ఇంటర్వ్యూ : నాగ చైతన్య – ఫ్రెష్ రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ ఈ లైలా.

Naga-Chaithna
ఒక నటుడిగా లవ్, యాక్షన్, రొమాన్స్ ఇలా అన్ని రకాల పాత్రలలో కనిపించాలని కోరుకుంటాను. నేను నటించిన లవ్ స్టొరీలు, రొమాంటిక్ సినిమాలు విజయవంతం కావడంతో ప్రస్తుతం ఆ తరహా సినిమాలు చేస్తున్నాను. ‘100% లవ్’ తరహాలో ఉండే రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ ‘ఒక లైలా కోసం’ . అని అన్నారు యువ హీరో నాగ చైతన్య. విజయ్ కుమార్ కొండా దర్శకత్వంలో నాగ చైతన్య నటించిన ఈ సినిమా అక్టోబర్ 17న విడుదలవుతుంది. పూజ హెగ్డే హీరోయిన్. ఈ సినిమా విశేషాలను తెలియజేయడానికి మీడియాతో సమావేశం అయ్యారు చైతు. ఆయన చెప్పిన విశేషాలు మీకోసం.

ప్రశ్న) ‘ఒక లైలా కోసం’ టైటిల్ జస్టిఫికేషన్ ఎలా ఇచ్చారు..?

స) ఒక అబ్బాయి, తను ప్రేమించిన అమ్మాయి కోసం ఎంత దూరం వరకూ వెళ్ళాడు అనేది మా సినిమా కథ. కథ ప్రకారం మా సినిమాకి ‘ఒక లైలా కోసం’ అనే టైటిల్ పర్ఫెక్ట్ గా సూట్ అవుతుంది.

ప్రశ్న) ఈ సినిమాలో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది..?

స) గ్రాడ్యుయేషన్ పూర్తయిన ఒక కుర్రాడి పాత్రలో కనిపిస్తాను. ఇదొక ఫీల్ గుడ్ లవ్ స్టొరీ. ‘100% లవ్’ తరహాలో ఉండే రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్. హీరో హీరోయిన్ల క్యారేక్టరైజేషన్ లు చాలా కొత్తగా ఉంటాయి. చాలా రోజుల తర్వాత మళ్లీ ఒక ప్రేమకథలో నటించాను.

ప్రశ్న) మీరు గతంలో నటించిన రొమాంటిక్ సినిమాలకు, ఈ సినిమాకి డిఫరెన్స్ ఏంటి..?

స) గత సినిమాలతో పోలిస్తే కొంచం మెచ్యూర్ లవ్ స్టొరీ ఇది. కథలో ఓ ఫ్రెష్ నెస్ ఉంటుంది. ఇంట్లో నాకు పెళ్లి సంబంధాలు చూస్తారు. నాకు పెళ్లి అంటే ఇంటరెస్ట్ ఉండదు. అలాంటి కుర్రాడు ఒక అమ్మాయి ప్రేమలో ఎలా పడ్డాడు అనేది కథ.

ప్రశ్న) ‘ఒక లైలా కోసం’ అందరూ యంగ్ టెక్నీషియన్లు వర్క్ చేశారు. మీ ఏజ్ గ్రూప్ టీంతో కలసి వర్క్ చేయడం ఎలా అనిపించింది..?

స) యంగ్ & ఎక్స్ పీరియన్స్ టెక్నీషియన్లు ఈ సినిమాకు వర్క్ చేశారు. ఎక్కువగా ‘గుండెజారి గల్లంతయ్యిందే’ టీంను తీసుకోవడం జరిగింది. యంగ్ టెక్నీషియన్లతో కలసి వర్క్ చేయడం వలన ఫ్రెష్ థాట్స్ వస్తాయి.

ప్రశ్న) తాతయ్య గారి హిట్ సాంగ్, ‘ఒక లైలా కోసం’ పాటను రీమిక్స్ చేయాలనే ఆలోచన ఎవరిది..?

స) దర్శకుడు విజయ్ కుమార్ కొండా ఐడియా అది. స్క్రిప్ట్ ప్రకారం మంచి సందర్భం కుదిరింది. పాట పాటలను రీమిక్స్ చేయడం అంటే కత్తి మీద సాము లాంటి వ్యవహారం. తాతయ్య గారి పాటను రీమిక్స్ చేయాలంటే అనూప్ రూబెన్స్ ఓకే అంటాడో..? లేదో..? అని కొంత సందేహించం. కాని, అనూప్ కి ఐడియా చెప్పగానే ఓకే చెప్పాడు.

ప్రశ్న) సినిమా విడుదల ఆలస్యం కావడానికి కారణాలు ఏంటి..?

స) సినిమా అనేది సమిష్టి కృషి. సరైన విడుదల కోసం చాలా రోజుల నుండి వెయిట్ చేస్తున్నాం. ‘ఒక లైలా కోసం’ విడుదల ఆలస్యం కావడానికి చాలా కారణాలు ఉన్నాయి. అనుకోకుండా ఈ గ్యాప్ వచ్చింది. ఫైనల్ ప్రోడక్ట్ మీద మేము నమ్మకంగా ఉన్నాం. తప్పకుండా విజయం సాదిస్తుందని ఆశిస్తున్నాను.

ప్రశ్న) ‘మనం’, ‘ఒక లైలా కోసం’ ప్రొడక్షన్ భాద్యతలు మీరే చూసుకున్నారు. కష్టం అనిపించిందా..?

స) సినిమాలు నిర్మించాలన్న ఆలోచన నాలో ఎప్పటి నుండో ఉంది. నిర్మాతగా ఈ రెండు సినిమాలు నాకు లెర్నింగ్ ఎక్స్ పీరియన్స్ అందించాయి. కష్టం ఏమి కలగలేదు.

ప్రశ్న) మీ సినిమాల ఎంపికలో నాన్నగారి జోక్యం ఎంత వరకు ఉంటుంది..?

స) హీరోగా నాకు సొంతంగా ఒక ఐడెంటిటీ రావాలనేది నాన్నగారి కోరిక. కథలు నేనే వింటున్నాను. నాకు స్క్రిప్ట్ నచ్చితే, తర్వాత నాన్నగారికి చెప్తున్నాను. ముఖ్యంగా ఎంటర్టైన్మెంట్ ఉన్న కథలకు ప్రాధాన్యం ఇస్తున్నాను. ఒకటి రెండు నిర్ణయాలు ఫెయిల్ అయినా పర్వాలేదు, నీకు అవగాహన వస్తుందని చెప్పారు. అందుకే, నా సినిమాల విషయంలో నేను మరింత జాగ్రత్త వహిస్తున్నాను. పబ్లిసిటీ కూడా నేనే ప్లాన్ చేస్తున్నాను.

ప్రశ్న) నాగార్జున గారి సలహాతో ‘ఒక లైలా కోసం’ రీ షూట్ చేశారు కదా..?

స) నాన్నగారు సినిమా చూసిన తర్వాత చిన్న చిన్న మార్పులు సూచించారు. మాకు కూడా కరెక్ట్ అనిపించడంతో కేవలం నాలుగు రోజులు మాత్రమే రీ షూట్ చేశాం. ఒక సినిమాతో చాలా రోజుల నుండి ట్రావెల్ చేస్తున్నప్పుడు మనకు అన్ని విషయాలు నచ్చేస్తాయి. ఇతరులు సినిమా చూసినపుడు మన తప్పులు తెలుస్తాయి. ఆ తప్పులను మీము సరిద్దిద్దుకున్నాం.

ప్రశ్న) అగ్ర హీరోల, దర్శకుల రెమ్యునరేషన్ వల్ల నిర్మాణ వ్యయం పెరిగిపోతుంది. ఫలితంగా డిస్ట్రిబ్యూటర్ లు, ఎగ్జిబిటర్ లు నష్టపోతున్నారు అనే విమర్శలు వస్తున్నాయి. మీ స్పందన ఏంటి..?

స) నేను ఒక సినిమాలో నటించే ముందు బడ్జెట్ ఎంత అవుతుందో తెలుసుకుంటాను. సేఫ్ ప్రాజెక్ట్ అనుకున్న తర్వాతే ముందుకు అడుగేస్తాను. మనం నటించించే సినిమా వలన ఎవరూ నష్టపోకూడదు అనేది నా ఫిలాసఫీ. భారి బడ్జెట్ వలన, కమర్షియల్ అంశాల వలన సినిమాలు హిట్ అవుతాయని నేను అనుకోవడం లేదు. కథ, సినిమాలో ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేసే అంశాలు ఉండడం ముఖ్యం.

ప్రశ్న) సినిమా ప్లాప్ అయితే హీరోలు ఆ లాస్ భరించాలనే వాదన వినిపిస్తుంది. మీరేమంటారు..?

స) ఇతర హీరోల సినిమాల గురించి నేను వ్యాఖ్యానించాను. ముందే చెప్పాను సినిమా అనేది సమిష్టి కృషి. ఒకరి వలన సినిమా ప్లాప్ అవ్వదు. నా సినిమాల వరకు దర్శకుడు, నిర్మాతతో కలసి చర్చించి ఓ నిర్ణయం తీసుకుంటాను. ఎవరూ భాదపడకుండా అందరూ కలసి ఆ లాస్ భరించడానికి నేను సిద్దమే.

ప్రశ్న) మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ గురించి చెప్పండి..?

స) సుధీర్ వర్మ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాను. యాక్షన్ బేస్డ్ థ్రిల్లర్ సినిమా ఇది. ఆల్రెడీ మూడు షెడ్యూల్స్ కంప్లీట్ అయ్యాయి. ప్రస్తుతం కొన్ని కథలు వింటున్నాను. త్వరలో వాటి వివరాలు వెల్లడిస్తాం.

ప్రశ్న) అఖిల్ తొలి సినిమా విషయంలో మీరు సలహాలు ఏమైనా ఇస్తున్నారా..?

స) ప్రస్తుతం కథలు వింటున్నాడు. ఇంకా ఓ నిర్ణయం తీసుకోలేదు. సందేహాలు ఏవైనా వస్తే నన్ను సంప్రదిస్తాడు. తుది నిర్ణయం మాత్రం అతనిదే. ఈ సంవత్సరమే అఖిల్ సినిమా ఉంటుంది.

ప్రశ్న) మీ నిజ జీవితంలో లైలా ఎవరైనా ఉన్నారా..? పెళ్లి ఎప్పుడు చేసుకుంటున్నారు..?

స) మా పేరెంట్స్ కూడా ఇదే ప్రశ్న అడిగారు. నా జీవితంలో ఎవరు లేరు. ఒక మంచి అమ్మాయిని వెతకమని చెప్పాను. త్వరలో ఎవరైనా లైలా తారసపడితే మీకు చెప్తాను.

ప్రశ్న) ఇటివలే మీరు సోషల్ మీడియాలో జాయిన్ అయ్యారు. ఎలా అనిపిస్తుంది..?

స) సినిమాలపై అభిమానుల, ప్రేక్షకుల అభిప్రాయాలు తెలుసుకోవడానికి సోషల్ మీడియా చాలా బాగా ఉపయోగపడుతుంది. అభిమానులతో మనం నేరుగా సంభాషించడానికి ఇదొక మంచి వేదిక అని నా అభిప్రాయం. త్వరలో మరింత ఆక్టివ్ గా సోషల్ మీడియాలో ఉండడానికి ప్రయత్నిస్తా..!

Exit mobile version