
కొన్ని సినిమాలను కాల గమనంలో మరచిపోతుంటాం. కొన్ని సినిమాలను ఒకానొక ప్రత్యేక కాలంలో వదిలేసి, అప్పుడప్పుడు ఆ కాలానికి వెళ్ళి చూసి వస్తుంటాం. కొన్ని సినిమాలను ఎప్పుడూ కాలంతో పాటే వెంట పెట్టుకొని తీసుకెళతుంటాం. కాలంతో పాటే వెంట తీసుకెళ్ళే అలాంటి అందమైన, అద్భుతమైన సినిమాలనే మనం క్లాసిక్స్ అని పిలుచుకుంటూంటాం. ఈ తరం సినిమాల్లో అలాంటి క్లాసిక్స్ అనబడే వాటిల్లో ఒకటే ‘అతడు’. ‘అతడు’.. నందుగా మొదలై, పార్థుగా నటించడం మొదలుపెట్టి, చివరకు పార్థుగానే మారిపోయిన ఓ వ్యక్తి కథ. 2005 ఆగష్టు 10న.. అంటే సరిగ్గా పదేళ్ళ క్రితం, ఇదే రోజున మహేష్ -త్రివిక్రమ్‌ల కెరీర్లోనే కాక, తెలుగు సినీ చరిత్రలోనూ ఓ ప్రత్యేక సినిమాగా నిలిచిన ‘అతడు’ విడుదలైంది.
అనాథైన నందు, తనకు తెలిసిన ప్రపంచానికి పరిచయమై, ఆ తర్వాత ఓ క్రిమినల్‌గా మారతాడు. డబ్బు కోసం నందు, అతడి ఫ్రెండ్ మల్లి కలిసి చేసే ఓ క్రైమ్ వారి జీవితాల్లో ఊహించని మలుపులు తెచ్చిపెడుతుంది. ఈ క్రమంలోనే నందు, తన ప్రపంచానికి ఏ సంబంధమూ లేని ఒక ఇంట్లో, పార్థు అనబడే ఆ ఇంటి వారసుడిగా నటిస్తాడు. ఆ తర్వాత నందు జీవితంలో వచ్చే మార్పేంటీ? మలుపులేంటీ? అన్న అంశాల చుట్టూ తిరిగే సినిమాయే ‘అతడు’. అతడులో సాధారణంగా బయటకు కనిపించే ఒక బేసిక్ కథ ఉంది. అంతర్లీనంగా చెప్పుకొస్తున్న నందు జీవితం ఉంది. నందు జీవితం చుట్టూ ఉన్న ప్రపంచాలున్నాయి. ఆ ప్రపంచాల్లో ఇంకా చాలా కథలు ఉన్నాయి. ఇన్ని కథలను, ఇన్ని జీవితాలను, ఇన్ని ప్రపంచాలను చూపిస్తున్నాడు కాబట్టే ‘అతడు’ ఇంకా మన చుట్టూనే ఉన్నాడు.
‘నిజం’, ‘నాని’, ‘అర్జున్’ లాంటి పరాజయాల తర్వాత మహేష్ కెరీర్లో వెలుగు నింపిన సినిమా ‘అతడు’. రచయితగానే స్టార్ స్టేటస్‌ను సొంతం చేసుకున్న త్రివిక్రమ్, దర్శకుడిగా చేసిన రెండో ప్రయత్నం ‘అతడు’. త్రివిక్రమ్ అంటేనే మాటలతో మంత్రం చేసి, భావోద్వేగంతో కట్టిపడేసే దర్శక, రచయిత. అలాంటి దర్శకుడికి తన ఆలోచనను అర్థవంతంగా, మాటను అందంగా చెప్పగల నటుడు మహేష్ దొరికితే ఎలా ఉంటుందన్న ఆలోచనకు రూపమే ‘అతడు’. అలాంటి అందమైన ఆలోచనకు రూపం కాబట్టే ‘అతడు’ పార్థుగా మారి మనకు కనిపించి పదేళ్ళైనా ఇప్పటికీ అలానే మెప్పిస్తూ, మురిపిస్తూ మనవెంటే వచ్చేస్తున్నాడు. రాగలిగాడు కూడా. చివరగా ఒక మాట.. ‘అతడు’ సినిమాలో “మరచిపోవడానికి వాడేమైనా జ్ఞాపకమా.. నా జీవితం..” అంటూ ఓ డైలాగ్ ఉంది. సినిమాతో ఈ డైలాగ్కున్న సంబంధాన్ని పక్కనబెడితే, ఇక్కడ మనకు జ్ఞాపకంగా మాత్రమే మిగిలిపోలేని ‘వాడే’ నందు, పార్థూ, అతడు..!