ఇంటర్వ్యూ : రత్నవేలు – డబ్బు కోసం కాదు.. స్నేహం కోసమే!!

Ratnavel
రత్నవేలు.. ‘ఆర్య’, ‘జగడం’, ‘1 నేనొక్కడినే’ సినిమాలతో పాటు తమిళంలో ‘రోబో’ లాంటి విజువల్ వండర్‌ను అందించిన సినిమాటోగ్రాఫర్. తాజాగా సుకుమార్ నిర్మాణంలో రూపొందిన మొదటి సినిమా ‘కుమారి 21F’కు రత్నవేలు సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించారు. భారీ అంచనాల నడుమ రేపు (నవంబర్ 20న) పెద్ద ఎత్తున ఈ సినిమా విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా రత్నవేలుతో జరిపిన ఇంటర్వ్యూ విశేషాలు.. .. సుకుమార్ ఫ్రెండ్‌గా నా బాధ్యత!

ప్రశ్న) తెలుగు, తమిళంలో టాప్ సినిమాటోగ్రాఫర్స్‌లో ఒకరు మీరు. అలాంటిది ఇలా చిన్న బడ్జెట్ సినిమా చేశారెందుకని?

స) అంతా సుకుమార్ కోసమే! ఎప్పట్నుంచో సుక్కుతో కలిసి ప్రయాణం చేస్తున్నా. ఆయన తన సొంత నిర్మాణంలో సినిమా చేస్తున్నారనగానే దానికి సాయం చేయడం నా బాధ్యత. మా ఫ్రెండ్‌షిప్ కోసం, బాధ్యతగా తీసుకొని ఈ సినిమా చేశా. అదేవిధంగా సినిమాలో కూడా అద్భుతమైన ఎమోషన్ ఉంది. ఆ ఎమోషన్‌ను నాకున్న పరిధిలో బంధించడం కూడా ఒక ఛాలెంజ్. ఆ రకంగా పర్సనల్‌గా, ప్రొఫెషనల్‌గా ‘కుమారి 21F’ నాకో స్పెషల్ సినిమా.

ప్రశ్న) ట్రైలర్ చూస్తుంటే మీ మార్క్ స్పష్టంగా కనిపిస్తోంది. ఈ బడ్జెట్‌లో అంత మంచి ఔట్‌పుట్ ఎలా తీసుకొచ్చారు?

స) ‘కుమారి 21F’లో ఎక్కువగా న్యాచురల్ లైట్‌నే వాడేందుకు ప్రయత్నించా. కథ రీత్యా కూడా న్యాచురల్ లైట్ వల్ల ఓ మంచి ఫీల్ వస్తుంది. సరిగ్గా అందుకు తగ్గ లొకేషన్స్‌లో, సరైన షాట్ కంపోజిషన్‌తో సినిమాను వీలైనంత తక్కువ బడ్జెట్‌లో పూర్తయ్యేలా చూస్తూనే, అందంగానూ ఉంచగలిగాం. మీరు సినిమా చూస్తే ఎక్కడా ఇదో చిన్న బడ్జెట్ సినిమాలా కనిపించదు.

ప్రశ్న) ఒక సీన్‌ తీయాలంటే, ముందు మీరెలా ప్రిపేర్ అవుతారు?

స) నాకు స్క్రీన్‌పై కనిపించే ప్రతీ విషయంపైనా సరైన క్లారిటీ రావాలి. అదేవిధంగా మెయిన్ క్యాస్టింగ్ మేకప్, కాస్ట్యూమ్స్ కూడా అప్పటి లైటింగ్, సెట్టింగ్‌కు కుదిరాయా లేదా అన్నది చూసుకోవాలి. అంతా ఓకే అనుకున్నాక ఇక నా పనిలో నేను పడిపోతా.

ప్రశ్న) టెక్నాలజీ పరంగా ఇప్పటికే విపరీతమైన మార్పులు వచ్చాయి. ఈ విషయంలో ఎలా అప్డేట్ అవుతుంటారు?

స) ఎక్కువగా బుక్స్ చదువుతుంటా. టెక్నాలజీలో వస్తోన్న మార్పులేంటి? మన సినిమాకు దాన్ని ఎలా అందిపుచ్చుకుంటాం? ఇలా అన్నీ ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉంటాను. నన్నడిగితే ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వకపోతే ఎంత పెద్ద టెక్నీషియన్ అయినా మెల్లిగా కనుమరుగైపోతారు.

ప్రశ్న) సినిమాటోగ్రాఫర్‌గా ఒక సినిమా కథ, నేపథ్యం విషయంలో ఎంతవరకు ఇన్వాల్వ్ అవుతుతుంటారు?

స) కథ, బ్యాక్‌డ్రాప్, ఎమోషన్ విషయంలో ఇన్వాల్వ్ అవ్వకపోతే ఇక సినిమాటోగ్రాఫర్ చేసేదేముంటుంది? కేవలం అందమైన విజువల్స్ ఉంటే అది గొప్ప సినిమాటోగ్రఫీ అయిపోదు. విజువల్స్ ద్వారా కథ చెప్పాలి. కథ విషయంలో ఇన్వాల్వ్ అవ్వకపోతే ఎమోషన్ చూపించడం అసాధ్యం. అందమైన విజువల్స్ కలిస్తే ఎప్పటికీ సినిమా రాదు. ఇక కుమారి 21F విషయంలో మొదట బ్యాక్‌డ్రాప్ ఎక్కువగా జనాలుండే కాలనీ అని సుక్కు రాసుకున్నారు. నేనే దాన్ని ఒక ప్రశాంతమైన లొకాలిటీకి మార్చేశా. ఇప్పుడు కథతో పాటు విజువల్స్ కూడా కథతో కనెక్ట్ అయిపోయాయి.

ప్రశ్న) ‘కుమారి 21F’ సినిమాలో ఏమేం ప్రయోగాలు చేశారు?

స) చిన్న సినిమాల్లో ఎన్నైనా ప్రయోగాలు చేయొచ్చు. ఈ సినిమా విషయంలో లైటింగ్‌ పరంగా ఎక్కువగా న్యాచురల్ లైట్‌నే వాడడం, సినిమాకు ఒక ఫీల్ తేవడానికి కలరింగ్ లో లేత గోధుమ రంగు ఇచ్చి ఆ ఫీల్‌ను సినిమా మొత్తం క్యారీ చేయడం, అనుకున్న బడ్జెట్‌లో అనుకున్నట్లు సినిమా రావడానికి ముందే సీన్‌కు రిహార్సల్ చేసి సరిగ్గా ఆ బ్లాక్స్ పెట్టుకోవడం.. ఇలా చాలానే చేశాం. ఏది చేసినా ప్రేక్షకుడు సినిమాలో లీనమయ్యేలా చేయగలిగే ఎమోషన్ విజువల్స్‌లో ఉండాలి. అది నేను సరిగ్గానే పట్టుకున్నా అనుకుంటున్నా.

ప్రశ్న) హీరో, హీరోయిన్లు రాజ్ తరుణ్, హెబ్బా పటేల్‌ల గురించి చెప్పండి?

స) రాజ్ తరుణ్, హెబ్బా పటేల్ పెయిర్ స్క్రీన్‌పై చాలా క్యూట్‌గా ఉంటుంది. హీరోయిన్ కనిపించినప్పుడల్లా సినిమాలో ఒకరకమైన అందమైన ఫీల్ రావడం కోసం లైటింగ్ విషయంలో చాలా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నాం. ఆ ఫీల్ ఎలా ఉంటుందన్నది మీరు స్క్రీన్‌పైనే చూడాలి. ఇక హీరో, హీరోయిన్లిద్దరూ చాలా బాగా నటించారు. రాజ్ తరుణ్ డైలాగ్ డెలివరీ అందరికీ కనెక్ట్ అయ్యేలా ఉంటుంది.

ప్రశ్న) సినిమాలో అడల్ట్ కంటెంట్ ఉందనే ప్రచారం జరుగుతోంది. దీనిపై మీరేమంటారు?

స) ఈ సినిమాలో అడల్ట్ కంటెంట్ అస్సలు లేదు. సినిమాకు ఏ సర్టిఫికెట్ వచ్చినప్పటి నుంచి ఈ ప్రచారం బాగా జరుగుతోంది. ఏ సర్టిఫికెట్ రావడానికి కారణాలు వేరే ఉన్నాయి. సుకుమార్ రాసిన బ్యూటిఫుల్ లవ్‌స్టోరీని దర్శకుడు సూర్య ప్రతాప్ కూడా ఎక్కడా ఫీల్ మిస్సవకుండా చాలా జాగ్రత్తగా తీశారు.

ప్రశ్న) చివరగా.. సుకుమార్ కోసం ఒక్క రూపాయి తీసుకోకుండా ఈ సినిమా చేశారు. ఆయనలో మీకు నచ్చిన అంశమేంటి?

స) సుకుమార్ ఓ జెన్యూన్ మనిషి. ఫ్రెండ్‌షిప్‌కి, విలువలకు విపరీతమైన ప్రాధాన్యం ఇస్తాడు. అలాంటి స్నేహితుడి సినిమా అంటే ముందుండి అన్నీ నేనే చూసుకోవడమనేది నా బాధ్యత. దర్శకుడిగా కూడా సుకుమార్ ఎంత పెద్ద జీనియసో చెప్పాల్సిన పనిలేదు. అతడి కోసం ఈ సినిమా చేయడంలో నేను నా సంతృప్తి తప్ప డబ్బులు ఆశించే అవకాశమే లేదు!

Exit mobile version