
‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాతో తెలుగు థియేటర్లలో వినోదం వాకిట సంప్రదాయాల ముగ్గు వేశాడు దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల. సూపర్ స్టార్ మహేష్ బాబును పక్కింటి కుర్రాడిలా చూపిస్తూ, గోదావరి యాసలో చెప్పించిన డైలాగులు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమాతో మహేష్ బాబు కుటుంబ ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. ఫిల్మ్ నగర్ తాజా సమాచారం ప్రకారం వీరిద్దరూ మరోసారి కలసి పని చేయనున్నారు.
ప్రస్తుతం మహేష్ బాబు కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. శృతి హాసన్ హీరోయిన్. ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ సినిమాను వచ్చే ఏడాది వేసవిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత శ్రీకాంత్ అడ్డాల సినిమా పట్టాలేక్కుతుందని టాక్. అధికారికంగా ఎటువంటి సమాచారం లేదు. అయితే త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చే ఏడాది సినిమా చేస్తానని మహేష్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ముందు ఏది మొదలవుతుందో చూడాలి.
వరుణ్ తేజ్ హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కిన ‘ముకుంద’ ఈ నెల 24న విడుదలవుతుంది. ఇటివల విడుదలైన ఈ సినిమా పాటలకు శ్రోతల నుండి మంచి స్పందన లభిస్తుంది.