పోషకాహార వారోత్సవాల సందర్భంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో నవయువ నిర్మాణ్ సంస్థ, కాంగ్రెస్ పార్టీ సంయుక్తంగా భారీ ఎత్తున సామూహిక శ్రీమంతాలు, అన్నప్రాసన కార్యక్రమాన్ని నిర్వహించాయి. యూసుఫ్‌గూడలోని మహమ్మద్ ఫంక్షన్ హాల్‌లో ఎమ్మెల్యే వి. నవీన్ యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకకు నియోజకవర్గానికి చెందిన సుమారు 2,000 మంది గర్భిణులు, చిన్నారులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా కాబోయే తల్లులకు ఎమ్మెల్యే నవీన్ యాదవ్ చీర-సారె, పసుపు-కుంకుమలను పుట్టింటి కానుకగా అందజేశారు. పేద కుటుంబాలకు చెందిన మహిళలకు భరోసా కల్పించేందుకే ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఆయన తెలిపారు. అనంతరం పలువురు చిన్నారులకు నవీన్ యాదవ్, జీహెచ్‌ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అన్నప్రాసన చేసి ఆశీర్వదించారు.
ఈ కార్యక్రమానికి టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, సీతక్క ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వీరితో పాటు మాజీ క్రికెటర్ మహమ్మద్ అజహరుద్దీన్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, ఉత్తమ్ పద్మావతి రెడ్డి, యశస్విని రెడ్డి, చిత్తెం పర్ణికా రెడ్డి సహా పలువురు కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.
