సినిమా థియేటర్లపై ఆంక్షలు.. క్లారిటీ ఇచ్చిన మంత్రి తలసాని..!


కరోనా థర్డ్‌వేవ్‌ వస్తుందన్న నేపధ్యంలో తెలంగాణలో సినిమా థియేటర్లపై ఆంక్షలు విధించబోతున్నారన్న ఊహాగానాలు మొదలయ్యాయి. దీనిపై తెలంగాణ సినిమాటోగ్రఫీశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ క్లారిటీ ఇచ్చారు. నేడు టాలీవుడ్‌కి చెందిన నిర్మాతలు, దర్శకులతో మంత్రి తలసాని భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనాను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం అన్ని రకాలుగా సిద్ధంగా ఉందని, సినిమా థియేటర్స్‌ని మూసివేస్తారనే అసత్య ప్రచారాన్ని నమ్మవద్దని, ప్రజలు ధైర్యంగా థియేటర్స్‌కి వెళ్లి సినిమాలు చూడొచ్చని చెప్పారు.

కరోనా కారణంగా రెండేళ్లుగా సినీ పరిశ్రమ ఎన్నో ఇబ్బందులు పడిందని, ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న పరిస్థితుల్లో ఒమిక్రాన్‌ భయాలు మొదలయ్యాయని అయినా భయపడాల్సిన పనిలేదని అన్నారు. సినీ పరిశ్రమపై వేల కుటుంబాలు ఆధారపడ్డాయని, వారందరికీ ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు. సంక్రాంతి వరకు పెద్ద సినిమాలు వస్తున్నాయని నిర్మాతలకు ఇబ్బంది కలగకూడదని అన్నారు. కొన్ని సమస్యలతో పాటు టిక్కెట్ ధరల పెంపు అంశం పెండింగ్‌లో ఉందని, సీఎం కేసీఆర్‌తో మాట్లాడి త్వరలో సమస్యల పరిష్కారానికి కృష్టి చేస్తానని మంత్రి తలసాని హామీ ఇచ్చారు.

Exit mobile version