మంచు మనోజ్, మౌనిక భూమా మంచు ఆధ్వర్యంలో ప్రారంభమైన ‘ఐక్య ధైర్య సేన సమితి’

మంచు మనోజ్, మౌనిక భూమా మంచు ఆధ్వర్యంలో ప్రారంభమైన ‘ఐక్య ధైర్య సేన సమితి’

Published on May 17, 2026 11:02 PM IST

మంచు ఫ్యామిలీ నుంచి ప్రెజెంట్ ఉన్న స్టార్స్ లో మంచు మనోజ్ తనకంటూ ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ ని తెచ్చుకున్నాడు. అయితే తన పుట్టినరోజు సందర్భంగా మనోజ్ మంచు ఆయన భార్య మౌనిక భూమా మంచు కలిసి హైదరాబాద్‌లో కూకట్‌పల్లి లో రక్తదాన శిబిరం మరియు ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించి, తమ కొత్త సామాజిక సేవా సంస్థ “ఐక్య ధైర్య సేన సమితి”ను అధికారికంగా ప్రారంభించారు.

యూనిటీ(Unity) కరేజ్(Courage), సర్వీస్(Service), ఇంపాక్ట్(Impact) అనే నినాదంతో ప్రారంభమైన ఈ సంస్థ ఆవిష్కరణ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు, అభిమానులు, వాలంటీర్లు హాజరయ్యారు. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

సభను ఉద్దేశించి మాట్లాడిన ‘రా కింగ్’ మనోజ్ మంచు భావోద్వేగంతో అందరికీ స్వాగతం పలుకుతూ, తాము చిన్నప్పటి నుంచి సేవాభావాన్ని కుటుంబ సభ్యుల నుంచి నేర్చుకున్నామని తెలిపారు. ఈ సంస్థ ఆలోచన ఎలా వచ్చిందో వివరిస్తూ, సమాజానికి సేవ చేయాలనే ఆలోచన కలిగిన వారందరికీ ఒక వేదికను ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ఈ ట్రస్ట్‌ను ప్రారంభించామని చెప్పారు.

“అలాగే అందరికీ నా హృదయపూర్వక స్వాగతం. సమాజానికి అండగా నిలబడటం, సేవ చేయడం అనేది నేను, నా భార్య మౌనిక మా పెద్దల నుంచి నేర్చుకున్న విలువలు. ఇంతకుముందు కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాం. కానీ అదే ఆలోచన కలిగిన వారందరికీ ఒక వేదిక ఉండాలని భావించి ఈ సంస్థను ప్రారంభిస్తున్నాం. ఈ సంస్థ పేరును మా సోదరుడు, సన్నిహితుడు ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ప్రకటిస్తారు.

అయితే ముందుగా ఈ ఆలోచనకు మూలమైన మౌనిక భూమా మంచు కొన్ని మాటలు మాట్లాడాలి. ఈ ఆలోచన నిజంగా ఆమె నుంచే వచ్చింది. రక్తదాన శిబిరంతో పాటు, ఈరోజు నుంచే ఐదుగురు పిల్లలను దత్తత తీసుకుని వారి విద్యకు సహాయం చేయాలని నిర్ణయించుకున్నాం. ఇది ఇక్కడితో ఆగదు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి పట్టణం, ప్రతి గ్రామానికి ఈ సేవా కార్యక్రమాలను తీసుకెళ్తాం. ఈ సంస్థ ద్వారా ఎవరికైనా నిజమైన సహాయం అందితే, అదే మా జీవితంలో గొప్ప విజయంగా భావిస్తాం,” అని మనోజ్ అన్నారు.

ఇక ఈ సందర్భంగా మాట్లాడిన మౌనిక భూమా మంచు, తమ తల్లిదండ్రులు, పెద్దల ఆశీర్వాదాల వల్లే ఈ కార్యక్రమం సాధ్యమైందని తెలిపారు. రక్తదాన కార్యక్రమాలకే కాకుండా మహిళా సాధికారత, ఉపాధి కల్పనపై కూడా ఈ ట్రస్ట్ పనిచేస్తుందని వెల్లడించారు.

“అందరికీ నా హృదయపూర్వక స్వాగతం. మంచి ఉద్దేశంతో, మంచి ఆలోచనతో నేను, మనోజ్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. ఇది మా తల్లిదండ్రుల ఆశీర్వాదాల వల్లే సాధ్యమైంది. వారు మాకు మాత్రమే కాదు, మా పిల్లలు కూడా అనుసరించాల్సిన మార్గాన్ని చూపించారు.

ఈ ట్రస్ట్ కేవలం రక్తదాన కార్యక్రమాలకే పరిమితం కాదు. మహిళా సాధికారత, ఉపాధి కల్పన కోసం కూడా పని చేస్తుంది. ‘నమస్తే వరల్డ్’ అనే సంస్థను కూడా ప్రారంభించాం. దాని ద్వారా టాయ్ మేకింగ్ కోర్సుల సహకారంతో మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. సమాజానికి సేవ చేయడానికి ఇంకా ఎన్నో ప్రణాళికలు ఉన్నాయి. మీ అందరి ఆశీర్వాదాలు మాకు కావాలి. ఇప్పుడు ఈ ట్రస్ట్‌ను ప్రారంభించాల్సిందిగా నవీన్ అన్నను కోరుతున్నాను,” అని మౌనిక భూమా మంచు అన్నారు.

తరువాత ఎమ్మెల్యే నవీన్ యాదవ్ అధికారికంగా “ఐక్య ధైర్య సేన సమితి” పేరును ప్రకటించి, సామాజిక సేవ కోసం ఈ ప్రత్యేక నిర్ణయం తీసుకున్న మనోజ్, మౌనికలను అభినందించారు.

“ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా మనోజ్ మంచు అన్న అభిమానులకు ప్రత్యేక అభినందనలు. మా కుటుంబం, మనోజ్ అన్న కుటుంబానికి 30 ఏళ్లకు పైగా అనుబంధం ఉంది. చిన్నప్పటి నుంచే ఆయనలో సేవా భావం ఉంది. పుట్టినరోజు సందర్భంగా మౌనిక భూమా మంచు గారి ఆలోచనతో ఈ ట్రస్ట్‌ను ప్రారంభించడం ఎంతో అభినందనీయం. ఈ ట్రస్ట్ పేరు ‘ఐక్య ధైర్య సేన సమితి’ — దీని నినాదం Unity, Courage, Service, Impact. ఆ పేరు వాళ్ల ఆలోచన, సేవా భావాన్ని ప్రతిబింబిస్తుంది.

పిల్లలను దత్తత తీసుకోవడం, మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించడం వంటి నిర్ణయాలు ఎంతో గొప్పవి. ఈ కార్యక్రమాలను తెలుగు రాష్ట్రాల అంతటా తీసుకెళ్లేందుకు మనోజ్ అన్నకు నా పూర్తి సహకారం ఉంటుంది. ఈ సంస్థలో పనిచేసే ప్రతి వాలంటీర్‌కు నా శుభాకాంక్షలు,” అని నవీన్ యాదవ్ అన్నారు.

చివరగా మంచు మనోజ్ మంచు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.

“ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. రక్తదానం చేసిన వారందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ కార్యక్రమం నిర్వహణలో సహకరించిన అమోర్ హాస్పిటల్‌కు చెందిన కిషోర్ రెడ్డికి కూడా ధన్యవాదాలు. నా స్నేహితులు, కుటుంబ సభ్యులు, అభిమానులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. మీ అందరి ప్రేమ వల్లే నేను ఈ స్థాయిలో నిలబడ్డాను,” అని మనోజ్ మంచు ముగించారు.

ఇక ప్రస్తుతం ఆయన నటిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘డేవిడ్ రెడ్డి’. హనుమ రెడ్డి యక్కంటి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ భారీ పాన్ ఇండియా పీరియాడిక్ యాక్షన్ డ్రామాను నల్లగంగుల వెంకట్ రెడ్డి, భారత్ మోతుకూరి నిర్మిస్తున్నారు. 1897 నుంచి 1920 మధ్య బ్రిటిష్ కాలంలో జరిగే కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అంతర్జాతీయ నటి మారియా ర్యాబోషప్కా హీరోయిన్‌గా నటిస్తోంది.

ఈ చిత్రానికి సంబంధించి మనోజ్ మంచు చేస్తున్న “రియల్ స్టంట్స్ మోడ్” ట్రైనింగ్, ఫిజికల్ ట్రాన్స్‌ఫర్మేషన్ సోషల్ మీడియాలో విపరీతమైన చర్చకు దారి తీసింది. ఇటీవల విడుదలైన ‘డేవిడ్ రెడ్డి’ గ్లింప్స్ ఇప్పటికే 10 మిలియన్ డిజిటల్ వ్యూస్ దాటింది.

‘డేవిడ్ రెడ్డి’తో పాటు మరికొన్ని ఆసక్తికరమైన ప్రాజెక్టులతో మనోజ్ మంచు బిజీగా ఉన్నారు. ఇకపై ఆయన ప్రయాణం కేవలం సినిమాల వరకే కాకుండా, “ఐక్య ధైర్య సేన సమితి” ద్వారా సేవ, మానవత్వం, సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాల దిశగా కూడా కొనసాగనుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు