‘ఒక్కడు’ సీక్వెల్.. ఉంటుందంటున్న నిర్మాత

MSRaju
సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్లోని అపురూపమైన చిత్రాల్లో ‘ఒక్కడు’ కూడ ఒకటి. గుణశేఖర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాతోనే మహేష్ బాబు మాస్ హీరోగా ఎదిగారు. అక్కడి నుండే ఆయన కెరీర్ సరికొత్త మలుపు తిరిగింది. అప్పటి వరకు ఉన్న తెలుగు సినిమా రెగ్యులర్ మీటర్ ను ఈ చిత్రం బ్రేక్ చేసిందనే చెప్పాలి. వాస్తవికతకు చాలా దగ్గరగా ఉండే కథ, పాత్రలు, సన్నివేశాలు సినిమాను ప్రేక్షకులకు దగ్గరయ్యేలా చేశాయి.

ఈ చిత్రాన్ని సుమంత్ ఆర్ట్స్ బ్యానర్ మీద ఎం.ఎస్.రాజు నిర్మించారు. ఇప్పటికీ టీవీలో ఈ సినిమా వస్తే పలానా ఫైట్ బాగుంటుంది, ఇంటర్వెల్ సీన్ అదిరిపోతోంది, పాటలు బాగుంటాయి అంటూ ఆసక్తిగా చూస్తుంటారు ప్రేక్షకులు. నిర్మాత ఎం.ఎస్.రాజు ఇటీవలే స్వీయ దర్శకత్వంలో ‘డర్టీ హరి’ అనే సినిమాను చేశారు. ఈ సందర్బంగా ఆయన్ను ‘ఒక్కడు’ సీక్వెల్ గురించి తరచూ అడుగుతున్నారు అభిమానులు. రాజుగారు కూడ ఉండొచ్చు అన్నట్టే సంకేతాలిస్తూ వచ్చారు. అయితే తాజాగా సోషల్ మీడియాలో ప్రేక్షకులతో ఇంటరాక్ట్ అయిన ఆయన మహేష్ బాబుతో సినిమా ఉంటుందని చెప్పడమే కాకుండా కథ కుదిరితే ‘ఒక్కడు’ సీక్వెల్ చేస్తానని అంటున్నారు. అలాగే సీక్వెల్ సెట్ అయితే దర్శకుడు గుణశేఖర్ అని చెబుతున్నారు. ఈ విషయాలపై వచ్చే నెలలో స్పష్టత ఇస్తానని అంటున్నారు. మరి చూడాలి రాజుగారు మహేష్ అభిమానులకు ఎలాంటి వార్త మోసుకొస్తారో.

Exit mobile version