
ఒక భాషలో సూపర్ హిట్ అయిన సినిమాలో యూనివర్సల్ కంటెంట్ ఉంటే ఆ సినిమాని వేరే భాషలో రీమేక్ చెయ్యడానికి అన్ని భాషల హీరోలు ఎప్పుడూ ముందుంటారు. తాజాగా తెలుగులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇదే బాటలో ఓ తమిళ సూపర్ హిట్ ఫిల్మ్ రీమేక్ పై ఆసక్తి చూపుతున్నాడు. మాకు అందిన తాజా సమాచారం ప్రకారం.. జయం రవి హీరోగా ఇటీవలే విడుదలైన సినిమా ‘తని ఒరువన్’. పవర్ఫుల్ పోలీస్ డ్రామా కథాశంతో వచ్చిన ఈ సినిమా ఆగష్టు 28న రిలీజ్ అయ్యి తమిళంలో పెద్ద హిట్ అయ్యింది. ఈ సినిమాపై రామ్ చరణ్ చాలా ఆసక్తి చూపుతున్నాడు.
రామ్ చరణ్ సన్నిహితులు చెబుతున్న సమాచారం ప్రకారం.. రామ్ చరణ్ కి ఈ సినిమా బాగా నచ్చడంతో ఈ సినిమాని రీమేక్ చేయాలనుకుంటున్నాడట. ప్రస్తుతం తమిళ నిర్మాతలతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. త్వరలోనే ఈ విషయంపై క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. ఈ సినిమా ద్వారా అరవింద్ స్వామి విలన్ గా తమిళంలో రీ ఎంట్రీ ఇచ్చాడు. స్టైలిష్ విలన్ గా అతను చూపిన పెర్ఫార్మన్స్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇకపోతే రామ్ చరణ్ తన ‘బ్రూస్ లీ’ సినిమాని ఫినిష్ చేసే పనిలో ఉన్నాడు. ఇప్పటికే 85% షూట్ ఫినిష్ చేసిన ఈ సినిమాకి శ్రీను వైట్ల డైరెక్టర్.

