
మెగా ఫ్యామిలీ హీరో వరుణ్ తేజ్, విలక్షణ సినిమాల దర్శకుడు క్రిష్ కాంబినేషన్లో ‘కంచె’ పేరుతో ఓ సినిమా రూపొందుతోన్న విషయం తెలిసిందే. తన ప్రతి సినిమాలోనూ ఏదో ఒక బలమైన ఎమోషన్‌ను చూపించే క్రిష్, ‘కంచె’ సినిమాను రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో నడిచే ఓ ప్రేమకథకు ముడిపెట్టి తెరకెక్కించారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా టీజర్‌తో అలరించిన కంచె టీమ్, రెండో ప్రపంచ యుద్ధం మొదలైన రోజైన సెప్టెంబర్ 1న ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇక సెప్టెంబర్ 12న ఆడియో రిలీజ్ వేడుకను ప్లాన్ చేసినా చివరకు అది వాయిదా పడింది.
తాజా సమాచారం మేరకు సినిమా యూనిట్, ఆడియో రిలీజ్‌ను వైజాగ్‌లో నిర్వహించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ 17న ఈ ఆడియో రిలీజ్‌ను ప్లాన్ చేస్తున్నారని సమాచారం. రెండో ప్రపంచ యుద్ధానికి, వైజాగ్ ప్రాంతానికి సంబంధం ఉన్న నేపథ్యంలో అక్కడ ఈ ఈవెంట్‌ను జరపాలని భావిస్తున్నారు. ఇక సెప్టెంబర్ 1న విడుదలైన ట్రైలర్‌కు అంతా ఫిదా అయిపోయారు. పలువురు స్టార్ హీరోలు సైతం ఈ ట్రైలర్‌ను కొనియాడారు. ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్గా నటించిన ఈ సినిమాను సాయిబాబు జాగర్లమూడి, వై.రాజీవ్ రెడ్డి నిర్మించారు. అక్టోబర్ 2న ఈ సినిమా విడుదల కానున్న విషయం తెలిసిందే!

