
మెగా ఫ్యామిలీ నుంచి కొత్తగా లాంచ్ అయిన డైనమిక్ హీరో వరుణ్ తేజ్. తన మొదటి సినిమా ‘ముకుందా’తోనే హీరోగా మంచి మార్కులు కొట్టేశాడు వరుణ్. ఇప్పుడు తాజాగా ‘గమ్యం’, ‘వేదం’, ‘కృష్ణం వందేజగద్గురుమ్’ లాంటి విలక్షణ సినిమాల దర్శకుడు క్రిష్ దర్శకత్వంలో కంచె పేరుతో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఫిబ్రవరి నెలాఖర్లో ప్రారంభమైన ఈ సినిమా మొదట రామా నాయుడు స్టూడియోలో వేసిన సెట్స్‌తో పాటు, కొంత భాగం ఉత్తరాంధ్రలోని పల్లెటూర్లలో షూటింగ్ జరుపుకుంది.
తాజాగా గత నెల కంచె యూనిట్ ఓ భారీ షెడ్యూల్ కోసం జార్జియా వెళ్ళిన విషయం తెలిసిందే! జార్జియాలో దాదాపుగా 20రోజులకు పైనే జరిగిన షూటింగ్‌లో సినిమాకు సంబంధించిన మేజర్ పార్ట్‌ను పూర్తి చేశారు. ఇక ఈ షెడ్యూల్‌ను పూర్తి చేసుకొని ఇవ్వాళే సినిమా యూనిట్ హైద్రాబాద్‌కు వచ్చేసింది. జార్జియా షెడ్యూల్ పూర్తైందని ఈ సందర్భంగా వరుణ్ తేజ్ అభిమానులకు ఓ ట్వీట్ చేశారు. ఇక ఈ సినిమాలో వరుణ్ తేజ్ సరసన ప్రగ్య జైశ్వాల్ హీరోయిన్ గా నటిస్తున్నారు. రాజీవ్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాను దసరాకు విడుదల చేశేలా ప్లాన్ చేస్తున్నారు.

