ఇంటర్వ్యూ : సందీప్ కిషన్ – ‘జోరు’లో ముగ్గురు హీరోయిన్లు ఒకటే క్యారెక్టర్లో నటిస్తున్నారు.

sundeep-kishan
సందీప్ కిషన్.. వరుస విజయాలతో యువ హీరోలలో ప్రామిసింగ్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ హీరో నటించిన తాజా సినిమా ‘జోరు’. ‘గుండెల్లో గోదారి’ ఫేం కుమార్ నాగేంద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు రాశి ఖన్నా, సుష్మ, ప్రియా బెనర్జీ నటించారు. భీమ్స్ సంగీత దర్శకుడు. అర్జున్ సమర్పణలో శ్రీ కీర్తి ఫిల్మ్స్ పతాకంపై అశోక్, నాగార్జున సంయుక్తంగా నిర్మించిన ‘జోరు’ ఈ శుక్రవారం, నవంబర్ 7న విడుదలవుతుంది. ఈ సందర్భంగా హీరో సందీప్ కిషన్ మీడియాతో సమావేశం అయ్యారు. ఆ విశేషాలు మీకోసం..

ప్రశ్న) ‘జోరు’ సినిమా గురించి చెప్పండి..?

స) ప్రేక్షకులను నవ్వించడమే ముఖ్య ఉద్దేశ్యంగా తీసిన సినిమా ‘జోరు’. ‘గుండెల్లో గోదారి’ సినిమాలో కుమార్ నాగేంద్ర నన్ను కొత్తగా చూపించాడు. ఆ సినిమాకు మంచి పేరొచ్చింది. కాని, కమర్షియల్ గా అంతగా ఆడలేదు. సినిమాలో ఎంటర్టైన్మెంట్ తక్కువగా ఉందని కొందరు అన్నారు. ఈసారి ఎంటర్టైన్మెంట్ బేస్ చేసుకుని ‘జోరు’ సినిమా చేశాం. రెండున్నర గంటల పాటు ప్రేక్షకులను నవ్వించే సినిమా ఇది.

ప్రశ్న) ‘జోరు’ స్క్రిప్ట్ లో మిమ్మల్ని బాగా ఆకట్టుకున్న అంశం ఏంటి..?

స) ఇదొక రెగ్యులర్ కమర్షియల్ సినిమా అండి. కొత్త కథ అని నేను చెప్పను. సింపుల్ కామెడీతో కొంచం కొత్త కాన్సెప్ట్ తో తెరకెక్కిన సినిమా. కథ కంటే దర్శకుడిపై ఎక్కువ నమ్మకంతో నేను ఈ సినిమా చేశాను. కామెడీని సరిగ్గా తెరపై ఆవిష్కరించకపోతే సినిమా బాగోదు. ఆ విషయంలో కుమార్ నా నమ్మకాన్ని నిలబెట్టాడు. ప్రతి సన్నివేశాన్ని బాగా తీశాడు. తనతో మరొక సినిమా చేయాలి అనుకుంటున్నాను.

ప్రశ్న) ‘జోరు’లో మీ క్యారెక్టర్ గురించి చెప్పండి..?

స) ‘జోరు’లో నేను ‘సందీప్’గా కనిపిస్తాను. స్టైలిష్ గా ఉండే పక్కింటి తరహా కుర్రాడి క్యారెక్టర్ అనమాట. గతంలో నటించిన ప్రతి సినిమాలో నేను ఎక్కువ టెన్షన్ పడుతూ ఉంటాను. ఈ సినిమాలో మాత్రం ఎదుటివారిని టెన్షన్ పెడతాను. నాకు ఈ సినిమా కొత్తగా ఉంటుంది.

ప్రశ్న) సినిమాలో మేజర్ హైలైట్ ఏంటి..?

స) సినిమాలో ముగ్గురు హీరోయిన్లు రాశి ఖన్నా, సుష్మ, ప్రియా బెనర్జీ నటించారు. ట్విస్ట్ ఏంటంటే ముగ్గురూ ఒకటే క్యారెక్టర్ (అన్నపూర్ణ)లో నటిస్తున్నారు. సినిమాలో నాకు ఇద్దరు అమ్మానాన్నలు ఉంటారు. ఆ కన్ఫ్యూజన్ ఏంటనేది మీరు తేర మీద చూడాలి. ఆ కన్ఫ్యూజన్ లో నుండి వచ్చే కామెడీ ప్రేక్షకులను నవ్విస్తుంది. సంగీతం, బ్రహ్మానందం, సప్తగిరి పాత్రలు హైలైట్ అవుతాయి.

ప్రశ్న) తొలిసారిగా బ్రహ్మానందం గారితో కలసి నటించారు. మీ వర్కింగ్ ఎక్స్ పీరియన్స్..?

స) బ్రహ్మానందం గారు పెళ్ళికొడుకు(పీకే) క్యారెక్టర్ లో కనిపిస్తారు. ఆయన నటించడం సినిమాకి ప్లస్ అయ్యింది. సెట్స్ లో నాకు చాలా బాగా సపోర్ట్ చేశారు. సినిమాలో ఆయన క్యారెక్టర్ వన్ అఫ్ ది మెయిన్ హైలైట్ అవుతుంది. అటువంటి స్టార్ కమెడియన్ తో వర్క్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. మా ఇద్దరి మధ్య మంచి కెమిస్ట్రీ వర్కౌట్ అయ్యింది. మేమిద్దరం పౌరాణిక భాషలో మాట్లాడుకుంటాం.

ప్రశ్న) ఇటివల బ్రహ్మానందం రొటీన్ క్యారెక్టర్స్ చేస్తున్నారు అనే విమర్శ ఉంది. ‘జోరు’లో ఆయన క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది..?

స) ఇతర సినిమాలలో కంటే ‘జోరు’లో బ్రహ్మానందం గారి క్యారెక్టర్ కొంచం కొత్తగా ఉంటుంది. ఆయన్ను కొట్టడం, బకరా చేయడం వంటివి ఉండవు. ఇన్నోసెంట్ తో కూడిన కామెడీ ఆయన క్యారెక్టర్ లో ఉంటుంది. తెరపై అయన కనిపించిన ప్రతిసారి ప్రేక్షకులు పడి పడి నవ్వుతారు.

ప్రశ్న) మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి..?

స) కన్మణి దర్శకత్వంలో ఆనంది ఆర్ట్స్ క్రియేషన్స్ మరియు ఉషా కిరణ్ మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా షూటింగ్ దాదాపు పూర్తయింది. ఈ సినిమా తర్వాత ఏఆర్ మురుగదాస్ అసిస్టెంట్ వి.ఆనంద్ దర్శకత్వంలో ఠాగూర్ మధు, ఎన్ వి ప్రసాద్ కలసి నిర్మిస్తున్న సినిమా ప్రారంభమవుతుంది. ఈ రెండు సినిమాలకు తమన్ సంగీతం అందిస్తున్నాడు. మామ (చోటా.కె.నాయుడు) సినిమాటోగ్రాఫర్. మరో తమిళ సినిమా అంగీకరించాను. త్వరలో వాటి వివరాలు వెల్లడవుతాయి.

ప్రశ్న) ‘షోర్ ఇన్ ది సిటీ’ తర్వాత హిందీలో మరో సినిమా చేయలేదు. కారణాలు ఏంటి..?

స) నా మాతృభాష తెలుగు. ఇక్కడ సినిమాలలో నటించాలని నా కోరిక. ‘షోర్ ఇన్ ది సిటీ’ హిందీలో మంచి విజయం సాధించింది. పేరు కూడా తీసుకొచ్చింది. తర్వాత తెలుగు సినిమా కమిట్మెంట్స్ వల్ల హిందీలో మరో సినిమా చేయలేకపోయాను. 2015లో ఒక బాలీవుడ్ సినిమాలో నటిస్తాను. ప్రస్తుతం ఆ ప్రాజెక్ట్ చర్చల దశలో ఉంది.

ప్రశ్న) సినిమాల ఎంపికలో మీరు దేనికి ప్రాధాన్యత ఇస్తారు..?

స) కథ, దర్శకుడు, నిర్మాణ సంస్థ.. ఈ మూడు అంశాలను దృష్టిలో పెట్టుకుంటాను. ముఖ్యంగా నాతో సినిమా తీసిన నిర్మాత నష్టపోకూడదు. అందుకే దర్శకుడు, స్క్రిప్ట్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటాను. ప్రేక్షకులను ఎంటర్టైన్ చేశాలా ఉండాలి. అంటూ ఇంటర్వ్యూ ముగించారు.

Exit mobile version