
మోహన్ లాల్.. మళయాల సినీ పరిశ్రమలో దశాబ్దాలుగా సూపర్ స్టార్‌గా వెలుగొందుతోన్న నటుడు. తెలుగులో కూడా గతంలో ‘గాంఢీవం’ అనే సినిమాలో ఓ చిన్న పాత్రలో మెప్పించిన ఆయన, మణి రత్నం రూపొందించిన ఇద్దరు సినిమా ద్వారా తెలుగు పరిశ్రమకు మరింత దగ్గరయారు. ఇక ఈ మధ్యే తమిళ సినిమా ‘జిల్లా’ తెలుగు డబ్బింగ్ ద్వారా మళ్ళీ మెప్పించిన మోహన్ లాల్, త్వరలోనే ఓ స్ట్రైట్ తెలుగు సినిమాలో కనిపించనున్నారు. మళయాల సూపర్ స్టార్‌కు తెలుగులోనూ మంచి క్రేజ్ ఉన్న నేపథ్యంలో ఆయన చేయబోయే సినిమాపై ఇప్పట్నుంచే అంచనాలు మొదలయ్యాయి.
‘నువ్వే నా ప్రాణమని’ అనే టైటిల్‌తో రూపొందనున్న ఈ సినిమాకు సురేష్ వంశీ దర్శకుడు. సురజ్, కవిత హీరో, హీరోయిన్లుగా నటించనున్న ఈ సినిమాలో మోహన్ లాల్ ఓ ప్రధాన పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. రాయలసీమ నేపథ్యంలో నడిచే ఈ యాక్షన్ ఎంటర్టైనర్కు మోహన్ లాల్ పాత్ర హైలైట్‌గా నిలవనుందని సమాచారం. ఈ.ఎస్.విశ్వనాథన్ ఈ సినిమాకు నిర్మాణంలో తెరకెక్కనున్న ఈ సినిమా ఈనెలాఖర్లో సెట్స్‌పైకి వెళ్ళనుంది. ఇక దాదాపు రెండు దశాబ్దాల తర్వాత మోహన్ లాల్‌ను ఒక తెలుగు సినిమాలో కనిపించనుండడం ఆసక్తికరమైన విషయమే!