
‘గమ్యం’, ‘వేదం’, ‘కృష్ణమ్ వందే జగద్గురుమ్’ లాంటి సరికొత్త కథాంశాల నేపథ్యంలో నడిచే సినిమాలతో కొత్త పంథాకు నిర్దేశం చేసిన దర్శకుడు క్రిష్. తాజాగా అక్షయ్ కుమార్ హీరోగా, క్రిష్ హిందీలో దర్శకత్వం వహించిన సినిమా ‘గబ్బర్’. గతంలో తమిళంలో నిర్మించబడి సూపర్ హిట్‌గా నిలిచిన మురుగదాస్ సినిమా ‘రమణ’కి రీమేకే ఈ గబ్బర్. ఇక ‘రమణ’ సినిమా, తెలుగులో ‘ఠాగూర్’ పేరుతో చిరంజీవి హీరోగా రీమేక్ అయి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.
‘గబ్బర్’ సినిమా రేపు (మే 1న) ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల కానుంది. ఈ సంవత్సరం బాలీవుడ్లో విడుదలవుతున్న సినిమాల్లో మంచి క్రేజున్న పెద్ద సినిమాల్లో గబ్బర్ ఒకటి. దీంతో ఆ క్రేజ్‌ను సినిమాకు కలెక్షన్లను తెచ్చిపెట్టేలా చేసేందుకు సినిమా యూనిట్ వినూత్న ప్రయత్నాలు చేస్తోంది. హీరో అక్షయ్ కుమార్, శృతీ హాసన్‌లు ముంబై వీధుల్లో ఆటోల్లో తిరుగుతూ, మెట్రో రైల్లో ప్రయాణిస్తూ సినిమాకు విపరీతమైన ప్రచారాన్ని కల్పిస్తున్నారు. ఈ వినూత్న ప్రచారానికి ప్రజలు కూడా భారీ ఎత్తున మద్దతు తెలుపుతూండడం విశేషం.
ప్రముఖ దర్శక నిర్మాత సంజయ్ లీలా భన్సాలీ నిర్మించిన ఈ సినిమాలో అక్షయ్ డిఫరెంట్ గెటప్‌లో కనిపిస్తూ ఆకట్టుకుంటున్నాడు. సినిమా ఔట్‌పుట్‌పై నిర్మాత సంజయ్ లీలా భన్సాలీ చాలా హ్యాపీగా ఉన్నారట. అర్థవంతమైన సినిమాలను తెరకెక్కించే యువ దర్శకుడు క్రిష్ గబ్బర్ సినిమాను అన్ని విధాలా ఆకట్టుకునేలా తెరకెక్కించాడని భన్సాలీ క్రిష్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. ఇక ఈ సినిమాకు అంతటా ప్రీ రిలీజ్ పాజిటివ్ టాక్ నడుస్తోంది. శృతి హాసన్, కరీనా కపూర్ ఈ సినిమాలో హీరోయిన్లుగా నటించారు.