కంగనా వారిని టార్గెట్ చేయడం వెనుక అసలు కథ ఇదేనా?

బాలీవుడ్ లో సుశాంత్ సింగ్ ఆత్మ హత్య పెద్ద వ్యతిరేకతకు దారితీసింది . బాలీవుడ్ లో పాతుకుపోయిన బంధుప్రీతి మరియు మాఫియా సుశాంత్ ని పొట్టనబెట్టుకున్నాయని అందరూ ఆరోపించడం జరిగింది. దీనిపై కొందరు దర్శకులు మరియు నటులు కూడా నెపోటిజం వలన తమకు ఎదురైన ఇబ్బందులు, కోల్పోయిన కెరీర్ గురించి బాహాటంగానే విమర్శించారు. ఇక బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ దీని ఆధారంగా కొందరిపై మరింత ఘాటు విమర్శలు చేస్తున్నారు. తాజాగా ఓ ప్రముఖ ఛానెల్ డిబేట్ లో పాల్గొన్న కంగనా కరణ్ జోహాన్, అలియా భట్ మరియు గల్లీ బాయ్ మూవీని ఉద్దేశిస్తూ…తీవ్ర విమర్శలు చేసింది. ఐతే కంగనా, సుశాంత్ మరణం ఉదంతాన్ని అడ్డుపెట్టుకొని తన వ్యక్తికత విభేదాలు తెరపైకి తెస్తుందని, వారిపై తన ఆక్రోశం వెళ్లగక్కడానికి ఇదే అదనుగా రెచ్చిపోతుందని అంటున్నారు.

ఐతే కంగనా పర్టిక్యూలర్ గా కొందరిని టార్గెట్ చేసి విమర్శలు చేయడం వెనుక కారణం పరిశీలిస్తే కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తాయి. మహేష్ భట్ కంగనా రనౌత్ ని పరిశ్రమకు పరిచయం చేయడం జరిగింది. ఓ దశలో కంగనా మహేష్ భట్ మాట వినడం లేదని..కంగనాకు ఆఫర్స్ రాకుండా చేయడంతో పాటు, ఆమెను హరాస్ చేశాడనే వాదన ఉంది. దీనితో ఆయన కూతురు అలియా భట్, కంగనా రనౌత్ టార్గెట్ గా మారిందనేది కొందరి అభిప్రాయం.
అందుకే గల్లీ బాయ్ మూవీలో పది నిమిషాల పాత్రకు అలియాకు అవార్డు ఎలా ఇస్తారు అని ఆమె విమర్శించింది.

ఇక గల్లీ బాయ్ మూవీని కూడా ఆమె పదే పదే టార్గెట్ చేయడానికి కారణం ఆ మూవీ దర్శకురాలు జోయా అక్తర్ కావడమే. జోయా అక్తర్ తండ్రి జావేద్ అక్తర్ తో కూడా కంగనా కు విభేదాలు ఉన్నాయి. హ్రితిక్ రోషన్ తనను మోసం చేశాడని కంగనా చాలా కాలం న్యాయపోరాటం చేశారు. ఆ వివాదంలో మీడియేటర్ గా జావేద్ అక్తర్ ఉన్నారు. అలాగే ఈ విషయంలో కంగనా పై జావేద్ బెదిరింపులకు పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి. దీనితో ఛిచ్చోరె మూవీకి అన్యాయం చేసి అవార్డులు గల్లీ బాయ్ కి కట్టబెట్టారని, అదొక చెత్త సినిమా అని ఆమె విమర్శిస్తున్నారు.

చివరిగా ఆమె కరణ్ జోహార్ ని టార్గెట్ చేయడం వెనుక కారణం…ఆయన అనేక సంధర్భాలలో కంగనా పై అవమానకర వ్యాఖ్యలు చేశారు. దీనితో ఎప్పటి నుండో కంగనా టార్గెట్ సెలెబ్రిటీలలో కరణ్ జోహార్ ముందు వరుసలో ఉంటాడు. సుశాంత్ మరణం తరువాత దేశవ్యాప్తంగా నిరసనలు చెలరేగాయి. కరణ్, అలియా, సల్మాన్, కరీనా వంటి వారిని నెటిజెన్స్ టార్గెట్ చేసి విమర్శలు చేశారు. నెటిజన్స్ మద్దతు పరోక్షంగా కంగనా కు దక్కుతున్న నేపథ్యంలో వారిపై ప్రతీకారం తీర్చుకోవడానికి కంగనా ఇదే సరైన సమయంగా భావిస్తున్నారని కొందరి వాదన.

Exit mobile version