సినిమా సినిమాకూ కొత్తదనాన్ని చూపిస్తూ వైవిధ్యభరితమైన సినిమాలతో ఆకట్టుకుంటున్న హీరో నారా రోహిత్. తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఓ కొత్త ఐడెంటిటీ ఏర్పరుచుకున్న నారా రోహిత్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘అసుర’. కృష్ణ విజయ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఈ శుక్రవారమే (జూన్ 5న) ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా నారా రోహిత్‌తో జరిపిన ఇంటర్వ్యూ విశేషాలు..
ప్రశ్న) ‘అసుర’ సినిమా గురించి చెప్పండి?
స) నా స్టైల్లో సాగే ఓ పూర్తి యాక్షన్ థ్రిల్లర్ సినిమా ‘అసుర’. నా గత చిత్రాల్లానే ఈ సినిమాలోనూ కథే ప్రధానం. ఇక నా క్యారెక్టర్ సినిమాకే హైలైట్‌గా నిలుస్తుందని చెప్పగలను. అసుర ఇప్పటివరకూ వచ్చిన నా సినిమాలన్నింటిలోకెల్లా ఎక్కువ కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న సినిమా.
ప్రశ్న) ఈ సినిమాలో మీ రోల్ ఎలా ఉండబోతోంది?
స) ఈ సినిమాలో నేను ఓ జైలర్‌గా నటించా. వర్క్ విషయంలో ఎవ్వరిమాటా వినని పాత్రలో కనిపిస్తా. నా క్యారెక్టర్ కూడా చాలా కొత్తగా ఉంటుంది. క్యారెక్టర్‌లో మంచి ఇంటరెస్టింగ్ పాయింట్స్ కూడా ఉన్నాయి.
ప్రశ్న) ఇంతకుముందు కూడా పోలీస్‌గా కనిపించారు. ఇందులో కొత్తదనం ఏం చూపించారు?
స) ఇంతకుముందు పోలీస్ నేపథ్యంలో సినిమాలు చేసినా ఇది పూర్తిగా డిఫరెంట్ కథ. కథలో గానీ, క్యారెక్టరైజేషన్‌లో గానీ నా గత సినిమాలతో ఎక్కడా పోలిక ఉండదు.
ప్రశ్న) ఈ సినిమాకు మీరు నిర్మాతగా కూడా వ్యవహరించారు. నిర్మాత కావడానికి కారణం?
స) సినిమాల గురించి నాకు మొదట్నుంచీ మంచి నాలెడ్జ్ ఉంది. సినిమా పట్ల నాకున్న అవగాహనతో నిర్మాతనవ్వాలనుకున్నా. ఒకవేళ నేను నటుణ్ణి కాకపోయుంటే కచ్చితంగా నిర్మాతను అయ్యేవాడినే! ఇకపై కూడా నా బ్యానర్‌లో వరుస సినిమాలు తీయాలనుకుంటున్నా.
ప్రశ్న) మీరు ఎక్కువగా కొత్త వాళ్ళతో పనిచేస్తున్నారు. కారణం?
స) నా కెరీర్ మొదట్నుంచే కొత్త దర్శకులు తమ సరికొత్త కథలతో నన్ను సంప్రదించేవారు. ఆ కథలన్నీ నా బాడీ లాంగ్వేజ్‌కి సరిగ్గా సరిపోయే కథలు కావడంతో అలాంటి సినిమాలను ఎంచుకుంటూ వెళుతున్నా. కొత్త దర్శకులతో పని చేయడం ఎప్పుడూ కంఫర్ట్‌గానే ఉంటుంది.
ప్రశ్న) మీ సినిమాలు ఏ సెంటర్లకు మాత్రమే పరిమితం అనే టాక్ ఉంది. మీ కామెంట్?
స) ‘అసుర’ సినిమా కచ్చితంగా ఈ అభిప్రాయాన్ని మార్చేస్తుందని చెప్పగలను. ఒక పక్కా కమర్షియల్ సినిమాకు కావాల్సిన అన్ని అంశాలూ ఈ సినిమాలో మెండుగా ఉన్నాయి. బీ,సీ సెంటర్లను మెప్పించేలా ఈ సినిమాలో ఓ ఐటెమ్ సాంగ్ కూడా ఉంది.
ప్రశ్న) ఈ మధ్యకాలంలో మీ సినిమాలు కమర్షియల్‌గా సక్సెస్ కాలేదు. కారణం ఏమనుకుంటున్నారు?
స) ప్రతీ సినిమాకూ కష్టపడే పనిచేస్తాం. నా గత సినిమాలకు కూడా నేను, నా టీమ్ అలానే పనిచేశాం. ఇక సినిమా ఫెయిలయిందంటే అందుకు నాది, నా టీమ్‌దే బాధ్యత. అయితే ప్రస్తుతం సినిమాల విషయంలో మాత్రం కచ్చితమైన ప్లాన్‌తో ముందుకెళుతున్నా. రాబోయే సినిమాలు కచ్చితంగా మంచి విజయం సాధిస్తాయనే నమ్ముతున్నా.
ప్రశ్న) మీ తదుపరి సినిమాలేంటి?
స) ప్రస్తుతం ఓ నాలుగైదు సినిమాలు లైన్లో ఉన్నాయి. ఇక ‘అసుర’ తర్వాత ‘శంకర’ రిలీజ్ కానుంది. ఆ తర్వాత ఓ రెండు సినిమాలు జూన్, ఆగష్టు నెలల్లో సెట్స్‌పైకి వెళ్ళనున్నాయి.
ప్రశ్న) మిమ్మల్ని సిక్స్‌ప్యాక్‌లో ఎప్పుడు చూడొచ్చు?
స) (నవ్వుతూ) త్వరలోనే సిక్స్‌ప్యాక్‌లో కనిపించే అవకాశముంది. ఆ రోజు వచ్చినప్పుడు కచ్చితంగా తెలియజేస్తా.
ప్రశ్న) అసుర దర్శకుడు, హీరోయిన్‌ల గురించి చెప్పండి?
స) ‘బాణం’ సినిమా అప్పట్నుంచీ విజయ్ నాకు బాగా పరిచయం. చాలా కాలం క్రితమే ఈ స్క్రిప్ట్ విన్నా, అయితే అది ఇప్పటికి కార్యరూపం దాల్చింది. ఇక హీరోయిన్ ప్రియా బెనర్జీ విషయానికొస్తే.. తన రోల్‌కి సరైన న్యాయం చేసింది.
ప్రశ్న) మీ పెదనాన్న చంద్రబాబు నాయుడు మీ సినిమాలు చూస్తుంటారా?
స) ఆయన నా అన్ని సినిమాలను చూస్తూంటారు. ‘రౌడీ ఫెలో’ సినిమా ఇంకా చూడలేదు. కొన్ని సలహాలు కూడా ఇస్తూ ఉంటారు. ఎక్కువగా మాస్‌కి కనెక్ట్ అయ్యేలా కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండేలా చూసుకోమంటుంటారు.
