క్యాన్సర్‌ను జయించి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు సాధించిన చురుకంటి సుమతి జీవిత విశేషాలతో రూపొందించిన డాక్యుమెంటరీ ‘పునర్నవి’. సుమతి పుట్టినరోజు సందర్భంగా ఈ డాక్యుమెంటరీ ప్రత్యేక ప్రదర్శనను హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై డాక్యుమెంటరీని వీక్షించారు.
ప్రాణాంతక క్యాన్సర్‌ను ఎదుర్కొని మిసెస్ ఇండియా, మిసెస్ తెలంగాణ వేదికలపై నిలవడమే కాకుండా.. స్పెయిన్, కొరియా వంటి దేశాల్లో నిర్వహించిన అంతర్జాతీయ బ్యాడ్మింటన్ పోటీల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన సుమతి పోరాట ప్రయాణాన్ని ఇందులో ఆవిష్కరించారు. క్యాన్సర్‌తో పోరాడుతున్న ఎందరికో ఆమె జీవన ప్రయాణం గొప్ప స్ఫూర్తినిస్తుందని ఈ సందర్భంగా మంత్రి ప్రశంసించారు. ఈ కథను చక్కగా తెరకెక్కించినందుకు దర్శకుడు, నిర్మాత డాక్టర్ భీమగాని సుధాకర్ గౌడ్‌ను ఆయన ప్రత్యేకంగా అభినందించారు.
శ్రీ లక్ష్మీ ఎడ్యుకేషనల్ చారిటబుల్ ట్రస్ట్ సమర్పణలో సంతోష్ ఫిలిమ్స్ ఈ డాక్యుమెంటరీని నిర్మించింది. ఈ చిత్రాన్ని గోవా ఇండియన్ పనోరమాతో పాటు పలు జాతీయ, అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్స్‌కు పంపుతున్నట్లు చిత్ర బృందం స్పష్టం చేసింది.
