ఇంటర్వ్యూ : తేజ – ప్రస్తుతం టాలీవుడ్ కి ‘రన్ టైం’ అనే కొత్త జబ్బు పట్టుకుంది.

teja
‘చిత్రం’, ‘జయం’, ‘నువ్వు-నేను’, ‘నిజం’ సినిమాలతో ఒక ట్రెండ్ సెట్ చేసిన దర్శకుడు తేజ. ఈ మధ్య కాలంలో తెలుగు ప్రేక్షకులను పెద్దగా మెప్పించలేకపోయిన తేజ కాస్త గ్యాప్ తీసుకొని చేసిన సినిమా ‘హోరా హోరీ’. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా సెప్టెంబర్ 11న రిలీజ్ కి సిద్దమైంది. ఈ సందర్భంగా తేజతో కాసేపు మాట్లాడి ఈ సినిమాకి సంబందించిన విశేషాలతో పాటు తన తదుపరి సినిమాల గురించి చెప్పిన విశేషాలు మీకోసం..

ప్రశ్న) ముందుగా గ్యాప్ తర్వాత మీ నుండి వస్తున్న ‘హోరా హోరీ’ గురించి చెప్పండి.?
స) ‘ఫైట్ ఫర్ లవ్’ అనే ఉపశీర్షికతో క్యూట్ లవ్ స్టొరీ గా మీ ముందుకు రానున్న సినిమానే ‘హోరా హోరీ’. నూతన నటీనటులతో, 54 రోజుల్లో చాలా లిమిటెడ్ బడ్జెట్ తో సినిమాని పూర్తి చేసాం. ఇదొక సినిమాగా పక్కన పెడితే, నా పరంగా ఇండస్ట్రీలో మళ్ళీ సక్సెస్ అవ్వడానికి నేను చేసిన ఫైట్ లా అనిపించింది.

ప్రశ్న) ఈ సినిమా కోసం కొత్త లొకేషన్ ని ఎంచుకున్నట్టున్నారు.. సో మేకింగ్ గురించి చెప్పండి.?
స) ఇండియాలోనే అత్యధికంగా వర్షం పడే ఆగుంబె అనే ప్రాంతంలో ఈ సినిమాని షూట్ చేసాం. సుమారు 80% సినిమా వర్షం బ్యాక్ డ్రాప్ లోనే ఉంటుంది. అదీ కాక అక్కడి లొకేషన్స్ లో షూట్ చెయ్యడం మాకు చాలా కష్టంగా అనిపించింది. అలాగే మాకు టెక్నికల్ గా 20 మంది మాత్రమే ఉన్నారు. ఈ సినిమా ఆన్ టైంలో పూర్తి కావడానికి ప్రతి ఒక్కరూ వాళ్ళ బెస్ట్ ఇచ్చారు.

ప్రశ్న) విజువల్స్ సూపర్బ్ గా ఉన్నాయి. హోరా హోరీ టెక్నికల్ వర్క్ గురించి చెప్పండి.?
స) ఇండియాలో మొట్ట మొదటిసారిగా ఈ సినిమా కోసం 4థ్ వాల్ అనే టెక్నిక్ ని ఉపయోగించాము. ఎక్కువగా ఈ టెక్నిక్ ని హాలీవుడ్ లో ఉపయోగిస్తారు. లేనివి క్రియేట్ చేసి చూపడంలో, ఆడియన్స్ మునుపెన్నడూ చూడని యాంగిల్స్ లో సినిమాని చూపించి వారిని థ్రిల్ చేయవచ్చు. అంతే కాకుండా నేను ఫిల్మ్ విడ్త్ కూడా పెంచాను, దాని వలన సినిమా స్క్రీన్ పై చాలా కొత్తగా ఉంటుంది.

ప్రశ్న) ఈ సినిమాకి పని చేసిన మిగిలిన టెక్నికల్ డిపార్ట్ మెంట్స్ గురించి చెప్పండి.?
స) మామూలుగా ఒక సినిమాకి 24 క్రాఫ్ట్స్ పనిచేస్తాయి. కానీ హోరా హోరీకి మాత్రం 5 నుంచి 6 విభాగాలు మాత్రమే పనిచేశాయి. మా ప్రొడక్షన్ ఖర్చుని మరింత తగ్గించడం కోసం ఇలా చేసాం.

ప్రశ్న) ఎందుకు మీరు బడ్జెట్ విషయంలో చాలా కాంప్రమైజ్ అయ్యి చేసారు.?
స) నేను ప్రస్తుతం ఓ హిట్ సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నాను. కాబట్టి నాకు నా నిర్మాతలను పెద్ద బడ్జెట్ ఇవ్వండి అని అడిగే ఫ్రీడం లేదు. అన్నిటికంటే మించి ఇలాంటి సినిమాకి అవసరానికి మించి భారీ బడ్జెట్ పెట్టాల్సిన అవసరం లేదు.

ప్రశ్న) ఈ సినిమా రన్ టైం గురించి చెప్పండి.?
స) ఫుల్ నవ్వులు..! గత కొన్ని రోజులుగా చాలా మంది అడుగుతున్న ఈ ప్రశ్న నాకు వినడానికి చాలా బాధగా ఉంది. ప్రస్తుతం టాలీవుడ్ లో అందరికీ రన్ టైం అనే ఓ కొత్త జబ్బు పట్టుకుంది. నాకు తెలియక అడుగుతా ఒక పర్టిక్యులర్ రన్ టైంలో సినిమా ఎలా చేస్తారు. కథ డిమాండ్ చేస్తే సినిమాని పెద్దగా తీయాలి. నేనోకటే నమ్ముతా మీ కథ గ్రిప్పింగ్ గా ఉంటే ప్రేక్షకులు నిడివిని పట్టించుకోకుండా సినిమాని ఎంజాయ్ చేస్తారు.

ప్రశ్న) హీరోయిన్ దక్ష గురించి చెప్పండి. మీ సినిమాతో దక్ష బాగా ఫేమస్ అవుతోంది.!
స) దక్ష సినిమాలో సూపర్బ్ గా చేసింది. సినిమాలో తన పాత్ర కోసం, పెర్ఫార్మన్స్ పర్ఫెక్ట్ గా రావడం కోసం బాగా వర్కౌట్ చేసింది. తను తెలుగమ్మాయి కాకపోయినా తన పాత్రకి తనే డబ్బింగ్ చెప్పుకొని పని పట్ల నాకున్న డెడికేషన్ ని నిరూపించుకుంది.

ప్రశ్న) మ్యూజిక్ డైరెక్టర్ కళ్యాణ్ కోడూరి మీతో పనిచేయడం చాలా కష్టమని అన్నాడు. దాని గురించి మీ కామెంట్స్.?
స) చెప్పాలంటే నేను పూర్తిగా పని పని పని అంటూ పనిచేసే పనిపిచ్చోన్ని.. నా పని తర్వాతే నా ఫ్యామిలీ అంటాను. నాతో సింక్ అయిన కొంతమందిని మినహాయిస్తే సినిమానే ఫస్ట్ ప్లేస్ అనే వ్యక్తిత్వం కలవాడిని. అక్కడే నాకు క్రియేటివ్ వర్క్ పరంగా అందరితో విభేదాలు వస్తాయి. నేను ఎవరికైనా చూపించే టార్చర్ వెనకున్న రీజన్ ఒకటే సినిమా బెటర్ గా రావాలి.

ప్రశ్న) మీరెందుకు పెద్ద స్టార్స్ తో సినిమాలు చేయడం లేదు.?
స) ఒక స్టార్ హీరోతో పాటు సెట్లోకి వచ్చే మిగతా కల్చర్ అంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు, అది నాకు కంఫర్టబుల్ గా ఉండదు. వారందరినీ డీల్ చెయ్యడం చాలా కష్టతరమైన ప్రాసెస్. అంతే కాకుండా ఆ టార్చర్ ని భరించేంత ఓపిక నా దగ్గర లేదు.

ప్రశ్న) మీరు తదుపరి చేయనున్న సినిమాల గురించి చెప్పండి.?
స) నెక్స్ట్ ఒక సైన్ ఫిక్షన్ సినిమా చెయ్యాలని అనుకుంటున్నాను. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది.

ప్రశ్న) ‘హోరా హోరీ’ సక్సెస్ పై మీరెంత కాన్ఫిడెంట్ గా ఉన్నారు.?
స) ప్రేక్షకులే సినిమా చూసి డిసైడ్ చెయ్యాలి. అది పక్కన పెడితే ఇప్పటి వరకూ సినిమా చూసిన వారు మాత్రం సినిమా నచ్చిందని చెప్పారు. నాకు తెలిసి ‘హోరా హోరీ’ ప్రేక్షకులను డీసెంట్ గా ఎంటర్టైన్ చేస్తుంది.

Exit mobile version