తెలుగు సినీ రంగంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకోవాలనే లక్ష్యంతో ఉన్న నటుడు విరాట్ కర్ణ. నటనపై ఉన్న ఆసక్తితో, తన పాత్రల కోసం కష్టపడటానికి వెనుకాడని విరాట్, ప్రస్తుతం ‘నాగబంధం’ అనే భారీ బడ్జెట్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ప్రేక్షకులను కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లేలా ఈ సినిమాను రూపొందిస్తున్నారు.
ఈ సినిమా కోసం విరాట్ కర్ణ పడిన కష్టం, ఎదుర్కొన్న సవాళ్లు, సెట్స్‌లో జరిగిన ప్రమాదాలు, మరియు తన కెరీర్ ప్లాన్స్ గురించి ఆయనతో చేసిన ప్రత్యేక ఇంటర్వ్యూ ఇప్పుడు మీకోసం…
మీ మొదటి సినిమాకి, ఈ సినిమాకి భారీ బడ్జెట్ తో వస్తున్నారు. ఇంత భారీ ప్రాజెక్ట్స్ ఎలా సాధ్యం అవుతున్నాయి?
నా చేతుల్లో ఏమీ లేదు. భగవంతుడి దయ వల్ల అలా అవకాశాలు వస్తున్నాయి. నేను నా పని చేసుకుంటూ పోతున్నాను. నా మొదటి సినిమా కూడా భారీ బడ్జెట్ సినిమానే. కానీ ఈ స్థాయిలో సినిమా వస్తుందని నేను ఎప్పుడూ ఊహించలేదు. ఇది కేవలం నా అదృష్టం. ఆ సినిమాకు కూడా హీరోగా నా వంద శాతం శ్రమను అందించాను. నేను ఏ రోజూ కష్టపడటానికి వెనక్కి తగ్గలేదు. ఈ సినిమాకు గత సినిమా కంటే రెట్టింపు కష్టపడ్డాను. నా హార్డ్ వర్క్ ఎప్పుడూ వంద శాతం ఉంటుంది. ఫలితం అనేది దేవుడి చేతుల్లో ఉంటుంది. అందులో మన చేతుల్లో ఏమీ లేదు. మనం కేవలం పరీక్ష రాస్తాం, అంతే.
‘నాగబంధం’ సినిమా అవకాశం ఎలా వచ్చింది?
దర్శకుడు అభిషేక్ నామా గారు నా మొదటి సినిమా చూశారు. ఆయన ఈ కథకు తగ్గ హీరో కోసం వెతుకుతున్నప్పుడు హైట్, పర్సనాలిటీ, యాక్టింగ్ అన్నీ చూసుకున్నారు. ఈ పాత్రకు కొత్తవారైతే బాగుంటుందన్న ఆలోచనలో ఉన్నప్పుడు నన్ను పిలిపించి మాట్లాడారు. ఆయన కథ చెప్పినప్పుడు నాకు బాగా నచ్చింది. నేను కూడా చాలా ఎగ్జైట్ అయ్యాను. ఆ నమ్మకంతోనే ప్రాజెక్ట్ ముందుకు తీసుకెళ్లాము. సినిమా ఎవల్యూషన్ ప్రాసెస్‌లో బడ్జెట్ అలా పెరుగుకుంటూ పోయింది.
దర్శకుడు కథ చెప్పినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి?
కథ విన్నప్పుడే ఆ పాత్రకు ఏమేమి కావాలో నాకు ఒక ఐడియా వచ్చేసింది. ఈ కథ నా కోసమే పుట్టిందన్న భావన కలిగింది. అందులోని శివుడి పాత్ర, నాగసాధు పాత్ర గురించి విన్నప్పుడు గూస్బంప్స్ వచ్చాయి. ఇలాంటి అద్భుతమైన సినిమా కోసమే కదా ఎదురుచూస్తున్నాం, ఇది కచ్చితంగా చేయాలి అనుకున్నాను. మరుసటి రోజు నుంచే జిమ్ చేయడం, హార్స్ రైడింగ్ క్లాసులు, డ్యాన్స్ వంటివి ప్రారంభించాను. ఆ పాత్ర కోసం ఒక లక్ష్యం పెట్టుకుని, దానికి తగ్గట్టుగా శరీరాకృతిని మార్చుకోవడం, యాక్టింగ్ వర్క్‌షాప్స్ స్టార్ట్ చేశాను. నా ఉత్సాహం చూసి దర్శకుడు కూడా ఎంతో నమ్మకంతో ముందుకు వెళ్లారు. మా డైరెక్టర్ గారు ఇప్పటికే పార్ట్ 2 కూడా ఉంటుందని ప్రకటించారు.
సినిమాల మధ్య గ్యాప్ రాకుండా ప్లాన్ చేసుకుంటున్నారా?
నేను వరుసగా సినిమాలు చేద్దాం అనుకున్నాను. మొదటి సినిమా పూర్తయ్యాక, ఆ సినిమాకు కూడా ఒక సంవత్సరం సమయం పట్టింది. వరుసగా సినిమాలు చేద్దాం అనుకున్నప్పటికీ, మొదటి సినిమా ఫలితం కొంచెం అటు ఇటు అయ్యేసరికి కొంత డిప్రెషన్ కు గురయ్యాను. ఆ సినిమా ట్రైలర్, టీజర్ అద్భుతంగా వచ్చాయి, సినిమా సూపర్ హిట్ అవుతుందని అనుకున్నాను. కానీ ఫలితం తేడా కొట్టేసరికి కొంతకాలం ఆ బాధలో ఉన్నాను. ఆ తర్వాత నేను తెలుసుకున్నది ఏంటంటే, మనం కష్టపడాలి, ఫలితం మన చేతుల్లో లేదు అని ఫిక్స్ అయ్యాను. ఈ సినిమా చాలా పెద్ద ప్రాజెక్ట్. ఇకపై ప్రతి సంవత్సరం రెండు సినిమాలు చేయాలని నిర్ణయించుకున్నాను.
పాత్రల కోసం ఎలాంటి శారీరక మార్పులు చేశారు? ఆధ్యాత్మికంగా ఎలా సన్నద్ధమయ్యారు?
రుద్ర పాత్ర కోసం శరీరాకృతిని పూర్తిగా మార్చాను. ఆ పాత్ర కోసం 20 కిలోల బరువు పెరిగాను. మళ్ళీ శివుడి పాత్ర కోసం ఇంకొక ఐదు కిలోలు పెరిగి, ఆ తర్వాత మళ్ళీ బరువు తగ్గాను. ఇదంతా ఒక సుదీర్ఘమైన ప్రక్రియ. మొదటి పాత్ర షూటింగ్ పూర్తయ్యాక, నాగసాధు పాత్ర కోసం సిద్ధం కావడానికి ఒక మూడు నెలల సమయం దొరికింది. ఈ సమయంలో నేను ప్రతిరోజూ శివాలయానికి వెళ్లేవాడిని. ఓం నమః శివాయ అనే మంత్రాన్ని వింటూ ఆ ప్రకంపనలను నా నరనరాల్లో నింపుకున్నాను. ప్రతిరోజూ తెల్లవారుజామున మూడు గంటలకే నిద్రలేచి, స్నానం చేసుకొని గుడికి వెళ్లి అభిషేకం చేసి, పూజలు చేసేవాడిని. దేవుడు నాకు ఏదో ఇస్తాడని కాకుండా, ఆ పవిత్రమైన అనుభూతి కోసమే వెళ్ళాను. ఆ ప్రక్రియలో నాకు అర్థమైంది ఏంటంటే, దేవుడు మనలో ఒక తెలియని శక్తిని, సానుకూల వలయాన్ని సృష్టిస్తాడు. అంత నియమంగా పూజలు చేయడం వల్ల నాకు తెలియకుండానే నాగసాధు పాత్ర షూటింగ్ సమయానికి చాలా యాక్టివ్ గా మారాను. మొదటి పాత్ర కంటే నాగసాధు పాత్రలో ఆ ఎనర్జీ ఇంకా స్పష్టంగా కనిపిస్తుంది. మీరు ట్రైలర్ చూస్తే ఆ రెండు పాత్రలకు ఉన్న వైవిధ్యం స్పష్టంగా తెలుస్తుంది. షూటింగ్ పూర్తయ్యాక శివమాల కూడా ధరించాను. ఎంతో పవిత్రంగా శ్రీశైలం వెళ్తుండేవాడిని. అలా నేను కూడా ఆ దైవిక శక్తిని ఫీల్ అయ్యాను.
షూటింగ్ సమయంలో ప్రమాదాలు ఏమైనా జరిగాయా?
క్లైమాక్స్ షూటింగ్ సమయంలో కండరాలు చిరిగిపోయాయి. నాకు జిమ్ చేయడం అంటే చాలా ఇష్టం. సినిమా కోసం ఎక్కువ ఆహారం తీసుకుని లావు కావాల్సి వచ్చింది. కండరాలు దెబ్బతినడం వల్ల జిమ్ చేస్తుంటే విపరీతమైన నొప్పి వచ్చేది. అందుకని డాక్టర్లు ఒక ఆరు నెలలు విశ్రాంతి తీసుకోమన్నారు. సినిమా పూర్తయ్యాక మళ్ళీ జిమ్ మొదలుపెట్టాలి.
ఇంత భారీ సెట్స్ చూసినప్పుడు కొత్త హీరోగా మీకు భయం వేసిందా?
మొదట్లో కచ్చితంగా భయం వేసింది. ఇంత భారీ బడ్జెట్ సినిమా నా జీవితంలో జరుగుతోందా అని నేను ఆశ్చర్యంలో ఉండేవాడిని. షూటింగ్‌కి వెళ్ళినప్పుడు ఆ పెద్ద సెట్లు, ప్రతిరోజూ వేలాది మంది జూనియర్ ఆర్టిస్ట్‌లు, ఆ వాతావరణం చూసి భయపడ్డాను. కానీ మా దర్శకుడు ఆ ఒత్తిడినంతా ఆయనే తీసుకున్నారు. మనం ఒక అద్భుతమైన సినిమా తీస్తున్నాము, ఇవేమీ ఆలోచించకు అని మమ్మల్ని కూల్ చేసేవారు. కొత్త కుర్రాడి మీద వంద కోట్లు పెట్టడం రిస్క్ అని చాలామంది అన్నారు. కానీ వాళ్ళు నమ్మకంతో అంత బడ్జెట్ పెట్టారు. ఈరోజు సినిమాకు వస్తున్న ఆదరణ, బుకింగ్స్ చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. ఇదంతా ఆ శివుడి దయ వల్లే జరుగుతోంది.
దర్శకుడు అభిషేక్ నామా గారితో పనిచేయడం ఎలా అనిపించింది?
దర్శకుడు అభిషేక్ నామా గారితో పనిచేయడం అద్భుతమైన అనుభవం. ఆయన సెట్స్ లో ఒక సాధారణ ప్రేక్షకుడిలా ఆలోచిస్తారు. మాస్ ఆడియన్స్ పల్స్ ఆయనకు బాగా తెలుసు. ఆయన పెట్టిన ఎలివేషన్స్ చూస్తుంటే నాకే గూస్బంప్స్ వచ్చాయి. థియేటర్లో ప్రేక్షకులు కొట్టే చప్పట్ల కోసమే మేమంతా రేయింబవళ్లు కష్టపడుతున్నాం. ఆయన అనుభవం నన్ను ఒక నటుడిగా మరింత రాటుదేలేలా చేసింది. ఆయన నన్ను ఒక ఆణిముత్యం లాగా తీర్చిదిద్దారని భావిస్తున్నాను.
గత సినిమా అనుభవం నేర్పిన పాఠాలు ఏంటి? షూటింగ్ లో మర్చిపోలేని సంఘటన గురించి చెప్పండి.
నా గత చిత్రం పెద్దకాపుని మేమంతా చాలా నమ్మాము. కానీ కొన్ని కారణాల వల్ల ఆ సినిమా జనాలకు చేరువ కాలేకపోయింది. అప్పుడు నేను తెలుసుకున్నది ఒక్కటే, మనం వంద శాతం కష్టపడాలి, ఫలితాన్ని దేవుడికే వదిలేయాలి. పనిలో ఎక్కడా రాజీ పడకూడదని నిర్ణయించుకున్నాను. ఈ సినిమా షూటింగ్ లో ఒక భయంకరమైన సంఘటన జరిగింది. డిసెంబర్లో హైదరాబాద్ లో విపరీతమైన చలి. రాత్రి వేళ బేర్ బాడీతో ఉండటం వల్ల చలిగాలికి విపరీతంగా వణుకు వచ్చేది. రోప్స్ కట్టి 200 అడుగుల పైకి తీసుకెళ్లారు. షాట్ అద్భుతంగా వచ్చింది కానీ, ఆ చలికి నా మెదడు మొద్దుబారిపోయింది. కింద ఉన్న ఫైట్ మాస్టర్ కిచ్చాకు తెలుగు రాదు. ఆయన థాయ్‌లాండ్ మాస్టర్. కిందకి దించమంటే పైకి లేపుతున్నాడు. కిందకు దిగేసరికి చలికి శరీరం గడ్డకట్టుకుపోయింది. ఒంటికి రాసిన రంగు ఎండిపోయి చర్మానికి అతుక్కుపోయింది. చలికి విపరీతంగా వణుకుతుంటే దర్శకుడు వెంటనే నన్ను అపోలో ఆసుపత్రికి తీసుకెళ్లారు. డాక్టర్లు అన్ని పరీక్షలు చేసి డెంగ్యూ లక్షణాలు ఉన్నాయని చెప్పారు. ఇంటికి వెళ్లి విశ్రాంతి తీసుకున్నాను. కేవలం ఒక్కరోజు మాత్రమే బ్రేక్ తీసుకుని, మరుసటి రోజు నుంచి మళ్లీ షూటింగ్‌కి వెళ్ళిపోయాను.
శివుడి పాత్రకు మీకు స్ఫూర్తి ఎవరు?
నాకు స్ఫూర్తి ఎప్పుడూ చిరంజీవి గారే. చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలు చూస్తూ పెరిగాను. శ్రీ మంజునాథ సినిమాలో చిరంజీవి గారు శివుడిగా అద్భుతంగా నటించారు. ఆయన నటనను చూసి ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. ఈ పాత్ర కోసం భాగ్యశ్రీ అనే యాక్టింగ్ కోచ్ వద్ద వర్క్‌షాప్ కూడా చేశాను.
సినిమాలో రొమాంటిక్ ట్రాక్ ఎలా ఉండబోతుంది?
మీరు ట్రైలర్లో ఇప్పటికే ఒక షాట్ చూశారు. అది థియేటర్లో చూస్తే అద్భుతంగా ఉంటుంది. ఆ పాట చాలా బాగా వచ్చింది. హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ, బాండింగ్ అద్భుతంగా కుదిరాయి. నభా నటేష్ గారితో కలిసి నటించడం మంచి అనుభవం. రుద్ర, పార్వతి పాత్రలు ప్రేక్షకులకు బాగా గుర్తుండిపోతాయి. సినిమాలో చాలా సస్పెన్స్ ఎలిమెంట్స్ ఉన్నాయి, వాటిని తెరపైనే చూడాలి.
మీకు ఎలాంటి జానర్ సినిమాలు ఇష్టం? మీ తదుపరి చిత్రాలు ఏంటి?
నాకు యాక్షన్, ఎమోషన్, ఫ్యామిలీ అంశాలు కలిసిన సినిమాలు చేయడం అంటే ఇష్టం. అదృష్టవశాత్తూ ఈ సినిమాలో అవన్నీ ఉన్నాయి. నా తదుపరి రెండు సినిమాలు కొత్త దర్శకులతో ఉండబోతున్నాయి. అదొక యాక్షన్ సూపర్ హీరో సబ్జెక్ట్. సినిమా విడుదలయ్యాక వాటిని అధికారికంగా ప్రకటిస్తాను.
ఇతర భాషల్లో విడుదల, 3D వర్షన్ గురించి చెప్పండి
ఈ చిత్రాన్ని బాలీవుడ్ లో కూడా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. ఇతర భాషల్లో టీజర్ చూసిన వాళ్ళ స్పందన చాలా గొప్పగా ఉంది. ఈ సినిమా 3Dలో కూడా రాబోతోంది. సినిమా విడుదలైన రెండవ వారంలో 3D వర్షన్ ప్రేక్షకుల ముందుకు వస్తుంది.
