
సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజినీకాంత్ – కమర్షియల్ డైరెక్టర్ కెఎస్ రవికుమార్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా ‘లింగ’ భారీ ఎత్తున విడుదలకి సిద్దమవుతోంది. ఈ సినిమా రిలీజ్ కి ఇంకా పది రోజులు మాత్రమే సమయం ఉండడంతో రోజు రోజుకీ అంచనాలు పెరిగిపోతున్నాయి. గత రెండు రోజులుగా రిలీజ్ చేస్తున్న లింగ పోస్టర్స్ సినిమాపై అంచనాలను పెంచేస్తున్నాయి. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకున్న ఈ సినిమా తమిళ వెర్షన్ కి సెన్సార్ బోర్డు క్లీన్ ‘యు’ సర్టిఫికేట్ ఇచ్చింది.
రజినీకాంత్ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమాలో అనుష్క, సోనాక్షి సిన్హా హీరోయిన్స్ గా కనిపించనున్నారు. రజినీకాంత్ డైరెక్ట్ గా చేసిన రోబో సినిమా వచ్చి 4 సంవత్సరాలవుతోంది. అంతే కాకుండా రజినీ నటించిన కొచ్చాడియాన్ సినిమా అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. దాంతో కెఎస్ రవికుమార్ – రజినీకాంత్ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి ఈ సినిమా ఏ మేరకు ఆడియన్స్ ని మెప్పించి, ఎన్ని రికార్డ్స్ క్రియేట్ చేస్తుందనేది తెలియాలంటే డిసెంబర్ 12 వరకూ ఆగాల్సిందే.. ఎఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాకి రాక్ లైన్ వెంకటేష్ నిర్మాత.