కొత్త సినిమా సన్నాహాల్లో ‘కేరింత’ దర్శకుడు

Saikiran-Adivi
‘వినాయకుడు’, ‘విలేజ్‌లో వినాయకుడు’, ‘కేరింత’.. ఇలా ఈ మూడంటే మూడే సినిమాలతోనే తెలుగు సినీ పరిశ్రమలో తనదంటూ ఓ ప్రత్యేక సినిమా ఉంది అని చాటి చెప్పుకున్న దర్శకుడు సాయికిరణ్ అడివి. దిల్‌రాజు నిర్మాతగా సాయికిరణ్ అడివి రూపొందించిన ‘కేరింత’ గత సమ్మర్‌లో విడుదలై మంచి విజయం సాధించిన విషయం తెలిసిందే! ‘కేరింత’ సినిమా అందించిన ఉత్సాహంతో సాయికిరణ్ వెంటనే తన తరువాతి సినిమా కోసం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది.

ఇక తన గత సినిమాల్లానే ఓ మంచి ఫీల్ గుడ్ ఎంటర్‌టైనర్‌ను అందించేందుకు సాయికిరణ్ ప్రయత్నిస్తున్నారట. ఈసారి ఓ కొత్త జానర్‌లో ఆయన సినిమా ఉండనుందని తెలుస్తోంది. శేఖర్ కమ్ముల దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా ప్రయాణం మొదలుపెట్టిన సాయికిరణ్, 2008లో వినాయకుడు సినిమాతో దర్శకుడుగా మారారు. ఇన్నేళ్ళలో మూడంటే మూడే సినిమాలు చేసినా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవడంలో మాత్రం సఫలమయ్యారు. నేడు తన పుట్టినరోజు జరుపుకుంటున్న సాయికిరణ్‌కు 123తెలుగు తరపున శుభాకాంక్షాలు. ఎప్పట్లానే అర్థవంతమైన సినిమాలు చేస్తూ మనల్ని మెప్పించాలని కోరుకుందాం.

Exit mobile version