
మంచు వారి చిన్నబ్బాయి మంచు మనోజ్ – ప్రణతి రెడ్డిల నిశ్చితార్ధ వేడుక ఈ రోజు ఎంతో వైభవంగా జరిగింది. హైదరబాద్ లోని పార్క్ హయత్ హోటల్ లో జరిగిన ఈ వేడుకకి సినీ పరిశ్రమలోని ప్రముఖులే కాకుండా పలువురు రాజకీయ ప్రముఖులు కూడా హాజరయ్యారు. మొదట ప్రణతి, ఆ తర్వాత మనోజ్ తో పూజలు జరిపించారు. ఆపై మనోజ్ ప్రణతి తల్లిదండ్రులు లగ్నపత్రిక మార్చుకున్నారు. అనంతరం మనోజ్ ప్రణతి పరస్పరం ఉంగరాలు మార్చుకున్నారు.
ఈ వేడుకలో పురోహితులు లగ్న పత్రికను చదివి వినిపించారు. దీని ప్రకారం మనోజ్ వివాహాన్ని మే 20వ తేదీన నిర్ణయించారు. ముహూర్తం విషయానికి వస్తే మే 20వ తేదీన ఉదయం 9 గంటల 10 నిమిషాలకు ఖరారు చేసారు. ప్రస్తుతాని వివాహ మహోత్సవ వేదిక ఖరారు కాలేదు. త్వరలోనే వేదికని కూడా ఖరారు చేస్తారు.
మంచు ఫ్యామిలీ వారు అంగరంగ వైభవంగా జరిపించిన ఈ నిశ్చితార్ద వేడుకకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి, వైఎస్ విజయమ్మ, భూమన కరుణాకర్ రెడ్డి, సుశీల్ కుమార్ షిండే, నిమ్మగడ్డ ప్రసాద్, తలసాని ప్రసాద్ తదితర రాజకీయ నాయకులు, దాసరి నారాయణరావు, తమ్మారెడ్డి భరద్వాజ, పరుచూరి గోపాలకృష్ణ, జెమినీ కిరణ్, శ్యామ్ ప్రసాద్ రెడ్డి బ్రహ్మాజీ, తాప్సీ, జయప్రద వంటి ఎంతో మంది ప్రముఖులు పాల్గొన్నారు.
నిశ్చితార్దం పూర్తి చేసుకొని త్వరలో ఓ ఇంటివాడు కానున్న మంచు మనోజ్ కి 123తెలుగు.కామ్ తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.