ఫోర్బ్స్ జాబితా : తెలుగు సెలబ్రిటీలలో మహేష్ బాబు నెం.1

ఫోర్బ్స్ జాబితా : తెలుగు సెలబ్రిటీలలో మహేష్ బాబు నెం.1

Published on Dec 12, 2014 2:00 PM IST

MAHESH-BABU
టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ మ్యాన్ గా మన్ననలు అందుకున్న సూపర్ స్టార్ మహేష్ బాబు మరోమారు తన చరిష్మా, సంపాదనతో రికార్డులకెక్కారు. ఫోర్బ్స్ ఇండియా పత్రిక తాజాగా వెల్లడించిన 100 మంది సెలబ్రిటీల జాబితాలో మహేష్ బాబు 30వ స్థానంలో నిలిచారు. తెలుగు చిత్ర పరిశ్రమ ప్రముఖులలో అగ్ర స్థానం మహేష్ బాబుదే కావడం విశేషం.

ఈ ఏడాది మహేష్ బాబు సంపాదన 51 కోట్ల రూపాయలని ఫోర్బ్స్ ఇండియా పత్రిక వెల్లడించింది. మహేష్ బాబు సంపాదన విషయంలో 14వ ర్యాంక్ లో నిలవగా, కీర్తి ప్రతిష్టల (ఫేం) విషయంలో 88వ ర్యాంక్ లో నిలిచారు. మహేష్ బాబు తర్వాత తెలుగు నుండి పవన్ కళ్యాణ్ (74), అల్లు అర్జున్ (80) ఈ జాబితాలో స్థానం సంపాదించారు.

పవన్ కళ్యాణ్ 16 కోట్ల రూపాయల సంపాదనతో ఫోర్బ్స్ ఇండియా సెలబ్రిటీల జాబితాలో 74వ, అల్లు అర్జున్ 11.5 కోట్ల సంపాదనతో 80వ స్థానంలో నిలిచారు. కీర్తి ప్రతిష్టల (ఫేం) విషయంలో పవన్ 86 (మనీ ర్యాంక్ 38), అల్లు అర్జున్ 79వ (మనీ ర్యాంక్ 54) ర్యాంక్ లలో నిలిచారు.

ఈ జాబితాలో సల్మాన్ ఖాన్ ఇండియాలో అగ్ర స్థానం కైవసం చేసుకున్నాడు. బిగ్ బి అమితాబ్ రెండవ, షారుఖ్ మూడవ స్థానాలలో నిలిచారు. తమిళ స్టార్ హీరోలు విజయ్ (41), రజినీకాంత్ (45), అజిత్ (51), ధనుష్ (78) లు కూడా తమ స్టార్ సత్తాను చాటారు.

పలువురు ప్రముఖ హీరోలకు ఆదాయపరంగా తక్కువ ర్యాంకు వచ్చినా…. సెలబ్రిటీ, కీర్తి ప్రతిష్టల జాబితాలో చెప్పుకోదగ్గ స్థానాలు దక్కడం విశేషం.

తాజా వార్తలు