
శ్రీనివాస్ అవసరాల.. ‘అష్టా చమ్మా’ సినిమాతో తెలుగు పరిశ్రమకు పరిచయమైన ఈ నటుడు, తనదైన కామెడీ టైమింగ్‌తో అనతికాలంలోనే నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక నటుడిగా తన మార్క్ చూపెట్టిన వెంటనే తాను కలలుగన్న దర్శకత్వం వైపు అడుగులు వేసి ‘ఊహలు గుసగుసలాడే’ సినిమాతో తన టేస్ట్ ఏంటో పరిచయం చేశారు. ఈ సినిమా మంచి విజయం సాధించిన సంవత్సరం తర్వాత శ్రీనివాస్, తన దర్శకత్వంలో ఓ కొత్త సినిమాను మొదలుపెడుతున్నారు. వారాహి సంస్థ నిర్మాణంలో రూపొందనున్న ఈ సినిమాకు సంబంధించిన విశేషాలను ఆయన ఈ ఉదయం తెలియజేశారు.
అచ్యుత రామారావు, ఆనంద్ వర్ధన్‌రావు అనబడే ఇద్దరు అన్నదమ్ములు, వారికి కూతురు వరుసైన జ్యోత్స్న అనే అమ్మాయి.. ఈ ముగ్గురి చుట్టూ తిరిగే కథతో తన కొత్త సినిమా తెరకెక్కనుందని అవసరాల శ్రీనివాస్ తెలిపారు. ఈ పేర్ల ద్వారానే సినిమా టైటిల్ ఉండనుందని ఓ హింట్ ఇచ్చారు. ఈ మూడు పేర్లూ కలిపితే వచ్చే ‘జ్యో అచ్యుత ఆనంద’ అనే ప్రఖ్యాత కీర్తనను సినిమా పేరుగా పెట్టనున్నామనే విషయాన్ని ఇన్‌డైరెక్ట్‌గా తెలిపారు. సెప్టెంబర్ 17న వినాయక చవితి రోజు ప్రారంభం కానున్న ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే తెలియజేస్తామని దర్శకుడు అవసరాల శ్రీనివాస్ ఈ సందర్భంగా తెలిపారు.