
కమల్ హాసన్ హీరోగా తెలుగు, తమిళ భాషల్లో ‘చీకటి రాజ్యం’ (తమిళంలో తూంగవనం) పేరుతో ఓ సినిమా రూపొందుతోన్న విషయం తెలిసిందే! గతంలో కమల్ హీరోగా చేసిన పలు సినిమాలకు అసిస్టెంట్‌గా పనిచేసిన రాజేష్ ఎమ్ సెల్వ ఈ సినిమాకు దర్శకుడు. ఒకే ఒక్క రాత్రి జరిగే వినూత్న కథతో తెరకెక్కుతోన్న ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుంది. హైద్రాబాద్, చెన్నైల్లో కేవలం 40 రోజుల్లోనే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేయడం విశేషంగా నిలిచింది.
ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. షూటింగ్ మొదలైన రోజే విడుదల చేసిన ఫస్ట్‌లుక్‌కు విపరీతమైన స్పందన రాగా, త్వరలోనే ఓ టీజర్‌ను కూడా విడుదల చేసే ఆలోచనలో సినిమా యూనిట్ ఉంది. త్రిష హీరోయిన్గా నటిస్తోన్న ఈ సినిమాను కమల్ స్వయంగా నిర్మిస్తున్నారు. గిబ్రాన్ సంగీతం సమకూరుస్తున్నారు. త్వరలోనే ఆడియో రిలీజ్, సినిమా రిలీజ్ డేట్లను తెలియజేయనున్నట్లు తెలుస్తోంది. ఇక కమల్ హాసన్ నటించిన ‘విశ్వరూపం 2’ విడుదలకు సిద్ధమైన విషయం తెలిసిందే!