సుమంత్ హీరోగా, సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న డివోషనల్ మిస్టరీ థ్రిల్లర్ ‘మహేంద్రగిరి వారాహి’. మహేంద్రగిరి అనే ఒక రహస్య ప్రాంతం నేపథ్యంలో, వారాహి దేవి దివ్య శక్తి చుట్టూ తిరిగే కథతో ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. ఈ సినిమాను రాజశ్యామల ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు బ్రిడ్జ్ ఫిల్మ్స్ బ్యానర్లపై కాలిపు మధు, లక్ష్మణ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని ప్రేక్షకులకు మరింత దగ్గర చేసేందుకు చిత్రబృందం ఒక వెరైటీ ప్రమోషనల్ క్యాంపెయిన్‌కు శ్రీకారం చుట్టింది.
ఇందులో భాగంగా తెలుగు రాష్ట్రాల్లోని పలు థియేటర్లలో వారాహి దేవి విగ్రహాలను ప్రతిష్ఠించనున్నారు. ప్రేక్షకులు సినిమా హాల్‌లోకి అడుగుపెట్టిన క్షణం నుంచే ఒక భక్తిభావంతో కూడిన అనుభూతిని పొందేలా ఈ వినూత్న ప్లాన్ చేశారు. ఈ కార్యక్రమం శుక్రవారం హైదరాబాద్‌లోని మూసాపేటలో గల శ్రీరాములు థియేటర్‌లో ప్రారంభం కానుంది. ఈ విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవంలో హీరో సుమంత్‌తో పాటు చిత్రయూనిట్ సభ్యులు పాల్గొననున్నారు.
ఈ వెరైటీ ప్రమోషన్ సినిమాపై అంచనాలను పెంచడమే కాకుండా, థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్‌ను మరింత ప్రత్యేకంగా మార్చనుంది. త్వరలోనే ఈ చిత్ర విడుదల తేదీని ప్రకటించనున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో ఐశ్వర్య రాజేష్, మీనాక్షి గోస్వామి, మాళవిక నాయర్, బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, రాజీవ్ కనకాల, ఆలీ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
