జనవరి 13న భారీ ఎత్తున విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా నాన్నకు ప్రేమతో సినిమా గురించి ఎన్టీఆర్‌తో జరిపిన ఇంటర్వ్యూ విశేషాలు…

ప్రశ్న) సంక్రాంతి సీజన్‌కు మూడు ఇతర సినిమాలతో కలిసి వస్తున్నారు. ఇదే సీజన్‌కు రావడానికి ప్రత్యేక కారణం?

స) సీజన్ అనేదే ప్రత్యేక కారణం కదండీ. తెలుగు సినిమాకు ఉన్న మూడే మూడు అతిపెద్ద సీజన్స్‌లో సంక్రాంతి సీజన్ ఒకటి. మొదట్నుంచీ నాన్నకు ప్రేమతో సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేయాలనే ప్లాన్ చేశాం. అలా ప్లాన్ ప్రకారమే సంక్రాంతికే వస్తున్నాం. ఇక ఒకేసారి నాలుగు సినిమాలు రావడమంటారా.. అది ఏళ్ళుగా వస్తున్నదే! చెప్పాలంటే ఈ సీజన్‌కు ఒకేసారి మూడు, నాలుగు సినిమాలు విడుదలై అన్నీ హిట్ కొట్టిన రోజులు కూడా ఉన్నాయి. అదే విధంగా ఈసారి కూడా అన్ని సినిమాలూ హిట్ కొట్టాలనే కోరుకుంటున్నా.

ప్రశ్న) నాన్నకు ప్రేమతో మీ కెరీర్‌లో 25వ సినిమా. మీరు కూడా ఈ సినిమాను స్పెషల్ అంటూ వస్తున్నారు. మిమ్మల్ని అంతగా ప్రభావితం చేసిన విషయం ఏంటి?

స) ఈ నంబర్ అనేదాని గురించి నేనైతే అస్సలు ఆలోచించలేదు. 25వ సినిమానా, 26వ సినిమానా అన్నది పక్కనబెడితే, నాన్నకు ప్రేమతో ఓ మంచి సినిమా. ఏ స్థాయి హిట్ అవుతుందీ? అన్న ఆలోచనను పక్కనబెడితే ఇలాంటి ఒక సినిమా చేయడం ఆత్మ సంతృప్తినిచ్చింది. ఈ సినిమాలోని బేసిక్ ఎమోషన్ నన్ను కట్టిపడేసింది. ఆ ఎమోషన్ అంతలా వెంటాడింది కాబట్టే ఈ సినిమాను విపరీతంగా ప్రేమించా.

ప్రశ్న) సినిమా ఎలా ఉండబోతోంది?

స) నాన్నకు ప్రేమతో చాలా సింపుల్, ప్లేన్ స్టోరీ. బేసిక్ ఎమోషన్ ఏంటన్నది సినిమాలోనే చూడాలి. కథైతే కొత్తదని చెప్పను. కథనం మాత్రం చాలా చాలా కొత్తగా ఉంటుంది. తండ్రి-కొడుకుల సెంటిమెంట్‌ను బేస్ చేసుకొని చాలా సినిమాలే వచ్చాయి. ఇందులో అది చాలా కొత్తగా ఉంటుంది. ఆ కొత్తగా ఉండే అంశం ఏంటీ అన్నది మీరే సినిమా చూసి తెలుసుకోవాలి.

ప్రశ్న) ట్రైలర్ చూస్తే సినిమా మైండ్‌గేమ్‌లా ఉంటుందన్నట్లు కనిపిస్తోంది. మరి అది ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా ఉంటుందా?

స) నిజమే! ఈ సినిమా స్క్రీన్‌ప్లే కూడా మైండ్‌గేమ్ ప్రకారంగా నడుస్తుంది. అయితే అది సాధారణ ప్రేక్షకుడి దగ్గర్నుంచి మొదలుకొని ప్రతి ఒక్కరికీ అర్థమయ్యేలా ఉంటుంది. ఆ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నాం. అందరికీ అర్థమయ్యేలా, అందరూ ఎంజాయ్ చేసే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది.

ప్రశ్న) ఎన్టీఆర్ మార్క్ మాస్ ఎలిమెంట్స్ ఈ సినిమాలో ఉంటాయా?

స) ఈ మాస్, క్లాస్ అన్న అంశాలను నేను పెద్దగా పట్టించుకోను. సినిమాను అందరూ ఒకేలా ఎంజాయ్ చేస్తారు. ఇక నాన్నకు ప్రేమతో సినిమా విషయంలో నేను చెప్పేదేంటంటే.. ఇదో ప్రత్యేక సినిమా. ఇందులో కమర్షియాలిటీ కోసం పెట్టిన పాటలు గానీ, ఫైట్లు గానీ, ఎక్స్‌ట్రా సన్నివేశాలు గానీ అస్సలుండవు. ఆడియన్స్‌ను పక్కదారి పట్టించడం తప్పు. ఈ సినిమాలో ఏం చెప్పనున్నామో ట్రైలర్ ద్వారా స్పష్టం చేశాం. ప్రేక్షకులు కూడా ఈ సినిమా అదే కోణంలో చూస్తున్నారు. సో, ఇబ్బందేం లేదు.

ప్రశ్న) దర్శకుడు సుకుమార్, ఆయన సినిమాల గురించి ఎప్పుడు మాట్లాడినా చాలా ఎగ్జైట్ అవుతున్నారు. ఆయనలో అంతగా నచ్చిన అంశం ఏంటి?

స) సుకుమార్ సినిమాలంటే నాకు చాలా చాలా ఇష్టం. ఆయన సినిమాలు కొన్ని బాక్సాఫీస్ వద్ద పరాజయం చెందినా సినిమాను తక్కువ చేసి ఎవ్వరూ చూడరు. ఆయన సినిమాలను తీసి పారేయడం గానీ, ఈ సినిమా బాలేదు అని చెప్పడం గానీ జరగదు. సుకుమార్ సినిమా అంటే ఓ రెస్పెక్ట్ ఉంటుంది. ఆయనతో సినిమా చేయాలని ఎప్పట్నుంచో అనుకుంటే అది నాన్నకు ప్రేమతోతో కుదిరింది. ప్రతిక్షణం సినిమా గురించే ఆలోచిస్తూ, ఏదో ఒకటి రాస్తూ, అదో మహా యజ్ఞంలా సినిమా చేస్తారు. అలాంటి దర్శకులు చాలా చాలా అరుదుగా కనిపిస్తారు.

ప్రశ్న) సుకుమార్ సినిమా అంటే హీరో క్యారెక్టర్‌లో కొంత నెగటివ్ షేడ్ కనిపిస్తూ ఉంటుంది. ఈ సినిమాలో మీ క్యారెక్టర్ కూడా అలా ఉండబోతోందా?

స) లేదు. నెగెటివ్ షేడ్ అనేకంటే సుకుమార్ సినిమాల్లోని హీరో పాత్ర కొంచెం కొత్తగా ఉంటుంది. అది చూడ్డానికి నెగెటివ్‌గా కనిపిస్తుందేమో! ఈ సినిమాలో నేను లండన్ బేస్డ్ ఎన్నారైగా కనిపిస్తా. నాన్న చివరి కోరికను నెరవేర్చే కొడుకుగా కనిపిస్తా. ఆ పాత్రలో వైవిధ్యమైన ఎమోషన్ ఉంటుంది. అది నాకు కూడా కొత్తే!

ప్రశ్న) లుక్స్ పరంగా, మీ బాడీ లాంగ్వేజ్ పరంగా కొత్తగా కనిపిస్తున్నారు. ఈ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు?

స) అదంతా సుక్కూ మ్యాజిక్కే! నేనైతే నా లుక్ విషయంలో చాలా కంగారుపడ్డా. ఇది ప్రేక్షకులకు నచ్చుతుందా? లేదా? అన్న భయం విపరీతంగా ఉండేది. అయితే ఈ లుక్‌కు వచ్చిన అద్భుతమైన రెస్పాన్స్‌తో అన్ని భయాలూ పోయాయి. బాడీ లాంగ్వేజ్ విషయంలోనూ సుక్కూ చాలా జాగ్రత్తలు చెప్పేవాడు. ఇదేంటి ఈయన ఇలా చెబుతున్నాడు అని మొదట్లో అనిపించినా, డబ్బింగ్ అప్పుడు సుకుమార్ ఎంత డీటైలింగ్ వెళతాడో తెలిసింది.

ప్రశ్న) ఈ సినిమాలోని కొన్ని పాటలు మీ నిజ జీవితాన్ని ప్రతిబింబిస్తున్నాయని, కావాలనే కొన్ని లిరిక్స్ అలా పెట్టారని వినిపిస్తోంది. దాని గురించి మీరేమంటారు?

స) ఇవన్నీ ఎక్కణ్ణుంచి పుట్టుకొస్తాయో నాకైతే అర్థం కాదు. ఈ సినిమాలోని పాటలన్నీ సందర్భానుసారంగా, కథకు సంబంధించిన నేపథ్యం నుంచే వస్తాయి. ఇక సినిమాలో ఏం చేసినా దాన్ని నిజ జివితానికి అన్వయించి చూస్తే ఎవ్వరూ సినిమా చేయలేరు.

ప్రశ్న) మేకింగ్ పరంగా ఈ సినిమాలో కొత్తదనం ఏం చూపారు? డ్యాన్సుల విషయంలో మీ స్టైల్‌కు భిన్నంగా వెళ్ళారా?

స) మేకింగ్ పరంగా ఈ సినిమాలో చాలాచోట్ల ప్రయోగాలు చేశాం. ఎక్కువగా నిలకడగా ఉండే షాట్స్ కాకుండా ప్రతీ షాట్‌లో ఏదో తెలియని మూవ్‌మెంట్ ఉండేలా జాగ్రత్త పడ్డాం. అది కథలోని ఎమోషన్‌కి బాగా కనెక్ట్ అవుతుంది. ఇక డ్యాన్సుల విషయంలో స్టైల్ మార్చేశానండీ. అన్ని పాటలకూ దయ్యం డ్యాన్స్ చేయడాన్ని ప్రేక్షకులు కూడా ఇష్టపడడం లేదు. ఈ సినిమాలో నా స్టైల్ డ్యాన్స్ ఒకపాటలో ఉంటుంది. మిగతావన్నీ సందర్భానుసారంగా ఉంటాయి.

ప్రశ్న) నాన్నకు ప్రేమతోలో చివరి 45నిమిషాలు చాలా ఎమోషనల్‌గా ఉంటుందని చెబ్తూ వస్తున్నారు. దాని గురించి చెప్పండి?

స) నిజమే! చివరి 45 నిమిషాలు సినిమా చాలా ఎమోషనల్‌గా సాగుతుంది. సినిమా కథే అలాంటిది. ఈ టైంలోనే వచ్చే ఒక సీన్ గురించి చెప్తూ సుకుమార్ ఎమోషనల్ అయిపోయారు. అదే సమయానికి నేను, సినిమాటోగ్రాఫర్ విజయ్ కూడా ఏడ్చేశాం. ఇక ఆ సీన్ చేసేటప్పుడైతే నేను పూర్తిగా ఇన్వాల్వ్ అయిపోయా. ఆ సీన్ నుంచి బయటకు రావడానికి చాలా టైమ్ పట్టింది.

ప్రశ్న) ఒక సన్నివేశం చేసేముందు ప్రాక్టీస్ ఏమైనా చేస్తారా?

స) లేదండీ. నేను సినిమా మొదలుపెట్టేముందే ఆ పాత్రను ఓన్ చేసుకుంటా. ఇక ఆ తర్వాత ఆ ఫ్లోలో చేయడమే కానీ ప్రత్యేకంగా ప్రాక్టీస్ ఏమీ చెయ్యను. ఒక పాత్రను అర్థం చేస్కొని దాన్ని ఓన్ చేస్కోవడానికైనా, అందులోనుంచి బయటకు రావడానికైనా నాకు చాలా టైమ్ పడుతుంది.

ప్రశ్న) ‘నాన్నకు ప్రేమతో’ బాక్సాఫీస్ పర్ఫామెన్స్ ఎలా ఉంటుందనుకుంటున్నారు?

స) బాక్సాఫీస్ నంబర్స్ గురించి ఆలోచించడానికి ఏమీ లేదండీ. తెలుగు సినిమా మార్కెట్ ఎక్కడికో వెళ్ళిపోయింది. బాక్సాఫీస్ నంబర్స్ ప్రస్తావన పక్కనబెడితే ఒక సినిమా ప్రేక్షకులను కట్టిపడేస్తే దాని స్థాయి వేరు. ఆ మార్కెట్ ప్రకారమే సినిమా బాగుంటే బాక్సాఫీస్ నంబర్స్ కూడా వచ్చేస్తున్నాయి.

ప్రశ్న) ప్రస్తుతం తెలుగు సినిమా ఎలా ఉంది అనుకుంటున్నారు?

స) అద్భుతంగా ఉంది. చెప్పాలంటే గత సంవత్సరం తెలుగు సినిమా స్థాయి కూడా చాలా పెరిగింది. ప్రేక్షకులు కూడా రొటీన్ సినిమాలను పక్కనబెట్టి కంటెంట్ ఉన్న సినిమాలనే నమ్ముతున్నారు. నా సినిమా టెంపర్ చూసుకున్నా, ఆ తర్వాత వచ్చిన బాహుబలి, శ్రీమంతుడు, భలే భలే మగాడివోయ్.. ఇలా కంటెంట్ ఉన్న సినిమాలకే ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. దీన్ని బట్టిచూస్తే కంటెంట్‌ సినిమాలకు పెట్టింది పేరైన తెలుగు సినిమాకు పాత వైభవం వచ్చిందనే అనిపిస్తోంది.

ప్రశ్న) తదుపరి సినిమాల విశేషాలు చెప్పండి?

స) కొరటాల శివ దర్శకత్వంలో చేస్తోన్న జనతా గ్యారెజ్ ఫిబ్రవరిలో సెట్స్‌పైకి వెళుతుంది. ప్రస్తుతం ఆ సినిమాకు లుక్స్ ఎలా ఉండాలీ అన్నది ఆలోచిస్తున్నాం. ఇక మా ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌లో అన్నయ్య కళ్యాణ్ రామ్ నిర్మాతగా ఓ సినిమా త్వరలోనే మొదలవుతుంది.

ఇక అక్కడితో ఎన్టీఆర్‌తో మా ఇంటర్వ్యూ ముగించి. నాన్నకు ప్రేమతో మంచి విజయం సాధించాలని ఆల్ ది బెస్ట్ తెలిపాం.

Exit mobile version