ఇంటర్వ్యూ : రాజ్ మాదిరాజు – తొలిప్రేమను తట్టిలేపే సినిమా ‘ఆంధ్రాపోరి’!

raj
‘ఋషి’ సినిమాతో ఓ అర్థవంతమైన సినిమాను తెరకెక్కించాడనే పేరుతో పాటు అవార్డులను కూడా సొంతం చేసుకున్న దర్శకుడు రాజ్ మాదిరాజు తాజా ప్రయత్నమే ‘ఆంధ్రాపోరి’. మరాఠీలో ఘన విజయం సాధించిన ‘టైమ్‌పాస్‌’కు రీమేకే ‘ఆంధ్రాపోరి’. పూరీ జగన్నాథ్ తనయుడు పూరీ ఆకాష్ పూర్తి స్థాయి హీరోగా పరిచయమవుతున్న ఈ సినిమా రేపు (జూన్ 5న) ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా దర్శకుడు రాజ్ మాదిరాజుతో జరిపిన ఇంటర్వ్యూ విశేషాలు..

ప్రశ్న) ‘ఋషి’ లాంటి సీరియస్ సినిమా తర్వాత ‘ఆంధ్రాపోరి’ అంటూ వస్తున్నారు. ఈ సినిమా గురించి చెప్పండి?

స) ‘ఋషి’ తర్వాత ఏదైనా మంచి రొమాంటిక్ కామెడీ చేద్దామనుకున్నా. ఆ సమయంలోనే మరాఠీలో ఘన విజయం సాధించిన టైమ్‌పాస్ విడుదలైంది. ఆ సినిమా చూసినతర్వాత ఒక అద్భుతమైన అనుభూతి కలిగింది. ఆ సినిమాను రీమేక్ చేయవచ్చా? లేదా? అన్నది కొంత పరిశీలించుకున్నాక రీమేక్‌కి సిద్ధమైపోయాం. ముందుగా అంతా కొత్తవాళ్ళతోనే చిన్న సినిమాగా తెరకెక్కించాలనుకున్నాం. ప్రీ ప్రొడక్షన్ దశలో వచ్చిన అభిప్రాయాల ప్రకారం ఆకాష్, ఉల్కా గుప్తా ఇలా కొంత ఐడెంటిటీ ఉన్నవాళ్ళు చేరడంతో పెద్ద సినిమా అయిపోయింది.

ప్రశ్న) తెలుగు రీమేక్‌లో ఏమేం మార్పులు చేశారు?

స) నిజానికిది ‘టైమ్‌పాస్‌’కు రీమేకే అయినా, బేసిక్ పాయింట్‌ను మాత్రమే తీసుకొని తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా చాలానే మార్పులు చేశాం. ఇక ఈ సినిమాకు ఆకాష్, ఉల్కా గుప్తా లాంటి ఐడెంటిటీ ఉన్న నటులు దొరకడంతో వారికి తగ్గట్లుగా కొన్ని మార్పులు చేశాం. ఏది చేసినా మరాఠీ సినిమా చూసినప్పుడు ఉండే ఫీల్‌ను చెడగొట్టకుండా చూడడమనేది ప్రధానమైంది. ఆ విషయంలో విజయం సాధించామని చెప్పగలను.

ప్రశ్న) పూరీ ఆకాష్‌నే హీరోగా ఎంచుకోవడానికి కారణం?

స) ముందే చెప్పినట్టు ఈ సినిమాకు అంతా కొత్తవాళ్ళనే తీసుకోవాలనుకున్నాం. హీరో క్యారెక్టర్‌కు ఓ పదిహేడేళ్ళ కుర్రాడు కావాలి. ఆ విషయం గురించే ఆలోచిస్తూ ఉండగా పూరీ ఆకాష్ అయితే ఎలా ఉంటుందీ? అనే అభిప్రాయం వినిపించింది. ఆ తర్వాత పూరీ జగన్నాథ్‌ను కలవడం, ఆయన ‘టైమ్‌పాస్’ సినిమా చూసి వెంటనే ఓకే అనడం అన్నీ అలా జరిగిపోయాయ్! సినిమా చూశాక ఆకాష్ ఈ సినిమాకు పర్ఫెక్ట్‌గా సరిపోయాడని మీరే అంటారు.

ప్రశ్న) షూటింగ్ కూడా చాలా స్పీడ్‌గా పూర్తి చేసినట్టున్నారు?

స) అవును. సినిమా షూటింగ్ అంతా ఖమ్మం జిల్లా పాల్వంచలో నెలరోజుల్లో పూర్తి చేశాం. అక్కడి లొకేషన్లన్నీ సినిమా మూడ్‌కి సరిగ్గా సరిపోయాయి. ఆ లొకేషన్లలో వచ్చే పాటలు సినిమాకు మరింత అందాన్ని తెచ్చిపెట్టాయని చెప్పొచ్చు.

ప్రశ్న) ‘ఆంధ్రాపోరి’ అనే టైటిల్ పెట్టడం వెనక ఉన్న ఉద్దేశం?

స) ఈ సినిమాలో హీరో నర్సింగ్ ఓ చదువుకోని కుర్రాడు. తెలంగాణకు చెందిన నర్సింగ్, ఆంధ్రాకు చెందిన ఓ అమ్మాయిని ప్రేమిస్తాడు. నర్సింగ్.. అతడి ప్రేయసిని ముద్దుగా ఆంధ్రాపోరి అని పిలుచుకుంటాడు. ఇంతకుమించి ఏదో ఉద్దేశం ఆపాదించాలన్న ఆలోచన మాకైతే ఎప్పుడూ లేదు.

ప్రశ్న) ఆంధ్రాపోరి సినిమాకు మేజర్ హైలైట్స్ ఏంటి?

స) ‘ఆంధ్రాపోరి’ ఒక ఇన్నోసెంట్ టీనేజ్ లవ్‌స్టోరి. ప్రతి ఒక్కరూ అందమైన తొలిప్రేమ దశను దాటుకొని వచ్చినవారే! 1990 నేపథ్యంలో నడిచే ఈ సినిమాలో ఓ టీనేజ్ జంటలో ఉండే అమాయకత్వాన్ని, తొలిప్రేమలోని అల్లరిని చూడొచ్చు. ఈతరం వారు తమను తాము తెరపై చూసుకోవడంతో పాటు, ప్రేమ అనే దానికి అర్థాన్ని తెల్సుకుంటారు. ఇక ఈ దశను దాటేసి వచ్చిన వారికైతే తమ తొలిప్రేమను తట్టిలేపి అందంగా చూపే సినిమాగా ‘ఆంధ్రాపోరి’ నిలుస్తుంది.

ప్రశ్న) మరో రెండు సినిమాల మధ్య ఈ సినిమాను విడుదల చేయడం రిస్క్ కాదా?

స) రేపు రిలీజ్ అయ్యే మూడు సినిమాలూ దేనికదే ప్రత్యేక జానర్ సినిమా. ప్రతి సినిమాకూ ప్రత్యేక సెక్షన్ ఆడియన్స్ ఉన్నారు కాబట్టి పెద్దగా రిస్క్ ఉంటుందనుకోను. నేనైతే మూడు సినిమాలూ బాగా ఆడాలనే కోరుకుంటూన్నా. అప్పుడే సినీ పరిశ్రమ కళకళలాడుతుంది.

ప్రశ్న) మీ తదుపరి సినిమాలేంటి?

స) రేపు ఈ సినిమా రిలీజ్ అయ్యాక చెబ్తా. మళ్ళీ మరో కొత్త జానర్‌లో సినిమా తీయాలనుకుంటున్నా.

Exit mobile version