
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఓ భారీ ద్విభాషా చిత్రంలో నటించేందుకు ప్లాన్ చేసుకుంటున్నట్లు సమాచారం. ఇప్పటివరకూ కేవలం తెలుగు సినిమాలకు మాత్రమే పరిమితమైన అల్లు అర్జున్.. ఇతర భాషల్లోనూ మార్కెట్ పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. తెలుగులో విడుదలైన అల్లు అర్జున్ సినిమాలు.. ఇతర భాషల్లో డబ్ అయి మంచి హిట్ అయినవి చాలానే ఉన్నాయి. అయితే ఈసారి మాత్రం డబ్బింగ్ సినిమా ద్వారా కాకుండా ఏకంగా స్ట్రైట్ సినిమా ద్వారానే అక్కడ సత్తా చాటాలని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే తమిళంలో మాస్, కమర్షియల్ చిత్రాల దర్శకుడు లింగుస్వామితో కలిసి పనిచేసే సూచనలు కనిపిస్తున్నాయి.
ఒకేసారి తమిళ, తెలుగు భాషల్లో నిర్మించడం ద్వారా రెండు మార్కెట్లలో సినిమాకు తిరుగుండదనేది ట్రేడ్ వర్గాల అంచనా. తమిళంలో లింగుస్వామి సినిమాలకున్న క్రేజ్ కూడా కలిసివచ్చే అంశం. అల్లు అర్జున్ ప్రస్తుతం చేస్తోన్న సన్నాఫ్ సత్యమూర్తి చివరి దశలో ఉంది. ఏప్రిల్ 2న సినిమాను విడుదల చేసే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక ఆ తర్వాత బోయపాటి సినిమాను పూర్తి చేసి, డిసెంబర్ నుంచి ఈ భారీ ద్విభాషా చిత్రంపై అల్లు అర్జున్ పనిచేస్తారని సమాచారం.