విడుదల తేదీ : సెప్టెంబర్ 18, 2026
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5
నటీనటులు : రామ్ కార్తీక్, అమ్ము అభిరామి, వైదిక సెంజలియ, అంకిత్ కొయ్య, గోపరాజు రమణ తదితరులు
దర్శకత్వం : వాచస్పతి
నిర్మాత : పి.నరేష్ బాబు
సంగీత దర్శకులు : ఆర్.ఆర్.ధృవన్
ఛాయాగ్రహణం : సామ్ కె నాయుడు
కూర్పు : బసవా రెడ్డి
సంబంధిత లింక్స్ : ట్రైలర్
అమ్ము అభిరామి ప్రధాన పాత్రలో నూతన దర్శకుడు వాచస్పతి జొన్నలగడ్డ తెరకెక్కించిన క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ ‘మిస్సింగ్ మేఘన’. నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం.
కథ:
వైజాగ్‌లో ఓ బేకరీ నడుపుకునే మేఘన(అమ్ము అభిరామి) ఒక రోజు అకస్మాత్తుగా కనిపించకుండా పోతుంది. ఆమె కనిపించకుండా పోవడానికి కారణం ఏంటి? అసలు ఆమె కిడ్నాప్ అయిందా లేదా? ఈ కేస్‌ను ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్(ఆర్పి కౌశిక్) ఎలా ఛేదించాడు? మేఘన స్నేహితులు, శత్రువుల చుట్టూ తిరిగే ఈ విచారణ చివరకు ఎలాంటి నిజాలను బయటపెట్టింది? అనేది మిగతా కథ.
ప్లస్ పాయింట్స్:
కిడ్నాప్ డ్రామాలు టాలీవుడ్‌కి కొత్తేమీ కాకపోయినా, దర్శకుడు ఫస్ట్ హాఫ్‌ను ఆసక్తికరంగానే మొదలుపెట్టాడు. ముఖ్యంగా మొదటి భాగంలో ఇన్వెస్టిగేషన్ సీన్లు వేగంగా సాగుతూ ఎక్కడా బోర్ కొట్టకుండా చూసుకున్నారు.
హీరోయిన్గా అమ్ము అభిరామి తన పాత్రలో చక్కగా ఒదిగిపోగా, తండ్రి పాత్రలో గోపరాజు రమణ మరోసారి మంచి నటనను కనబరిచారు. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్‌గా ఆర్పి కౌశిక్, హీరోయిన్ ఫ్రెండ్‌గా అంకిత్ కొయ్య తమ పరిధి మేరకు ఆకట్టుకున్నారు. రామ్ కార్తీక్ నటన బాగుంది. రెండో భాగంలో అమ్ము – రామ్ కార్తీక్ మధ్య వచ్చే కొన్ని సీన్లు సీరియస్ మూడ్‌లో ఉన్న ప్రేక్షకులకు కాస్త రిలీఫ్‌నిస్తాయి.
మైనస్ పాయింట్స్:
ఇలాంటి క్రైమ్ థ్రిల్లర్ల విజయం అంతా స్క్రీన్‌ప్లే, ఎగ్జిక్యూషన్ మీద ఆధారపడి ఉంటుంది. ఫస్ట్ హాఫ్ పర్వాలేదనిపించినా, సెకండ్ హాఫ్‌ను సాగదీయడం అతిపెద్ద మైనస్. రెండో భాగంలో వచ్చే కొన్ని సీన్లు, డైలాగ్స్ 2010 కాలం నాటి రొమాంటిక్ షార్ట్ ఫిలింలను గుర్తుచేస్తాయి.
అలాగే అసలు విలన్ ఎవరనేది కనిపెట్టడం ప్రేక్షకులకు పెద్ద కష్టమేమీ కాదు. హీరోయిన్‌కి బాగా దగ్గరైన వ్యక్తే కనిపించకుండా పోవడంతో మిస్టరీ రివీల్ కావడం చాలా ఈజీ అయిపోయింది. ఇక సినిమాలో ఉన్న లాజిక్ లూప్ హోల్స్ కూడా నిరాశపరుస్తాయి.
ఈ డిజిటల్ యుగంలో మొబైల్ నంబర్ ద్వారా ఒకరి పేరు తెలుసుకోవడం అంత పెద్ద కష్టమైన పనిలా చూపించడం, అలాగే ఫోన్లో విన్న గొంతు నేరుగా కలిసినప్పుడు హీరో గుర్తుపట్టకపోవడం లాంటి సీన్స్ చాలా వింతగా అనిపిస్తాయి.
బీజీఎం కూడా థ్రిల్లర్ మూడ్‌ని క్యారీ చేయలేకపోయింది. పాటలను ట్రిమ్ చేసి ఉంటే బాగుండేది. క్లైమాక్స్ కూడా ముందుగానే ఊహించేలా ఉండటం, ఎలాంటి ట్విస్టులు లేకపోవడం నిరాశపరుస్తుంది.
సాంకేతిక వర్గం:
దర్శకుడు వాచస్పతి జొన్నలగడ్డ అనుకున్న పాయింట్ పేపర్‌పై బాగున్నా, దాన్ని తెరపైకి తీసుకురావడంలో ముఖ్యంగా సెకండ్ హాఫ్‌లో తడబడ్డారు. ఆర్.ఆర్.ధ్రువన్ సంగీతం థ్రిల్లర్ సినిమాకి తగ్గట్టుగా లేదు. సామ్ కె. నాయుడు సినిమాటోగ్రఫీ పర్వాలేదు. బసవా రెడ్డి ఎడిటింగ్ ఇంకాస్త షార్ప్‌గా ఉంటే బాగుండేది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.
తీర్పు:
మొత్తంగా చెప్పాలంటే.. ‘మిస్సింగ్ మేఘన’ కొత్తదనం లేని ఒక రొటీన్ క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్. ఫస్ట్ హాఫ్‌లోని కొన్ని ఇన్వెస్టిగేషన్ సీన్లు, అమ్ము అభిరామి నటన మినహా ఆకట్టుకుంటయి. సాగదీసిన సెకండ్ హాఫ్, ఊహకందే క్లైమాక్స్, లాజిక్ లేని సీన్లు ఈ సినిమా గ్రాఫ్‌ను తగ్గించేశాయి. క్రైమ్ థ్రిల్లర్ చిత్రాలను ఇష్టపడేవారు ఈ వీకెండ్‌కి వేరే ఆప్షన్స్ చూసుకోవడం బెటర్.
123telugu.com Rating: 2.5/5
Reviewed by 123telugu Team
