
మణిరత్నం.. తన మ్యాజిక్ సినిమాలతో దేశంలోని గొప్ప దర్శకుల్లో ఒకరుగా పేరు తెచ్చుకున్న మాస్టర్ ఫిల్మ్‌మేకర్. తాజాగా ఆయన తెరకెక్కించిన సినిమా ‘ఓకే బంగారం’ (ఓకే కన్మణి). ఈమధ్యే విడుదలైన ఈ సినిమా మంచి విజయం సాధించిన విషయం తెలిసిందే! ఈ సినిమా తర్వాత ఆయన కొన్నాళ్ళ పాటుగా విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే నిన్న రాత్రి ఆయన ఢిల్లీలోని ఓ హాస్పిటల్‌లో ఓ రొటీన్ చెకప్ చేయించుకోగా మీడియాలో రకరకాల వార్తలొచ్చాయి.
మణిరత్నంకు గుండెపోటు వచ్చిందని, అందుకనే ఆయన హాస్పిటల్‌లో చేరారని ఉదయం నుంచి పుకార్లు పుట్టుకొచ్చాయ్! అయితే వాటన్నింటినీ మణిరత్నం సన్నిహితులు ఉదయమే కొట్టిపారేశారు. ఇదే విషయాన్ని మరోసారి తెలియజేశారు మణిరత్నం భార్య సుహాసిని. తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఈ విషయం గురించి చెబుతూ “ఆయన చాలా ఆరోగ్యంగా ఉన్నారు. తన తరువాతి సినిమా కోసం స్క్రిప్ట్ కూడా సిద్ధం చేసుకుంటున్నారు” అంటూ ఓ ఫోటోను పోస్ట్ చేశారామె. ‘ఓకే బంగారం’ సక్సెస్‌ను పూర్తిగా ఎంజాయ్ చేసిన మణిరత్నం మరో సూపర్ సినిమా కోసం సిద్ధమైపోవడం ఆయన అభిమానులకు సంతోషకరమైన వార్తే కదా!