త్వరలోనే తెలుగులో కమల్ స్ట్రైట్ సినిమా!

kamal-hassan
సినీ నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా, రచయితగా ప్రతి విషయంలోనూ తన విలక్షణతను చాటుకుంటూ దేశంలోని గొప్ప కళాకారుల్లో ఒకరుగా పేరు తెచ్చుకున్నారు కమల్ హాసన్. కమల్ హాసన్‌కు తమిళంతో పాటు తెలుగులోనూ భారీ మార్కెట్ ఉన్న విషయం తెలిసిందే. అయితే ఆయన తెలుగులో ఓ స్ట్రైట్ సినిమా చేసి చాలా కాలమే అయింది. గతంలో ‘స్వాతిముత్యం’, ‘సాగర సంగమం’ లాంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించిన కమల్ చేసిన చివరి స్ట్రైట్ తెలుగు సినిమా ‘ఈనాడు’.

తాజాగా ఆయన మరో తెలుగు సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం కమల్ నటించిన ‘ఉత్తమ విలన్’, ‘విశ్వరూపం 2’, ‘పాపవినాశనం’ సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఈ సినిమాలు విడుదలయిన తర్వాత ‘ఒరే ఇరవు’ అనే సినిమాను మొదలుపెట్టనున్నారు. ఇక ఆ సినిమా కూడా పూర్తయ్యాక కమల్ హాసన్ తన తెలుగు సినిమాపై దృష్టి పెట్టనున్నట్లు తెలుస్తోంది. కమల్ సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన ఓ యువ దర్శకుడిని ఈ సినిమా ద్వారా పరిచయం చేయనున్నారట. అయితే ఈ సినిమా గురించి ఇప్పుడే అన్ని విషయాలు చెప్పడానికి కమల్ నిరాకరించారు.

ఇక కమల్ హాసన్ తాజాగా నటించి, నిర్మించిన సినిమా ‘ఉత్తమ విలన్’. రమేష్ అరవింద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ డిఫరెంట్ సినిమా మే 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగులో ప్రముఖ నిర్మాత సి. కళ్యాణ్ భారీ ఎత్తున విడుదల చేయనున్నారు. ఆండ్రియా, పూజ కుమార్‌లు హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు ప్రముఖ దర్శకుడు లింగుస్వామి సహ నిర్మాతగా వ్యవహరించారు.

Exit mobile version