‘బ్రహ్మోత్సవం’.. మహేష్ తొలి తమిళ సినిమా!

Brahmotsavam1
‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు, సెన్సిబుల్ డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల కాంబినేషన్‌లో తెరకెక్కనున్న సినిమా ‘బ్రహ్మోత్సవం’. ప్రతిష్టాత్మక పీవీపీ సినిమా పతాకంపై ప్రసాద్ వి. పొట్లూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా నిన్న ఉదయం ‘బ్రహ్మోత్సవం’ ముహూర్తం కార్యక్రమాలు జరుపుకుంది. జూలై 10నుంచి రెగ్యులర్ షూటింగ్ జరగనుంది.

ఇక ఈ సినిమాకు సంబంధించి రెండు ఆసక్తికర విషయాలు అభిమానులకు ఉత్సాహాన్ని కలిగిసున్నాయి. మహేష్ బాబు ఈ సినిమాకు సహ నిర్మాతగా వ్యవహరించడం ఒక విశేషం కాగా, మహేష్ ఈ సినిమాతో తమిళంలో ఎంట్రీ ఇవ్వనుండడం మరో విశేషం. ఇప్పటివరకూ కేవలం డబ్బింగ్ సినిమాల ద్వారానే తమిళంలో పరిచయమైన మహేష్, బ్రహ్మోత్సవంతో తమిళంలో నేరుగా ఎంట్రీ ఇవ్వనుండడం ఆసక్తికరంగా మారింది.

విజయవాడ నేపథ్యంలో సాగే ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి షూటింగ్ జరుపుకోనుంది. ఇక విజయవాడ పరిసర ప్రాంతాలను ఇంతకుముందెన్నడూ చూపించనంత అందంగా చూపించాడానికి దర్శకుడు, సినిమాటోగ్రాఫర్ ఇప్పటికే సన్నాహాలు చేసుకున్నారు. బ్రహ్మోత్సవం లాంచ్ సందర్భంగా విడుదల చేసిన ‘బ్రహ్మోత్సవం’ లోగోలో తెలుగుదనంతో పాటు, టైటిల్ హుందాతనం ఉట్టిపడుతోంది. పేరుకు తగ్గట్టుగానే లోగోలో బ్రహ్మోత్సవ కళ వెలిగిపోతోంది. ఇక మహేష్ కెరీర్లో ఇది మరో మరిచిపోలేని సినిమాగా నిలుస్తుందని శ్రీకాంత్ అడ్డాల మొదట్నుంచీ చెబుతూ వస్తున్న విషయం తెలిసిందే. సంక్రాంతి కానుకగా జనవరి 8న ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

Exit mobile version