
‘ఉలవచారు బిర్యాని’తో సినీ పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చిన తేజస్ హీరోగా కిట్టు నల్లూరి దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘కేటుగాడు’. వెంకటేష్ మూవీస్ పతాకంపై వెంకటేష్ బలసాని ఈ సినిమాను నిర్మించారు. చాందినీ హీరోయిన్గా నటించింది. ఇప్పటికే అన్ని కార్యక్రమాలూ పూర్తి చేసుకున్న ఈ సినిమా సెప్టెంబర్ 18న విడుదల కానుంది. ఈ సందర్భంగా సినిమా గురించి నిర్మాత వెంకటేష్‌తో జరిపిన ఇంటర్వ్యూ విశేషాలు..
ప్రశ్న) ‘కేటుగాడు’ అంటూ నిర్మాతగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తున్నారు. మీ నేపథ్యమేంటి? సినిమాల్లోకి ఎలా వచ్చారు.
స) నేను పుట్టి పెరిగిందంతా కరీంనగర్ జిల్లా సిరిసిల్లలోనే..! గత పదేళ్ళుగా హైద్రాబాద్‌లోనే ఉంటూ పలు బిజినెస్‌లు నిర్వహిస్తున్నా. సినిమాలంటే చిన్నప్పట్నుంచీ విపరీతమైన ఆసక్తి. ఎప్పటికైనా సినిమాల్లో భాగమవ్వాలని అనుకుంటూ ఉండేవాణ్ణి. ఈ క్రమంలోనే సినిమా నిర్మాణం వైపు అడుగు పెట్టా.
ప్రశ్న) ‘కేటుగాడు’ సినిమా ఎలా మొదలైంది?
స) కేటుగాడు సినిమా దర్శకుడు కిట్టూ నాకు గత రెండేళ్ళుగా తెలుసు. ఈ కథ గురించి చెప్పినప్పుడు మనమే ఈ సినిమా చేస్తే ఎలా ఉంటుంది అనిపించింది. అన్నీ ప్లాన్ చేసుకొని పక్కాగా ప్రొడక్షన్లోకి దిగాం.
ప్రశ్న) నిర్మాతగా మీకిది మొదటి సినిమా. దర్శకుడు కూడా కొత్తవారంటే రిస్క్ అనిపించలేదా?
స) రిస్క్ ఎక్కడైనా ఉందండీ. ఏ సినిమా అయినా రిస్క్‌తో కూడుకున్నదే. మేము ఈ కథను బలంగా నమ్మి, ఎంతో ఇష్టపడి పనిచేస్తూ అనుకున్నట్లుగానే సినిమాను పూర్తి చేశాం. అనుభవం లేకపోవడంతో కొంత బడ్జెట్ పెరిగిన మాట వాస్తవమే కానీ, క్వాలిటీ పరంగా ఎక్కడా రాజీ పడకుండా సినిమాను చాలా బాగా తీశాం.
ప్రశ్న) కేటుగాడు సినిమా ఎలా ఉండబోతోంది?
స) ‘కేటుగాడు’.. కంటెంట్ పరంగా, క్వాలిటీ పరంగా ఎక్కడా రాజీ పడకుండా చేసిన సినిమా. కార్లు దొంగతనం చేసే ఓ వ్యక్తి, ఒక అమ్మాయి ప్రేమలో పడి మామూలుగా ఎలా మారాడన్న బేసిక్ పాయింట్‌తో ఈ సినిమా తెరకెక్కింది. ఫ్యామిలీతో కలిసి చూడదగ్గ మంచి సినిమా తీశామని నమ్మకంగా చెప్పగలను.
ప్రశ్న) దర్శకుడు కిట్టు గురించి చెప్పండి?
స) కిట్టు.. సినిమా పట్ల మంచి అవగాహన ఉన్న దర్శకుడు. గతంలో చాలా సినిమాలకు అసిస్టెంట్, అసోసియేట్ డైరెక్టర్‌గా పనిచేశాడు. చెప్పింది చెప్పినట్లుగా, మంచి క్వాలిటీ అవుట్‌పుట్ ఇచ్చాడు. నేను ఈ సినిమా చూశాక అసలు రెండు గంటలు ఎలా గడిచిందో కూడా తెలియకుండా సినిమాలో లీనమైపోయాను.
ప్రశ్న) హీరో హీరోయిన్లు తేజస్, చాందినీల గురించి చెప్పండి?
స) ఈ సినిమాకు హీరో హీరోయిన్లను దర్శకుడు కిట్టుయే సెలెక్ట్ చేశారు. తేజస్ గతంలో ఉలవచారు బిర్యాని అనే సినిమాలో నటించాడు. చాందినీ షార్ట్ ఫిల్మ్స్‌లో చాలా ఫేమస్. ఇద్దరూ తమ తమ పాత్రల్లో చాలా బాగా నటించారు.
ప్రశ్న) సినిమా రిలీజ్‌ను ఎలా ప్లాన్ చేస్తున్నారు? తరువాతి ప్రాజెక్టులేంటి?
స) సెప్టెంబర్ 18న ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాం. ఇప్పటికే అన్ని కార్యక్రమాలూ పూర్తయ్యాయి. ఇక ఈ సినిమా తర్వాత కూడా వరుసగా మా బ్యానర్లో సినిమాలు చేస్తాం.