‘లక్కీ భాస్కర్’ వంటి భారీ విజయం తర్వాత దర్శకుడు వెంకీ అట్లూరి, కోలీవుడ్ స్టార్ హీరో సూర్య (Suriya) కాంబినేషన్లో వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘సూర్య 46’. ఈ చిత్రానికి ‘విశ్వనాథన్ అండ్ సన్స్’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు ఫిల్మ్ నగర్ టాక్. పీరియడ్ డ్రామాలు, ఫీల్ గుడ్ కథలను తెరకెక్కించడంలో దిట్ట అయిన వెంకీ అట్లూరి, ఈసారి సూర్యతో కలిసి ఒక విభిన్నమైన రొమాంటిక్ డ్రామాను సిద్ధం చేస్తున్నారు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత నాగవంశీ భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.
ఈ సినిమాలో ‘ప్రేమలు’ ఫేమ్ మమిత బైజు హీరోయిన్గా నటిస్తుండగా రాధిక శరత్‌కుమార్, రవీనా టాండన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. వయసులో చాలా వ్యత్యాసం ఉన్న ఇద్దరు వ్యక్తుల మధ్య సాగే ఆసక్తికరమైన ప్రేమకథగా ఈ చిత్రం రూపొందుతోంది. ఇప్పటికే చిత్రీకరణ దాదాపు పూర్తయ్యింది. కేవలం ఐదు రోజుల షూటింగ్ మాత్రమే బాకీ ఉంది. ఈ చిత్రానికి జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు.
సినిమా విడుదల గురించి నిర్మాత నాగవంశీ స్పందిస్తూ.. సూర్య (Suriya) నటిస్తున్న మరో చిత్రం ‘కరుప్పు’ విడుదలైన మూడు నాలుగు నెలల తర్వాతే ‘సూర్య 46’ థియేటర్లలోకి వస్తుందని తెలిపారు. ‘కరుప్పు’ చిత్రం ఏప్రిల్ 2026లో విడుదలయ్యే అవకాశం ఉండటంతో, వెంకీ అట్లూరి-సూర్య (Suriya) మూవీ జులై లేదా ఆగస్టు 2026లో ప్రేక్షకులను పలకరించనుంది. రెండు సినిమాల మధ్య సరైన గ్యాప్ ఉండాలనే ఉద్దేశంతో మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నారు.
