
మెగా ఫ్యామిలీ నుంచి కొత్తగా లాంచ్ అయిన డైనమిక్ హీరో వరుణ్ తేజ్ తన రెండో సినిమా ‘కంచె’కు విలక్షణ దర్శకుడు క్రిష్‌తో జతకట్టిన విషయం తెలిసిందే! మొదటి సినిమా ‘ముకుందా’తోనే హీరోగా మంచి మార్కులు కొట్టేసిన వరుణ్, ఇప్పుడీ రెండో సినిమా ‘కంచె’లో సరికొత్త పాత్రలో అందరినీ ఆశ్చర్యపరచనున్నారని తెలుస్తోంది. ‘గమ్యం’, ‘వేదం’, ‘కృష్ణం వందేజగద్గురుమ్’ లాంటి విలక్షణ కథాంశాల నేపథ్యంలో నడిచే సినిమాలను తెరకెక్కించిన క్రిష్, ఈ సినిమాను రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో తెరకెక్కించారని తెలుస్తోంది.
ఇక ఈ సాయంత్రం ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ చూశాక సినిమాపై ఇప్పటివరకూ ఉన్న అంచనాలు డబుల్ అయ్యాయనే చెప్పాలి. తుపాకి పట్టుకొని నిలబడి ఉన్న హీరో మేజర్ పార్ట్‌లో కనిపిస్తుండగా, అతడి ఆలోచనల్లోని ప్రేమకథను చిన్న పోర్షన్లో చూడొచ్చు. అలాగే బ్యాక్‌గ్రౌండ్‌లో ఓ లెటర్ కూడా ఉంది. కచ్చితంగా ఈ మూడు అంశాల చుట్టూ ఓ బలమైన కథ అల్లి ఉంటారన్న విషయం స్పష్టమవుతూనే ఉంది. క్రిష్ ఎప్పట్లానే తనది డిఫరెంట్ స్టైల్ అని చెప్పకనే చెప్పేశారు.
తెలుగు సినిమాల్లో ఇలాంటి పోస్టర్ రాలేదనే చెప్పుకోవాలి. ఈ పోస్టర్ రిలీజ్ అయిన వెంటనే సోషల్ మీడియాలో ట్రెండింగ్ టాపిక్‌గా నిలబడింది. పోస్టరే ఇలా ఉంటే.. ఇక స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగష్టు 15న విడుదల కానున్న టీజర్ ఇంకెంత ఆశ్చర్యపరచేలా ఉందనే ఆసక్తి ఇప్పట్నుంచే మొదలైంది. అక్టోబర్ 2న ఈ సినిమా విడుదల కానున్న విషయం తెలిసిందే. ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్గా నటించారు.

