లాక్ డౌన్ ఇంటర్వ్యూ సిరీస్ లో మన నెక్స్ట్ గెస్ట్ డైరెక్టర్ వెంకీ కుడుముల. మొదటి చిత్రం ఛలో తో హిట్ అందుకున్న వెంకీ… భీష్మతో ఆ సక్సెస్ జర్నీ కంటిన్యూ చేశారు. నితిన్ హీరోగా ఇటీవల విడుదలైన భీష్మ సూపర్ హిట్ అందుకుంది. ఆ సినిమా సక్సెస్ సంగతులతో పాటు, తన లక్ష్యాలు, ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ వంటి అనేక సంగతులు పంచుకున్నారు…అవేమిటో చూద్దాం..
మీ లేటెస్ట్ సక్సెస్ ఫుల్ మూవీ భీష్మ ఓ టి టి లో స్ట్రీమ్ అవుతుంది, రెస్పాన్స్ ఎలా ఉంది?
సెకండ్ మూవీ కూడా విజయం సాధించడం నాకు చాలా సంతోషం పంచింది. థియేటర్స్ లో వచ్చిన సేమ్ రెస్పాన్స్ డిజిటల్ ఫార్మాట్ లో కూడా వస్తుంది. ఫ్యామిలీ ఆడియెన్స్ మరియు పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అంతకంటే కావలసింది ఏముంది.
భీష్మ సక్సెస్ తరువాత వచ్చిన కాంప్లిమెంట్స్ ఏమిటీ?
భీష్మ మూవీ విడుదల తరువాత వెంకటేష్ గారు ఫోన్ చేసి భీష్మ గురించి అందరూ చాలా బాగా చెవుతున్నారు అన్నారు. ఆయన మూవీ చూసిన తరువాత మళ్ళీ కాల్ చేసి అరగంట మాట్లాడారు. అలాగే తమిళ హీరో శివకార్తీకేయన్ గారు సినిమా చాలా బాగా ఎంజాయ్ చేశాను అన్నారు. వారి కాంప్లిమెంట్స్ నాకు చాలా ఆనందం కలిగించాయి.
భీష్మ చూసిన చిరంజీవి గారి రియాక్షన్ ఏమిటీ?
ఆయనతో కలిసి మూవీ చూసిన క్షణాలు నాకు ఇంకా గుర్తు ఉన్నాయి. ఇంటర్వల్ ముగిసిన తరువాత ఆయన ”అరె భలే తీశావ్ వెంకీ..ట్విస్ట్ నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు” అన్నారు. ఆయన అప్పుడు నా భుజం తడుతూ చెప్పిన ఆ మాటలు నేను ఎప్పటికీ మరచిపోలేను. అలాగే భవిష్యత్తులో ఓ మూవీ చేద్దాం నాకోసం కూడా ఓ స్క్రిప్ట్ సిద్ధం చేయమన్నారు.
నితిన్ కి భీష్మ మంచి బ్రేక్ ఇచ్చిందని చెప్పాలి, ఆయన ఫీలింగ్ ఏమిటీ?
నేను త్రివిక్రమ్ గారి దగ్గర అ ఆ మూవీకి పనిచేసేటప్పటి నుండి నాకు నితిన్ తో పరిచయం ఉంది. భీష్మ షూటింగ్ మొదలుపెట్టిన రోజు నుండి ఆయన ముఖంలో టెన్షన్ నేను గమనించాను. ఇక భీష్మ కు హిట్ టాక్ రావడంతో వ్యక్తి గతంగా నాకు చాలా ఆనందం వేసింది. నితిన్ గారు ఫోన్ చేసి మంచి సక్సెస్ ఇచ్చారు అలాగే మా ఫ్యామిలీ చాలా హ్యాపీగా ఫీలవుతున్నారు అన్నారు.
మీ మొదటి మూవీ ఛలో.. నాగ శౌర్యతో మీకున్న విభేధాలు ఏమిటీ?
ఒక దర్శకుడిగా నాకు మొదటి అవకాశం ఇచ్చినందుకు ఆయనకు నేనుప్పుడూ రుణపడి ఉంటాను. ఇక మా మధ్య గొడవలు అనేవి ఏమి లేవు. వాటి గురించి మాట్లాడుకోవలసిన అవసరం లేదు.
మీ నేపథ్యం ఏమిటీ?
మాది ఖమ్మం జిల్లాలో అశ్వరావ్ పేట అనే ఓ చిన్న గ్రామం. నాకు ఇద్దరు సిస్టర్స్. మొదటి నుండి సినిమా డైరెక్టర్ అవ్వాలనేది కల. అందుకే హైదరాబాద్ వచ్చి దానికి సంబందించిన కోర్సులు నేర్చుకున్నాను. తేజగారు, త్రివిక్రం గారి దగ్గర కొన్నాళ్ళు పనిచేశాను.
మీపై అత్యంత ప్రభావం చూపిన దర్శకుడు ఎవరైనా ఉన్నారా?
చిరంజీవి గారితో సినిమాలు చేసిన అనేక మంది దర్శకుల ప్రభావం నాపై ఉంది. ఐతే పూరి జగన్నాధ్ గారి దర్శకత్వంలో వచ్చిన అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయ నన్ను అత్యంత ప్రభావితం చేసింది. దానితో ఆయనకి ఫ్యాన్ అయిపోయాను.
మీ లైఫ్ లో అత్యంత భావోద్వేగ సంఘటన ఏమిటీ?
ఛలో మూవీ విడుదల తరువాత థియేటర్ లో అందరూ నవ్వుతూ ఉంటే.. అమ్మా నాన్న చాల సైలెంట్ గా చూస్తున్నారట. ఆ విషయం మా సిస్టర్ నాకు ఫోన్ చేసి చెప్పింది. నా మొదటి సక్సెస్ ని వాళ్ళు అలా ఎమోషనల్ గా ఎంజాయ్ చేయడం, నాకు మరచిపోలేని సంఘటన.
మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్?
నాకు నెక్స్ట్ మూడు ప్రాజెక్ట్స్ మైత్రి మూవీ మేకర్స్ మరియు యూవీ క్రియేషన్స్ వారు నిర్మించనున్నారు. ఇక ప్రస్తుతం నేను స్క్రిప్ట్ పూర్తి చేసే పనిలో ఉన్నాను. స్క్రిప్ట్ పూర్తయిన వెంటనే స్టోరీ కి సరిపోయే హీరోని అప్రోచ్ అవుతాను.