
తెలుగు సినీ పరిశ్రమతో పాటు, సామాన్య ప్రజానీకం కూడా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘మా’ ఎన్నికల ఫలితాలకు రంగం సిద్ధమైంది. తెలుగు సినీ పరిశ్రమలో నటీనటుల సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటైన ‘మా’ అసోసియేషన్‌కు ఎన్నికలు ఎక్కువ సార్లు ఏకగ్రీవంగానే జరిగాయి. గత రెండు దఫాలుగా మా అధ్యక్ష పదవిలో ప్రస్తుత ఎంపీ మురళీ మోహన్ కొనసాగుతున్నారు. రాజకీయ కార్యక్రమాల్లో బిజీగా ఉండడంతో ఆయన మళ్ళీ ఈ పదవిని చేపట్టే ఆలోచన చేయలేదు. ఆ క్రమంలోనే 2015-17 దఫాకు పోటీ జరగగా ప్రముఖ నటుడు రాజేంద్ర ప్రసాద్, సహజ నటి జయసుధ అధ్యక్ష పదవికి పోటీ పడ్డారు.
ఇరువర్గాలు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకోవడం, సవాళ్ళు విసురుకోవడంతో ఈ ఎన్నికల తంతు సామాన్యుడికీ హాట్ టాపిక్‌గా మారింది. మార్చి 29న ఈ ఎన్నికలకు పోలింగ్ జరిగింది. అయితే ఎన్నికలు ముగిసినా దీనికి సంబంధించిన కేసొకటి కోర్టు పరిధిలో ఉన్నందున ఫలితాలు వెలువడలేదు. అప్పట్లో ‘మా’ ఎన్నికలను నిలిపివేయాలని ఓ కళ్యాణ్ అనే వ్యక్తి కోర్టులో వేసిన పిటిషన్‌ను స్వీకరించిన కోర్టు, ఎన్నికల నిర్వహణను నిలిపివేయడాన్ని తోసిపుచ్చింది. అయితే.. కోర్టు ఉత్తర్వులు వెలువడే వరకూ ఫలితాలు ప్రకటించకూడదని తెలిపింది. ఇప్పటికే రెండు మూడు సార్లు వాయిదా పడిన విచారణకు మొన్న తెరపడింది. కేసును సమగ్రంగా పరిశీలించిన కోర్టు పిటిషన్‌ను కొట్టివేసింది. ఈ పిటిషన్ వేసినందుకు గాను పిటిషనర్‌పై పది వేల జరిమానా కూడా విధించింది.
ఇక కోర్టు నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ రావడంతో ‘మా’ ఎన్నికల ఫలితాల విడుదలకు అన్ని అడ్డంకులు తొలిగాయ్. రేపు (ఏప్రిల్ 17న) ఈ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను ఫిల్మ్ చాంబర్‌లో చేపడతారు. ఉదయం పది గంటలకు కౌంటింగ్ మొదలుకానుంది. ఎన్నో అంచనాలు, ఆసక్తికర పరిణామాల మధ్య జరిగిన ఈ ఎన్నికల్లో గెలుపెవరిదనేది రేపు తేలిపోనుంది. ఈ సందర్భంగా పోటీలో నిలబడ్డ రాజేంద్ర ప్రసాద్, జయసుధలకు 123తెలుగు తరపున ఆల్ ది బెస్ట్.

