సాయి కొర్రపాటి చేతికి ‘రుద్రమదేవి’ కృష్ణా జిల్లా హక్కులు

సాయి కొర్రపాటి చేతికి ‘రుద్రమదేవి’ కృష్ణా జిల్లా హక్కులు

Published on Jul 15, 2015 8:38 PM IST

rudhramadevi-(1)
గుణశేఖర్ కలల ప్రాజెక్టుగా తెరకెక్కిన ప్రతిష్టాత్మక చారిత్రక సినిమా ‘రుద్రమదేవి’. భారతదేశపు మొట్టమొదటి ౩డీ బయోపిక్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో రుద్రమదేవి పాత్రను అనుష్క పోషించగా, మరో ప్రధాన చారిత్రక గోనగన్నారెడ్డి పాత్రను హీరో అల్లు అర్జున్ పోషించారు. హీరో రానా, నిత్యామీనన్‌లు కీలక పాత్రల్లో నటించారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, ఆడియోతో సినిమా పట్ల అంచనాలు పెరిగిపోగా ఈమధ్యే మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమాకు వాయిస్ ఓవర్ అందించడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఇక తాజాగా రుద్రమదేవి డిస్ట్రిబ్యూషన్ హక్కులు భారీ ధరకు అమ్ముడై సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.

ప్రముఖ నిర్మాత సాయి కొర్రపాటి ‘రుద్రమదేవి’ సినిమా కృష్ణా జిల్లా హక్కులను 2.80కోట్లకు సొంతం చేసుకున్నారు. ఈ మధ్యే ‘బాహుబలి’ సినిమా ద్వారా పంపిణీదారుడుగా మంచి సక్సెస్ కొట్టిన సాయి కొర్రపాటి ఈ సినిమా కూడా అదే స్థాయి హిట్ తెచ్చిపెడుతుందన్న నమ్మకంతో ఉన్నారు. ఇక 3డీకి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో జాప్యం వల్ల వాయిదా పడుతూ వచ్చిన ‘రుద్రమదేవి’ సినిమా ఈ కార్యక్రమాలన్నీ చివరిదశకు చేరుకోవడంతో త్వరలోనే సినిమా రిలీజ్‌కు సిద్ధమైంది.

ఇప్పటికే రిలీజ్‌కి సంబంధించిన ప్రమోషనల్ కార్యక్రమాలను కూడా వేగవంతం చేశారు. భారతదేశపు మొట్టమొదటి స్టీరియోస్కోపిక్ 3డీ బయోపిక్ సినిమా కావడంతో ఈ సినిమాపై మొదట్నుంచీ భారీ అంచనాలే ఉన్నాయి. మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా మార్క్ సంగీతం ఈ సినిమాకు హైలైట్‍గా నిలవనుందని తెలుస్తోంది.

తాజా వార్తలు