
దర్శక ధీరుడు రాజమౌళి రూపొందించిన ‘బాహుబలి’ సినిమా విడుదలైన అన్నిచోట్లా ప్రభంజనం సృష్టించిన విషయం తెలిసిందే. తెలుగు, తమిళ, హిందీ, మళయాలం ఇలా అన్ని భాషల్లో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ఈ సినిమా తెలుగు సినిమాను అంతర్జాతీయ స్థాయికి కూడా తీసుకెళ్ళింది. ఇక ఈ మధ్యే యాభై రోజులు కూడా పూర్తి చేసుకున్న ఈ సినిమా, కలెక్షన్స్ పరంగా ఎవరూ అందుకోలేని రికార్డులను సెట్ చేసింది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా సాటిలైట్ హక్కులకు అన్ని భాషల్లో విపరీతమైన డిమాండ్ కనిపించింది.
కాగా ఇప్పటికే తమిళం, మళయాలం, హిందీ ఇలా మూడు ఇతర భాషలకు సంబంధించిన సాటిలైట్ హక్కుల అమ్మకం పూర్తవగా, తెలుగులో మాత్రం ఈ విషయమై స్పష్టత రాలేదు. తెలుగులో రెండు ప్రధాన టీవీ చానళ్ళ మధ్య ‘బాహుబలి’ సాటిలైట్ రైట్స్ కోసం పెద్ద పోటీయే జరగ్గా చివరకు ఈ హక్కులను మాటీవీ సొంతం చేసుకుంది. జూలై 10న విడుదలైన బాహుబలి పార్ట్ 1తో పాటు, వచ్చే ఏడాది రానున్న పార్ట్ 2ను కూడా కలిపి భారీ ధరకు ఈ హక్కులను మాటీవీ సొంతం చేసుకుందని సమాచారం. ఆర్కా మీడియా వర్క్స్ నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమాలో ప్రభాస్,రానా, అనుష్క, తమన్నా ప్రధాన పాత్రల్లో నటించారు.

